Monday, October 30, 2017

శ్రీకారబంధము -1

మా స్వగ్రామము(గవరపేట)లో ప్రతీ దీపావళికి గౌరిదేవిని మా దేవాలయము నందు ప్రతిష్టించి, ఒక మాసము అమ్మవారు మా పురజనుల పూజలందుకొనును. ఇటువంటి గవరపేటలందు సంబరాలు(క్షణములు) అంబరాన్ని అంటుతాయి. శ్రీకారబంధమున నా తొలి ప్రయత్నము. ఈ బంధము పరిచయము చేసినందుకు సుప్రభ గారికి ధన్యవాదములు. 
*******************************************************************
కం. శ్రీ గౌరి! హృదయ శంకరి
గా, గాంధర్వి! దయతోడఁ గాంచుము తల్లీ! 
యీ గవరపేట లందు స్వ
రాగాల క్షణము లిడుదుము, ప్రణయము నందున్! 
*******************************************************************

Thursday, October 19, 2017

దీపావళి శుభాకాంక్షలు

దీపావళి శుభాకాంక్షలు
*********ద్విపదమాలిక********************
దీపావళిన్ నింటి దీపాలు వెలుగు
భూ ప్రజలందున భోగమ్ము కలుగు
చిన్న,పెద్ద యనెడి చిరమరల్ లేక
కన్నుల విందుగా కలిసున్న రోజు
లక్ష్మి దేవిని గొల్చు లక్ష్యమ్ము కొరకు
సూక్ష్మమౌ లోపముల్ చూపవలదని
రాక్షతత్వమ్ము పారద్రోలి భువిని
వీక్షించు నెల్లరు విశ్వశాంతి కని
క్రొత్త వస్త్రములతో, కొవ్వొత్తుల మెయి
చిత్తము నందున చిరునవ్వు పెంచు
ముంగిలి నిండుగా ముగ్గులు వేసి
పొంగెను పడుచులు పూమాల లందు
సంధ్యాసమయమున సరదాలు మొదలు
మాంద్యమ్ము జూపక మందితో కదులు
పక్కనే టామ్ టామ్ టపాకాయ లన్ని
తొక్కు తూమ్ తూమను తూటాలు కొన్ని
కాకరపువ్వొత్తు కాంతులు జిమ్ము
ఏకమై పిల్లలు నెగసిల్లి గుమ్ము
చిచ్చుబుడ్డులు చింది జివ్వున బొంగు
వచ్చి పో యందర్కి వర్ణముల్ జూపు
దివ్వెల వెలుగులు దివ్యమ్ము దలచి
నవ్వుల పువ్వులన్ నలుగుర కిచ్చు
***************************************************


Sunday, October 15, 2017

భారత రాజ్యాంగము - అభిప్రాయ ప్రకటన స్వేచ్ఛ - ప్రజ పద్యం చివరి పక్షము

భారత రాజ్యాంగము - అభిప్రాయ ప్రకటన స్వేచ్ఛ
మ.కో. మాటలో నిడు, భారతమ్మున మంచి యన్నది పంచుచున్
మాట జారిన మార్చలేమను మర్మమెప్పుడు మర్వకన్
మూట కట్టిన పల్కులన్నియు ముచ్చటించుము శాంతికై  
బాట వెంబడి నవ్వు పువ్వులు భాగ్యమేకద నేటికిన్! (1)

ఆ.వె. స్వేచ్ఛ పలుకు లన్ని విచ్చలవిడియైన
హానిజేసి మార్చు హద్దుమీరి
మెప్పుపొందు మాట మేలగున్ సోదరా
తెలిసి మసులు కొనుము దివ్య మగును  (2)

కం. నొప్పించెడి మాటలతో
తప్పుగ మాట్లాడరాదు ధరణిన్ పరులన్
ఒప్పును తెలుసుకొనిన సరి   
మెప్పుని చెప్పక మరచిన మేలగును గదా!  (3)

మ.కో. జాతిరక్షణ కాలరాయుచు జాతి వైరము పెంచకన్
నీతివీడి విదేశహస్తము నెయ్యమౌనని ద్రోహమున్
పాతకక్షలు త్రవ్విజూపెడు పల్కులాడుట మానుచున్
చేతనైన సహాయహస్తము శ్రేష్ఠమైనది దేశమున్   (4)


తే.గీ. స్వచ్ఛ భారత దేశపు వాక్కు నెపుడు
నుచ్చరించుము స్వేచ్ఛగ నూతి కొరకు
రెచ్చగొట్టేడు, దూషించు రీతి నొదలు
నచ్చుమాటలు నెప్పుడు నాణ్యమగును (5)
ఊతి = రక్షణ
… మల్లేశ్వరరావు పొలిమేర
   Trophy Club, Texas, USA. Ph: +1 9253894335