Posts

Showing posts from August, 2021

తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలు

Image
సీ. మదిలోన మెదిలిన మౌనగానములకు   నక్షరసామ్యము నందు భాష  పలుకులో ముత్యాలు వెలికితీయగ మెచ్చు  పదసంపదలు గూర్చి పంచు భాష  రచనలో సరళమై రమ్యమౌచుఁను రాగ  మాలిక వృత్తమౌ మరలు భాష  ఆలకించుటకైన అమృతమ్మయి చెవులు సున్నితధ్వనిలోన సొగయు భాష ఆ. జానపదములిముడు సాహిత్యసంపద  పద్యసొగసు నిముడు ప్రౌఢ భాష  గిడుగు నన్నయాదు లడుగులో వికసించి  దివ్య మైన వాణి  తెలుగు భాష  

శ్రీహరి కల్యాణమహోత్సవము

చదువులు కావవి, పరుగెడు!    పదవులు కావవి, మనసుని పలుకగ లేకన్ చెదిరిన బ్రతుకుల కుంపటి! కుదురగు మార్గము తెలియును, కొలవగ భక్తిన్!  (1) పలికిన మాటలు వేఱఁగు  కలిగిన చేతలు నిరతము గమ్యము లేకన్ చిలికిన ధనములు వెతలగు  విలువగు జీవమును ముక్తి వెలుగును భక్తిన్!  (2) మంగమ్మను మోయు  సుకృత మింగ దొరికెను మదిలోన మెచ్చగ నేడున్ హంగులతో నోర్లాండన్ రంగుల శోభలను మురిసె ప్రాయము భక్తిన్! (3)   ఎంతటి భాగ్యము, శ్రీహరి  ఇంతటి కళ్యాణమందు నిక్కడ జేర్చెన్     వింతగ లోకము జూసిన  అంతరమందున ప్రశాంతమందెను భక్తిన్! (4)

రాఖి పౌర్ణమి శుభాకాంక్షలు

Image
 సీ. తోబుట్టు అమ్మవై  దోబూచు దొంగవై  గారాల పట్టియై కదులు నీవు గయ్యాళి గంపవై కయ్యాల కంచువై  కేరింత గొట్టేటి కీచురాయి అన్నకే యన్నయై యన్ని "నా వంటివే"  చిన్ని చిట్కాలతో చెలిమి కోరి  ఏడ్చుచు నవ్వుతూ వీడంటు గిల్లుతూ అల్లరి పిల్లయౌ  అన్నతోడు    తే.గీ. రాఖి పౌర్ణమి శోభతో రవళి యొసగి  రాఖి కట్టగ యదలోన ప్రణయమొసగి రాఖి సందడి అందడి రాగమొలకి  నన్ను మెచ్చగ వచ్చెరా నాదు చెల్లి  

సరస్వతిగార్కి నా సమర్పణ

Image
తేటగీతి : వాక్కు శక్తులన్ పురిగొల్పు వాణి వౌచు పెక్కు యుక్తులన్ సరిజేయు విద్య జూపి    మ్రొక్కు ముక్తులన్ నెరవేర్చు పోకడందు చిక్కులన్నియున్ ఛేదించె శిఖరిణి గను (1) వాణి = సరస్వతి   పోకడ = గమనము, నడత శిఖరిణి =   ఉత్తమ స్త్రీ తేటగీతి : అడరి గరిమెళ్ళ వారింట నాడ పడుచు   లక్ష్మి రమణలకాఖరి ప్రవరమవుచు మాత మార్గము న్  తోడుండి మంచి నెరిగి    బాల్యమున్ విద్యలకు నాందిపల్కి చూపె! (2)       అడరి = జనించి    , పుట్టి   ప్రవరము = సంతానము   కందం: సహనము తోడ సరస్వతి  సహృదయపు  చదువులతల్లి! సంశయమేలన్! సహచరులందున మెలుగుచు   మహిళాభ్యుదయముకు తాను మహిలో మెదిలెన్! (3)   ఉత్పలమాల : భారతి నామధేయమును బాధ్యత, నిచ్చను మేళవించుచున్ చేరితి సంప్రతిష్ఠలను స్వీయకృషిన్, పలు బ్రహ్మశక్తులన్ కోరితి విద్య విస్తరణ గోప్యము లేమని శిష్యబృందమున్ వారధి వంటి జీవనము పంచిరి! బోధన మార్గమెంచుచున్!       (4) సంప్రతిష్ఠ =   ఉన్నతస్థితి శార్దూలవిక్రీడితము ఉద్యోగంబున స్ఫూర్తిదాయకముతో నుత్తీర్ణతన్ పొందుచున్ ఆద్యంతమ్మున భక్తి...

స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

స్నేహం  నా స్వప్న లోకానికి నాంది స్నేహం  నా ఒంటరి పోరుకు ఊరట స్నేహం  నా ఎడారి బాటలో నమ్మకం స్నేహం  నా గమ్యపు మజిలీ గుర్తులు స్నేహం  భయభక్తుల సంఘర్షణలో  మంచిచెడుల సమాలోచనలో  ప్రేమానురాగల సముపార్జనలో  మరో మజిలీ నా స్నేహం  విభిన్న సంస్కృతులకు నిలయం  విభిన్న సంస్కరణలకు నిలయం  విభిన్న సంకీర్తనలకు నిలయం  విశ్వసృష్టిలో మరో మజిలీ స్నేహం  హాస్యానికి ఆయుపట్టు స్నేహం  కరుణలో కరిగిపోవు స్నేహం  రౌద్రానికి చోటివ్వని స్నేహం  వీరత్వాన్ని వెలికితీయు స్నేహం  భయానకంలో బలము జూపు స్నేహం  భీభత్సాన్ని బిగియపట్టు స్నేహం  అద్భుతాన్ని ఆహ్లాదించు స్నేహం  శృంగారాన్ని శోభలను ఇముడించు స్నేహం  శాంత జీవితపు సోఫాన మజిలీ స్నేహం