Posts

Showing posts from May, 2017

మనబడి ప్రవేశము పూర్తి

సీ. నిన్నమొన్నను గద చిన్నవారిగ దల్చె నింతలోన ప్రవేశమంత నేర్చె సమయము నిచ్చుచు శ్రద్దగా చెప్పిన నేర్వలేనిది యేమి? నేటి బాల తెలుగు బోధించుచు వెలుగు నింపుటలోన నేను సైతమనుచు నేర్పినాను మాతృభాషను దెల్పి మనబడితోడను తల్లిదండ్రులు గూడ తరలిరండి తే.గీ. అన్యభాషలు నేర్చుచు యధికులగును, మాతృభాషలో పిల్లలు మదిని తట్టు వీరు నేర్చిన తెలుగును వీడ వద్దు మీకు తోచినంత దెలిపి మెరుగు పరుచు.

మాతృదినోత్సవము

మాతృదినోత్సవము... సీ. ప్రాంతాలు వేరైన పడికట్లు వేరైన పుట్టుకనిచ్చెడు పుణ్యమూర్తి భాషలు వేరైన భావాలు వేరైన పసికందు పాలిట పరమ పదము జాతులు వేరైన చేతలు వేరైన నిత్యము నీతోడు నిలుచు నమ్మ పండగ లెన్నున్న పగవారి వైనను మాతను కొలుచు నీ మంచి రోజు తే.గీ. ఒక దినము లేక పదివేలె యున్నను మది తలచు నా త్యాగజీవికై, తగవులేల? చేయకుండుటనింగమ్ము చెంత నుంచి నచ్చి, కొలుచు వారందఱిన్‌ మెచ్చు కొనుము మొదటి ప్రతి .. సీ. ప్రాంతాలు వేరైన పడికట్లు వేరైన పుట్టుకనిచ్చేటి పుణ్యమూర్తి భాషలు వేరైన భావాలు వేరైన పసికందు పాలిట పరమ పదము జాతులు వేరైన చేతలు వేరైన నిత్యము నీతోడు నిలుచు నమ్మ పండగ లెన్నున్న పగవారి వైనను అమ్మను గుర్తించు కమ్మ రోజు తే.గీ. ఒకటి యున్నను పదివేలు యున్నను మది తలచు నా త్యాగజీవికై, తగువులేల? చేయు, చేయకుండుటలు నీ చేత నుంచి నచ్చి కొలువు వారందర్ని మెచ్చు కొనుము

జలవనరుల సంరక్షణ -1

తే. పంచభూతములందున్న ప్రకృతి ధార జీవరాసులు కోరగ జీవనమున, నీటి సంరక్షణము మదినెంచకుండ మానవులొనర్చు నెందుకో? మలినమిపుడు.

నమన

నమన - మే ఒకటవ తారీకును మేడే అంటారు. కష్టములో ఉండే వారు సహాయానికి కూడ మేడే, మేడే అని ఆపదను సూచించే రేడియో సందేశమును పంపుతారు ఈ మేడే అనే పదము ఫ్రెంచిలోని m'aidez నుండి వచ్చినది. నాకు సహాయము చేయమని అర్థము. దీనినే SOS అని కూడ అంటారు. SOS కు మూడు dit, మూడూ dah, మళ్లీ మూడు dit. dit కొంచెము కాలము ధ్వనించే శబ్దము, dah దీర్ఘ కాలము ధ్వనించే శబ్దము. dit లఘువు, dah గురువు. SOS అప్పుడు III UUU III అవుతుంది, అనగా న/మ/న గణములు. క్రింద సార్థకనామ గణాక్షర వృత్తము "నమన"కు నా ఉదాహరణములు - నమన - న/మ/న IIIU UU III లేక III UU UIII 9 బృహతి 456 నమన మైతిన్ నేనిపుడు గమన మార్గం బాతనిది సుమము లెల్లన్ బూజలకు నమల మయ్యెన్ మానసము మనసులో నెప్డున్ దలఁపు స్వనములో నెల్లన్ వలపు తనువులో వంపుల్ బిలుపు దినములో దివ్వెల్ వెలుఁగు హృదయమా వద్దే వలపు వ్యధలతో వద్దే కలపు ముదము నీయండే యతఁడు వదలు నీకేలా వగపు విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు నా ప్రయత్నము మరువలేకన్ బంధములు తిరుగుతుండెన్ బాధ్యతగ పరుగులెట్టెన్ కాలమున బరువులెక్కెన్ గుండియను ...