Tuesday, November 21, 2017

శ్రీగౌరి

ఇంద్ర వజ్రము - యతి ఆఱవ అక్షరముగా
శ్రీగౌరిని మా ఊరుకి ఆహ్వానిస్తూ ...
*****************************
పిళ్ళారి తల్లీ విహరించు మాతో
కళ్ళన్ని నీకై కలిగించె నేడున్
మళ్ళించుచూ రా మననూరు లోకిన్
త్రుళ్ళింత మాయందున బొంగె గౌరీ! 
*****************************
పిళ్ళారి = వినాయకుడు
కలిగించె = సృజించు



Saturday, November 18, 2017

శ్రీగౌరి

ఉత్సాహము
గవరపేట లందు వెలసి కరుణ జూపు తల్లివై
అవనినెల్ల శక్తి రూపమౌచు గొల్చు నారివే
కవనమందు యుక్తి కొలది కల్పనమ్ము కూర్చెదన్
శివుని తోడ దీవనలను చివరి వరకు చూపుమా!

గౌరీ 
******************************************
కొలిచెద మనసు నిరతము తల్లీ 
తలచెద ప్రతిదినము హిమపుత్రీ
వలపుని సుతునకు నిడుచు గౌరీ 
విలసితమయిన కరుణవు నీవే! 
******************************************
గౌరి

గౌరి పద్య లక్షణములు

  1. వృత్తం రకానికి చెందినది
  2. అతిజగతి ఛందమునకు చెందిన 2048 వ వృత్తము.
  3. 13 అక్షరములు ఉండును.
  4. 15 మాత్రలు ఉండును.
  5. మాత్రా శ్రేణిI I I - I I I - I I I - I I U - U
    • 4 పాదములు ఉండును.
    • ప్రాస నియమం కలదు
  6. ప్రతి పాదమునందు న , న , న , స , గ గణములుండును.

Monday, November 13, 2017

ఇంద్రవజ్రము

ఇంద్రవజ్రము - యతి ఎనిమిదవ అక్షరము
**********************************************
పద్యాల పైనమ్మును భాగమౌచున్
అధ్యాయనమ్మున్ మనసంత నుండెన్
విద్యాధికారుల్ తగు వృద్ధికై నా
యద్యత్వమున్ తోడుగ నంది నారే!
**********************************************
ఆరవ స్థానము యతిగా :



ఇంద్రవజ్రము యతి ఆఱవ అక్షరముగా
శీర్షిక : మనుజుండు 
*********************************************
నానాటికిన్ మన్ననలన్ని వీడెన్ 

ప్రాణమ్ముకన్నా ద్రవిణమ్ము కోరెన్
మానమ్ము లేకన్ మనుజుండు మారెన్
ఏనాటికిన్ తానెఱుఁగుండు దీనిన్!
*********************************************


ఇంద్రవజ్రము:
వృత్తం రకానికి చెందినది
త్రిష్టుప్పు ఛందమునకు చెందిన 357 వ వృత్తము.
11 అక్షరములు ఉండును.
18 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: U U I - U U I - I U I - U U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు 8 వ అక్షరము యతి స్థానము
ప్రతి పాదమునందు త , త , జ , గా(గగ) గణములుండును.

Friday, November 10, 2017

రాట్న బంధము

"రాట్న బంధము" లో రాట్నము చెప్పు మాటలుగా వ్రాయబడినది.
*****************************************************
కం. గాంధీతో చిహ్నమవుచు
బంధమ్మును కలిగియుంటి ప్రతి చిత్రమునన్
సంధి, విధి సంస్మరణముల్
రంధి కొరకని తను జెప్పి ప్రగతిని గనిరిన్
******************************************************
సంధి = కూడిక
రంధి = ఏకాగ్రత

Wednesday, November 8, 2017

నాగ బంధములు

*********************************************************
సీ. కమతము వృత్తయి కార్యము నందున 
కాలుకి తగిలిన కాటు బడుచు 
పూజించినను గడు పుణ్యము గూడక
విగత జీవులవుచు వీడి నారు 
భూతలమ్మున మానవులతోడ జీవించు
ఫణులను కాంచగ భయము కలుగు 
కలలోన వచ్చిన కలత పడుచునున్న 
మానవుల్ మనసును మార్చు టేల? 

తే.గీ. నిశిత దృష్టితో బ్రాయము నిలుపుటకును
నిరువురి ప్రయత్నమగుచు ననిశ్చితమగు 
విషము కలిగి యుండుట వాని వృజినమౌన?
దశను మార్చుటన్ మనిషికి తగదు గాద!
*********************************************************

Tuesday, November 7, 2017

విశాఖ ప్రజా పద్య సమ్మేళనము


ద్విపదమాలిక
*********************************************
ప్రజపద్యము తలచె పద్య పక్షములు
ప్రజలకు జేరువౌ వర్ణమాలలవి

కవుల మనస్సున కలముల నుండి
ప్రవహించు సెలయేరు ప్రణయపు టేరు

ఏమి భాగ్యము నాది ఎదురపడినది
సాముల సాంగత్య సహవాసమబ్బె

అడ్మిన్ల ప్రోత్సాహమందిన నాడు
కడ్మియగుచు నాశ కదిలాడె కలము

నా వంతు కృషితోడ నాకు వచ్చినది
సేవ జేయ దలచి చేయూత నిచ్చె

ఆణిముత్యములను నావిష్కరించి
వేణుగానములతో విందగు రోజు
*********************************************
కడ్మి = అతిశయము

*************************************
కం. సంద్రపు తీరము జేరి క
వీంద్రులు పద్యములు బాడు వేళాయెనురా!
ఇంద్రుని సభలకు ధీటుగ 
ఆంధ్రుల విద్యలను జాటి ఆహా యనరా!   
*************************************   

Wednesday, November 1, 2017

నాగబంధము

నాగబంధము 
మొదటి రెండు పాదములు "ప్రియురాలు" 
తరువాత రెండు పాదములు "ప్రియుడు" పలికినట్లు వ్రాయబడినది. ప్రయత్నము, సవరణలు ఉన్న తెలుప ప్రార్ధన. 
*********************************************************
కం. మామ! బ్రమ వీడ లేకన్
నీ మదిలోన మెదులు నిజ నిజమును నేనే!
భామ! శ్రమ మేడ లేకన్
ఆమెగ లోని మనసు గను అనుఁగును నేనే!
*********************************************************
నిజ = నెచ్చెలి,
నిజము = స్వభావము
ఆమె = భార్య
అనుఁగు = ప్రియుఁడు