శ్రీగౌరిని దలచక...
*******************కందం************************
శ్రీగౌరిని దలచక నే
నే గేయము పాడగలిగి, ఇచ్చను తెలిపే
రాగాల నాలపించక
సాగేటి దినములు జూసి సాగుట యెటులో (1)
పల్లెను మాత్రము కనబడు
ఉల్లము లోతట్టు భక్తి యుక్తుల నెన్నో
అల్లందు పురపు పరుగున
చెల్లదు, విడివడు విధములు చెప్పుము తల్లీ ! (2)
ఏమమ్మా! నీ జాతర
లేమియు కనబడు ఘడియలు ఎప్పటి మాటో!
ప్రేమగ నీకై రచనలు
నీమముగ విడిచిన నాకు నిక్కము గాదా ! (3)
నా దేశము నా రాష్ట్రము
నా దేవత నా పురములు నా మది నుండెన్
నీ దయయును నీ దక్షత
నీ దాసుని నెమ్మి నుంచి నిత్యము తోడౌ! (4)
అమ్మల గన్నటి యమ్మగ
నమ్మిన భక్తి కిడి శక్తి నలుదిక్కులలో
అమ్మకు దూరము నున్నను
కమ్మని కార్యములతోడ కాచుము తల్లీ ! (5)
*******************************************
కందం పద్య లక్షణములు:
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
రెండవ పాదమునందు 4 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
నాలుగవ పాదమునందు 4 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
ఒకటవ పాదమునందు మూడు 4 మాత్రల గణములుండును.
రెండవ పాదమునందు ఐదు 4 మాత్రల గణములుండును.
మూడవ పాదమునందు మూడు 4 మాత్రల గణములుండును.
నాలుగవ పాదమునందు ఐదు 4 మాత్రల గణములుండును.
6వ గణము నల లేదా జ కావలెను.
చివరి అక్షరం గురువు కావలెను.
బేసి గణం జ కూడదు
మల్లేశ్వరరావు పొలిమేర
07.12.2019