Wednesday, August 30, 2023

రాఖి పౌర్ణమి శుభాకాంక్షలు

సీ. 

దూరమైననుగాని చేరువైనను గాని

సరితూగు యమ్మకు  సాటి యెవరు?

అన్నదమ్ములు తన ఆత్మబలము యంచు

కన్నవారింటను కాంచు నెవరు?

కష్టసుఖాలలో కార్యనిర్వహణలో

తనవారు యని వాలు తాప సెవరు?   

వలపు పంచుటలోన తలపు నింపుటలోన

అక్కచెల్లెలకంటె నెక్కువెవరు?

తే.గీ. 

రక్ష కట్టగ బంధమ్ము రమ్యమయి, ని 

రీక్షణలు వీడి తోబుట్టు ప్రేమ పొంది, 

వీక్షణములన్ని వెలుగొంది స్వీయ మయిన 

నా క్షణముల మధురిమలనంది చూడు! 



Tuesday, August 29, 2023

తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలు

 *******తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలు*****

సీ.
తెలుగువాడిని జూసి తెలుగు గ్రేటనిపల్కి
యక్కున జేర్చగ నెక్కుపెట్టి
మాతృభూమిని వీడి మనయూరి సంస్కృతి
నన్యదేశములలో నాలపించి!
మనబడుల్ నెలకొల్పి మనజాతి మేల్కొల్పి
మనబిడ్డలకు నేర్పి మంచి భాష
గిడుగు వారిని బోలి యడుగుజాడలనెంచి
మనవారిపెంపుకై మార్గమెంత్రు!

తే.గీ.
తెలుగు భాష సేవకులయి నిలుచు వారు
భాషతోబాటు బాధ్యతల్ పంచుచున్న
తెలుగుతల్లికి లోటేమి? వెలుగ నెపుడు
నుత్సవమ్ములే జరుపుచునుందురు గాద!
---మల్లేశ్వరరావు పొలిమేర
08.29.2023