Monday, October 23, 2023

విజయ దశమి శుభాకాంక్షలు 2023

విజయ దశమి శుభాకాంక్షలు 2023 -- మల్లేశ్వరరావు పొలిమేర

****************కుమారి (కురరీరుతా)************

పడతులు నేడు - పండుగల వేడుకలో

వడివడిగాను - బంధువుల కూడికలో

పుడమినిఁ దాము - స్ఫూర్తినిడి యుక్తులతో

నడవఁడి నెంచు - నాణ్యతగు శక్తులతో! (1)


కొలుచుచు గౌరి - గోత్రముల రూపములన్

తలచుచు నమ్మ - స్థాయిల స్వరూపములన్

గెలుపును దెల్పు - కీర్తిపథ గానములన్

వలపులు నింపు - భక్తిరస ప్రాయములన్! (2)


దశమున రామ - దర్శనపు శోభలతో

అసురుల నగ్ని - నాహుతిడు పోకలతో

నిశితపు దృష్టి - నిక్కమగు నేర్పులతో

వసతుల హర్ష - వర్ణముల కేళిలగున్! (3)


ఇల బతుకమ్మ - నెమ్మికల చేరువతో

నెలవగు చుండి - నెయ్యమగు నోములతో

కలకలలాడు - గానముల నాట్యముతో

కొలుతురు నంత - కోర్కెలను దీర్చుటకై! (4)

*********************************************

కుమారి (కురరీరుతా)

కుమారి పద్య లక్షణములు

ఈ పద్య ఛందస్సుకే కురరీరుతా అనే ఇతర నామము కూడా కలదు.

వృత్తం రకానికి చెందినది

శక్వరి ఛందమునకు చెందిన 7088 వ వృత్తము.

14 అక్షరములు ఉండును.

18 మాత్రలు ఉండును.

మాత్రా శ్రేణి: I I I - I U I - U I I - I U I - I U

4 పాదములు ఉండును.

ప్రాస నియమం కలదు

ప్రతి పాదమునందు 7 వ అక్షరము యతి స్థానము

ప్రతి పాదమునందు న , జ , భ , జ , వ(లగ) గణములుండును