మానవ జీవితమంతా ఆశే,
ప్రాణము బుట్టిననంతా ఆశే,
నేనను భావననంతా ఆశే,
దేనిని వీడనిదంతా ఆశే! (1)
రైతుకు వానలరాకన్ చూపుల్
చేతికి పంటను జూసే రోజుల్
పాతికి డబ్బులు వచ్చే దారుల్
మూతికి కూడును నిచ్చే ఆశే! (2)
మొల్కలు మొల్చినవచ్చే నవ్వుల్
ఉల్కలు రాలిన రాత్రై మువ్వల్
పల్కున ప్రాయములేచెన్ గువ్వల్
మేల్కొని కష్టముజేసే ఆశే! (3)
బంధువులందరునున్నా బాధల్
విందులునెందఱినున్నా వాదుల్
వందల జీతములున్నా ఈర్ష్యల్
అందని ప్రేమలకోసం ఆశే! (4)
మాటకు మాటలుజూపే ప్రేమల్
కూటమి నేర్పడి నేర్పే ప్రేమల్
దాటుచు దగ్గరినుండే ప్రేమల్
నేటికి మంచిని కోరే ఆశే (5)