Friday, November 15, 2024

తాతయ్యగారి 85 వ పుట్టినరోజు

 తాతను పట్టుకు తారాడే నే 

చేతిని వీడక చేదోడై నే

పోతిని వెంటన బుట్టంగా నే,

తాతను  ప్రేమము దాచేదేనా! (1) 


పిల్లలు బెంచుచు ప్రేమించే తా

నుల్లము నందున నుయ్యాలూపే

ఎల్లలు దాటిన నీరోజేమో

అల్లది భారమ నాలోచించే!  (2)      


సాధ్యత నేమది  సందేహమ్మా! 

భాద్యత జూపుచు భారమ్మైనన్

ఆద్యుఁడుతానయి ఆశాజ్యోతిన్

విద్యలు నేర్పుచు ప్రేరేపించెన్ (3)


కష్టములన్నవి కావేరోజూ

ఇష్టము చేయుచు నేర్వంగా యీ

సృష్టికి బాటలు సేద్యంతో నీ

దృష్టిని మల్చుము తృష్ణేదైనా  (4)


యుక్తిని బెంచుచు యుద్ధాలెన్నో

శక్తికి మించిన సాధించొచ్చోయ్

భక్తిని నేర్చిన బాధ్యత్వమ్మున్

ముక్తిని మీటెద ముందస్తుండై    (5)


పేదరికమ్మును పీల్చేగాలిన్

బాధలనన్నియు బంధించంగా    

వేదనగమ్ముచు వీచేగాలిన్

శోధనలెట్లని  సూచించంగా  (6) 


ఆ హనుమంతుని పాఠాలెన్నో 

ఊహనునుంచుచు శోధించంగా

సాహస జీవత సాఫల్యమ్ముల్

దోహదమైనవి దూరాలోచన్  (7)


రానిది యేమని ప్రారంభిస్తే

కానిది యేమని కాస్తోకూస్తో

మానక నేర్వని మాటందిస్తే  

కానద గెల్పును కార్యార్థమ్మున్ (8)


***************************************************

కోమల

కోమల పద్య లక్షణములు

  1. వృత్తం రకానికి చెందినది
  2. పంక్తి ఛందమునకు చెందిన 55 వ వృత్తము.
  3. 10 అక్షరములు ఉండును.
  4. 16 మాత్రలు ఉండును.
  5. మాత్రా శ్రేణిU I I - U I I - U U U - U
    • చతుర్మాత్రా శ్రేణి: U I I - U I I - U U - U U
    • షణ్మాత్రా శ్రేణి: U I I U - I I U U - U U
    • మిశ్రగతి శ్రేణి (3-4) : U I - I U I - I U - U U - U
  6. 4 పాదములు ఉండును.
  7. ప్రాస నియమం కలదు
  8. ప్రతి పాదమునందు 7 వ అక్షరము యతి స్థానము
  9. ప్రతి పాదమునందు భ , భ , మ , గ గణములుండును.