Tuesday, March 20, 2018

@ Maryland again

@ Maryland again
***************************************************************
I wake up every day and help kids to rise
Till they stand on their feet and become wise
I protect with love and teach to get this world
Till they live with honest and to get the dream-world
I assume, sometimes, landed in the wrong boat
When kids are shooting with the innocent coat
Understand, Good and Evil are not that far,
Overcome the evil and always wanna spar
I want my kids should know, what is life,
And give the same to others to preserve society-life
***************************************************************
Spar = fight

Sunday, March 18, 2018

శ్రీ విళంబి నామ నూతన వత్సర యుగాది శుభాకాంక్షలతో .....

శ్రీ విళంబి నామ నూతన వత్సర యుగాది శుభాకాంక్షలతో .....
************************ద్రుతవిలంబితము*********************
తెలుగు వారికి తీయనిదైనదిన్
చిలుకు చుండెను చేదుని కొంచెమున్ 
పులుపు తల్పులు ముచ్చట గొల్పుచున్
నిలుపు పండుగ నేటి యుగాదిరా! (1)
కలుపు పచ్చడి కమ్మని స్వాదమున్
కలుపుగోలును కావలెనందురా
కలుపు బంధము గంధము పూయుచున్
కలుపు మానవకార్యము నొక్కటన్ (2)
పలుకు నూతన వత్సము నిండుగా
కలతలన్నియు కాంచక మెండుగా
వెలుగు నిండిన ప్రేమను దండిగా
లలితమైన విళంబిని నిచ్చు రా ! (3)
*********************************************
ద్రుతవిలంబితము (సుందరీ , హరిణప్లుతా)
ఈ పద్య ఛందస్సుకే సుందరీ , హరిణప్లుతా అనే ఇతర నామములు కూడా కలవు.
వృత్తం రకానికి చెందినది
జగతి ఛందమునకు చెందిన 1464 వ వృత్తము.
12 అక్షరములు ఉండును.
16 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: I I I - U I I - U I I - U I U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు 7 వ అక్షరము యతి స్థానము
ప్రతి పాదమునందు న , భ , భ , ర గణములుండును.

Thursday, March 15, 2018

ఆంధ్ర -

ఆంధ్ర -
*************నాగర (నాగరక)****************
ఆంధ్రది యేమి భాగ్యమౌ?
ఆంధ్రుల పాప మేమిటో
ఆంధ్రను బుట్టి పెర్గుచున్
ఆంధ్రుని గౌరవించకన్ (1)
తెల్గు ప్రపంచమందునన్
వెల్గిన గొప్ప సంతతై
నల్గురు కల్వకుండఁకన్
పల్గురి ముందు చుల్కనై (2)
స్వార్ధపు రాజకీయముల్
అర్ధములేని కల్హముల్
సార్ధక నామ మెంచకన్
వ్యర్ధపు మాట లెక్కువై (3)
పిల్లులు రెండు రొట్టికై
అల్లరి చేయు రీతిగా
చెల్లును లబ్ధి కేంద్రమున్
అల్లది రెండు ముక్కలన్ (4)
చింపిన విస్తరాకుగా
తెంపెను తెల్గువారినిన్
వంపుల హామి నిచ్చెరా
పెంపుకి నడ్డు బెట్టెరా (5)
నచ్చని పౌరులందఱున్
మెచ్చెను పొర్గు దేశముల్
అచ్చట తెల్గువెల్గులన్
పచ్చగ వృద్ధి జేయుచున్ (6)
ఎంతటి పోరులున్న మే
మంతట నొక్క జాతిగా
అంతము గోరు వారితో
పంతము లెక్కు పెట్టరా (7)
*****************************
నాగర (నాగరక)
వృత్తం రకానికి చెందినది
అనుష్టుప్పు ఛందమునకు చెందిన 87 వ వృత్తము.
8 అక్షరములు ఉండును.
12 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: U I I - U I U - I U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు భ , ర , వ(లగ) గణములుండును.

Thursday, March 8, 2018

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
హంసమాల (భూరిధామా)
**************************
తెలుసా వీరనారీ
ఇలలోఁ బుట్టఁగానే
కలవారింట నీదై
పలుకున్ రాణి మాటై   (1)

తనలోఁ నక్క ప్రేమన్
తనదౌ చెల్లి ప్రేమన్
మనసున్ తల్లి ప్రేమన్
కనరా కల్పవల్లిన్ (2)

వెళుతూ మెట్టినింటిన్
కలగా క్రాంతినిచ్చున్
వలపున్ పంచ వచ్చెన్
తలపున్ పుట్టినింటన్ (3)

తనలోఁ శక్తి జూపెన్
పనిలోఁ నేర్పు నుంచున్
మనమున్  యుక్తి నుంచెన్
వనమున్ మల్లెపువ్వున్ (4)

జగమున్ మాతవౌచున్ 
సగమౌ ప్రాణనాథన్
వగచున్ బిడ్డలందున్ 
తగునే కీర్తి నీకున్ (5)

మహిళా! ఉత్సవమ్మున్
సహితత్రాణ తోడన్
మహిలోఁ గౌరవమ్మున్     
గ్రహమున్ చేయు నేడున్ (6)
*************************
హంసమాల (భూరిధామా)
వృత్తం రకానికి చెందినది
ఉష్ణిక్కు ఛందమునకు చెందిన 20 వ వృత్తము.
7 అక్షరములు ఉండును.
మాత్రా శ్రేణి: I I U - U I U - U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు స , ర , గ గణములుండును.