Sunday, March 18, 2018

శ్రీ విళంబి నామ నూతన వత్సర యుగాది శుభాకాంక్షలతో .....

శ్రీ విళంబి నామ నూతన వత్సర యుగాది శుభాకాంక్షలతో .....
************************ద్రుతవిలంబితము*********************
తెలుగు వారికి తీయనిదైనదిన్
చిలుకు చుండెను చేదుని కొంచెమున్ 
పులుపు తల్పులు ముచ్చట గొల్పుచున్
నిలుపు పండుగ నేటి యుగాదిరా! (1)
కలుపు పచ్చడి కమ్మని స్వాదమున్
కలుపుగోలును కావలెనందురా
కలుపు బంధము గంధము పూయుచున్
కలుపు మానవకార్యము నొక్కటన్ (2)
పలుకు నూతన వత్సము నిండుగా
కలతలన్నియు కాంచక మెండుగా
వెలుగు నిండిన ప్రేమను దండిగా
లలితమైన విళంబిని నిచ్చు రా ! (3)
*********************************************
ద్రుతవిలంబితము (సుందరీ , హరిణప్లుతా)
ఈ పద్య ఛందస్సుకే సుందరీ , హరిణప్లుతా అనే ఇతర నామములు కూడా కలవు.
వృత్తం రకానికి చెందినది
జగతి ఛందమునకు చెందిన 1464 వ వృత్తము.
12 అక్షరములు ఉండును.
16 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: I I I - U I I - U I I - U I U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు 7 వ అక్షరము యతి స్థానము
ప్రతి పాదమునందు న , భ , భ , ర గణములుండును.

No comments:

Post a Comment