Thursday, April 26, 2018

First Lego League Jr - World Expo

First Lego League Jr - World Expo
గమనిక : కొన్ని ఆంగ్లపదములు తప్పక వాడితిని
***************చిత్రపదము**************
పిల్లల మీదనఁ బ్రేమా
వెళ్లెను హ్యూస్టను ప్రేమా 
పెళ్ళవు రోజనిఁ బ్రేమా
వెల్లువఁ గోరెను ప్రేమా (1)
పిల్లలుఁ జేసిన మోడల్
కల్లకుఁ జూపెను మెర్పుల్
ఎల్లలు దాటుచుఁ జేరెన్
అల్లరిఁ జేసిన రోబోల్ (2)
కొంచెము సైన్సునుఁ గల్పెన్ (Science)
కొంచెము నూతన నేర్పున్ (Technology)
కొంచెము వాస్తునుఁ గూర్చెన్ (Engineering)
కొంచెము లెక్కలతోడన్ (Mathematics )(3)
నీరుని వాడుటలోనన్
తీరుని మార్చుటలోనన్
చేరెను బాలలలోనన్
కోరిన జ్ఞానములన్నిన్ (4)
కూర్చి లెగోలను బాలల్
పేర్చుచు నీటిని విద్యుత్
తీర్చుట జూపగ, నెన్నో
నేర్చెను, తెచ్చెను కప్పున్! (5)
********************************
చిత్రపదము
వృత్తం రకానికి చెందినది
అనుష్టుప్పు ఛందమునకు చెందిన 55 వ వృత్తము.
8 అక్షరములు ఉండును.
12 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: U I I - U I I - U U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు భ , భ , గా(గగ) గణములుండును.

Saturday, April 14, 2018

ఉగాది ఉత్సవాలు - HSS Dallas Chapter

ఉగాది ఉత్సవాలు - HSS Dallas Chapter
**************************************************
సీ. గణపతి స్త్రోతమొకటి "యొక్లహోమపు
శాఖఁ" గీర్తించ ప్రస్తారమవుచు
పట్టువిడువకున్నఁ బ్రతిఫలముండు దా
నందనిఁ దెల్పు "నానంద శాఖ"
పంచరత్నావళి సంఘటించుచుఁ బాడె
"చేతన శాఖ" గజేంద్ర స్తుతిని
చక్కగాఁ జూపె దశావతారములను
"మైత్రి శాఖంత" సమైక్యమవుచు
కృష్ణుని పాటతో కృష్ణుల నాడించి
వీనుల విందగు "విజయ శాఖ"
రమ్యపుఁ బిల్లల రామాయణమ్మిడి
"సంస్కార శాఖ"యే సంతసించె
భక్తి యోగను భగవద్గీతలోఁ జిల్కి
"ఆదర్శశాఖ"యే మోదమిచ్చె
సంగీత యంత్రమున్ శ్రావ్యముగాఁ బాడి
"ప్రేరణ శాఖ"యే ప్రీతి నిచ్చె
యువవర్గము, శివాజి యుద్దేశ వీరత్వ
చరితను, చిత్రమ్ముఁ జాటుచుండె!
తేటగీతి
ఆహ! యేమి పండుగిది యుగాది మనకు!
ఆహ! యేమి పిల్లలు! నన్ని యాడి జూపె!
ఆహ! యేమి శాఖల కళ యంత కలసి!
ఆహ! డాల్లసు పుటనందు నందమిచ్చె!
**************************************************

Thursday, April 12, 2018

మిత్రుడు

***************మిత్రుడు***************
పుట్టిన రోజు పండుగన్
తట్టిన నాటి స్నేహమున్
వట్టిగనుండు బంధమై
గట్టిగ చుట్టు ముట్టురా

మిత్రుని కన్న మిన్నగా 
చిత్రము జూప లేరుగా
మిత్రుడు తోడు నీడగా
ఆత్రము నందు నుండురా 

ఆశకు నూత మిచ్చుచున్
దోషములన్ని జూపుచున్
చూసిన కొద్ది రోజులున్
వేసెను బాటలెన్నియో

వీడిన నేమి యిప్పుడున్
ఆడిన నాటి ఆటలాన్
పాడిన నాటి పాటలన్
వాడిగ నెమ్మి పంచగా   

నేరుగ నాత్మ సాక్షిగా
చేరుచు నంతరాత్మమున్
కోరును మంచి నీకురా
దూరము నున్న దోస్తురా
******************************
నాగర (నాగరక)
వృత్తం రకానికి చెందినది
అనుష్టుప్పు ఛందమునకు చెందిన 87 వ వృత్తము.
8 అక్షరములు ఉండును.
12 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: U I I - U I U - I U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు భ , ర , వ(లగ) గణములుండును.

Friday, April 6, 2018

గౌరివై...

గౌరివై...
*************మృగీ**********
గౌరివై
ఊరిలో
భారమౌ
దారిలో (1)

తోడుగా
నీడగా
జాడలో
కూడగా (2)

అమ్మవై
కమ్మగా
నెమ్మినే
జిమ్మగా (3)

నా మదిన్
నామమున్
నోములన్
నోమనా? (4)

దూరమై
చేరనా?
నేరుగా
భారతిన్! (5)
***********************
మృగీ
వృత్తం రకానికి చెందినది
మధ్య ఛందమునకు చెందిన 3 వ వృత్తము.
3 అక్షరములు ఉండును.
5 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: U I U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు ర గణములుండును.

Monday, April 2, 2018

మనసా

************వినయము (రమణః)***************
మనసా
వినవే
పనినే
కనవే  (1)

కలలోఁ
నిలలోఁ
నలలా
తలపుల్ (2)

కవితల్
భవితల్
సువిశా
ల విధుల్  (3)

సతికిన్
పతినై
సుతుడున్
సుతయున్ (4)

క్షణమున్
మనమున్
అనుకున్ 
మనవే (5)
***************************
వినయము (రమణః)
వృత్తం రకానికి చెందినది
మధ్య ఛందమునకు చెందిన 4 వ వృత్తము.
3 అక్షరములు ఉండును.
4 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: I I U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు స గణములుండును.