Friday, August 23, 2019

మనబడి

తెలుగు బడి(మనబడి)లో జేర్పించి పిల్లలకు తెలుగు వెలుగులు పంచండి.
****************************ద్విరదగతి రగడ*****************************
వచ్చినది తెలుగుబడి వచ్చినది మనబడియె
వచ్చినది వచ్చినది వత్సరపు మనబడియె
తెచ్చినది తెలుగుబడి తెలుగువారికి గుడియె
తెచ్చినది తెచ్చినది దివ్యమగు నది గుడియె
మెచ్చినది మనభాష మిళితమౌచు తోడయె
మెచ్చినది మెచ్చినది మేలిమౌచు తోడయె (1)
చేకూర్చు "బాలబడి" చిలిపిగా మాటలను
చేకూర్చు "ప్రవేశము" చిన్నారి పాటలను
చేకూర్చు "ప్రసూనము" చెప్పదగు నీతులను
చేకూర్చు "ప్రకాశము" శ్రేష్ఠమగు గాథలను
చేకూర్చు "ప్రమోదము" చిత్రమయిన కృతులను
చేకూర్చు "ప్రభాసము" శ్రేయమగు తెలుగులను (2)
తెలుగులో వెలుగులున్ తెలుపుచున్ సాగంగ
పలుకులో స్పష్టతల్ పరవళ్లు తొక్కంగ
పలుకుచున్ మన నీతి పద్యాలు పాడంగ
మెళుకువల నెన్నియో కలబోసి నేర్పంగ
నలుగురికి నడకలో నాణ్యతల్ నింపంగ
కలుపురా! మనభాష పిలుపదియె ధ్యేయముగ (3)
*********************************************************
ద్విరదగతి రగడ పద్య లక్షణములు
జాతి(రగడలు) రకానికి చెందినది
12 నుండి 20 అక్షరములు ఉండును.
2 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
అంత్య ప్రాస నియమం కలదు
ప్రాస యతి నియమం కలదు
ప్రతి పాదమునందు 3 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
ప్రతి పాదమునందు నాలుగు 5 మాత్రలు గణములుండును.
మల్లేశ్వరరావు పొలిమేర
08.23.2019

Sunday, August 4, 2019

స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు
******************నారాయణ*******************
స్నేహమే నా తోడు నౌచు
మోహమే తా జోడు లేక
సాహసమ్ముల్ సాటి యంచు 
దోహదమ్ముల్ చేయ బూనె (1)

చిన్న నాడా చిట్టి ప్రేమ
కన్న నాడా గట్టి ప్రేమ
ఎన్నలేదే యెట్టి ప్రేమ
మిన్నగాదా! మేలు జేసి (2) 

పల్లెటూర్లో బోసి నవ్వు
కల్లబొల్లే మాట లేక
అల్లుకుంటూ చేల చుట్టు
వెల్లువైనా చిట్టి కూర్మి (3)

ఆటపాటల్ అంటి జూపి
తోటివారిన్ తొంగి జూపి
చేటుజేసే యూసు లేక
మేటి బంధంమ్మౌను మైత్రి (4)

ఆ కళాశాలన్ మిగిల్చె
ఆకళించే మంత్రమేదొ
తోకచుక్కల్ జారునట్టి
షోకులిచ్చా హక్కు జూపె  (5)

ఏడుఏడూ ఎట్టి రూపు
తోడువచ్చే నిత్య రూపు
మోడువారే వారి చెంత
దౌడులాగా చేరు కొందు  (6)

నాకు ఇచ్చే ఇట్టి చింత
నాకు ఇచ్చే స్నేహితుళ్లు
నాకు నచ్చేవారు వారు
నాకు మెచ్చేవారు వారు  (7)
*************************************

నారాయణ పద్య లక్షణములు
వృత్తం రకానికి చెందినది
అనుష్టుప్పు ఛందమునకు చెందిన 163 వ వృత్తము.
8 అక్షరములు ఉండును.
13 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: U I U - U U I - U I
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు ర , త , హ(గల) గణములుండును.

మల్లేశ్వరరావు పొలిమేర
08/04/2019