తెలుగు బడి(మనబడి)లో జేర్పించి పిల్లలకు తెలుగు వెలుగులు పంచండి.
****************************ద్విరదగతి రగడ*****************************
వచ్చినది తెలుగుబడి వచ్చినది మనబడియె
వచ్చినది వచ్చినది వత్సరపు మనబడియె
తెచ్చినది తెలుగుబడి తెలుగువారికి గుడియె
తెచ్చినది తెచ్చినది దివ్యమగు నది గుడియె
మెచ్చినది మనభాష మిళితమౌచు తోడయె
మెచ్చినది మెచ్చినది మేలిమౌచు తోడయె (1)
చేకూర్చు "బాలబడి" చిలిపిగా మాటలను
చేకూర్చు "ప్రవేశము" చిన్నారి పాటలను
చేకూర్చు "ప్రసూనము" చెప్పదగు నీతులను
చేకూర్చు "ప్రకాశము" శ్రేష్ఠమగు గాథలను
చేకూర్చు "ప్రమోదము" చిత్రమయిన కృతులను
చేకూర్చు "ప్రభాసము" శ్రేయమగు తెలుగులను (2)
తెలుగులో వెలుగులున్ తెలుపుచున్ సాగంగ
పలుకులో స్పష్టతల్ పరవళ్లు తొక్కంగ
పలుకుచున్ మన నీతి పద్యాలు పాడంగ
మెళుకువల నెన్నియో కలబోసి నేర్పంగ
నలుగురికి నడకలో నాణ్యతల్ నింపంగ
కలుపురా! మనభాష పిలుపదియె ధ్యేయముగ (3)
*********************************************************
ద్విరదగతి రగడ పద్య లక్షణములు
జాతి(రగడలు) రకానికి చెందినది
12 నుండి 20 అక్షరములు ఉండును.
2 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
అంత్య ప్రాస నియమం కలదు
ప్రాస యతి నియమం కలదు
ప్రతి పాదమునందు 3 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
ప్రతి పాదమునందు నాలుగు 5 మాత్రలు గణములుండును.
మల్లేశ్వరరావు పొలిమేర
08.23.2019
No comments:
Post a Comment