Saturday, August 15, 2020

74 వ స్వతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

భరతమాత ఒడిలో భాగ్యవంతులం 

భరతజాతి పలుకు పంచి చూపుదాం   (ప) 


మాతృభూమి గాలి మాతోడు మానీడ 

        మాతృభూమి నీరు మాయందు ప్రవహించు  

మాతృభూమి మాట మామంచి సంస్కృతిన్ 

        మాతృభూమి పేరు మాతోటి నడయాడు  

మాతృభూమి వెలుగు మలచి చూపుదాం (చ 1) 


స్వాతంత్ర దినమును స్వాగతించి నేడు 

        ఆమువ్వన్నెల జెండా ఆశలో భాగమై 

అమరవీరులందరిని ఆత్మలో నిలిపి 

        అరాచకత్వమ్ము అణిచివేయదలచి 

మాతృభూమి వెలుగు మలచి చూపుదాం (చ 2) 


సారవంతపు నేల, సముద్రకాంతలు గల్గి  

        సంప్రదాయము, సాంకేతికలు నిండి 

సాహిత్య సంపద, సహజసిద్ధ వనరులతో   

        సర్వమత సమ్మేళనములు జూపు

మాతృభూమి వెలుగు మలచి చూపుదాం (చ 3)  



 

 





 




 

Tuesday, August 11, 2020

జన్మాష్టమి శుభాకాంక్షలు

*************కలరవము***************************

వసుదేవుని గృహమున బుడతవురా  

అసి దేవకి హృదయపు శిశువవుచున్ 

నిశిరాత్రి యమున నది పయనముతో

దిశ నందుని గృహమున కొలువయెరా (1)   


అనురాగపు యడుగులు వలపగ రా

మనసంత మురిపములు నిలుపగ రా 

తనువంత ప్రియమవుచు తలపగ రా

కనులార కలవరము కలుపగ రా  (2)

*****************************************************

కలరవము పద్య లక్షణములు

  1. వృత్తం రకానికి చెందినది
  2. శక్వరి ఛందమునకు చెందిన 8188 వ వృత్తము.
  3. 14 అక్షరములు ఉండును.
  4. 16 మాత్రలు ఉండును.
  5. మాత్రా శ్రేణిI I U - I I I - I I I - I I I - I U
    • 4 పాదములు ఉండును.
  6. ప్రాస నియమం కలదు
  7. ప్రతి పాదమునందు స , న , న , న , వ(లగ) గణములుండును.



Tuesday, August 4, 2020

రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు

అవనిలో అమ్మకు ప్రతిరూపము అక్క
చెరిగిపోని ప్రేమకు ప్రతిరూపము చెల్లి 
తోబుట్టువులౌ తొలుత స్త్రీమూర్తులు 
మనపుట్టుకకు మరో అనురాగమూర్తులు 

మన మనసుకు దగ్గరి బంధువు 
మన మమతలు పంచిన బంధువు
మన బాల్యపు స్నేహపూర్వక బంధువు 
మన సరదాల సహిత వలపుల బంధువు 

బాధ్యత నెరిగిన బంధము లెన్నో 
బాధలు పంచుకొను నిస్వార్ధము లెన్నో 
భారము కాదను భావనాలెన్నో 
బాటను పంచెడి భాగ్యము లెన్నో 

మాఇంటి మహాలక్ష్మియై 
మెట్టినింటి గృహాలక్ష్మియై 
తనయింటి ప్రేమానురాగాలు
పలికించె సప్తస్వరాలు  

మల్లేశ్వరరావు పొలిమేర 
08.03.2020