Monday, September 25, 2023

అమ్మనాన్నల యెడ

సీ.
మనసుమెచ్చెడి ప్రేమ తనువునిచ్చెడి ప్రేమ
అమ్మనాన్నల యెడ కమ్మనౌచు
పరిణయమైనను, పయనములైనను
దూరముండుట నిటు భారమౌచు
పలకరింపుల తోడ పులకరింపులు గాని
కలుచుచున్నటి రోజు కానరాక
మంచి జీవితమిచ్చి మించిన నాయుస్సు
తోడులేమను ధ్యాస తొలచు చుండె!

తే.గీ.
వారు గర్వించి నభివృద్ధి చేరుటకును
వారి పౌత్రుల నభిలాష తీరుటకును
దూరభారముల్ లెక్కింప త్రోవయందు
మమ్ము గుర్తించి దీవించు మమత జాలు!

Wednesday, September 20, 2023

జీవితము - మమతల సుధలు

 సీ. 

జీవిత మన్నను చేతిని వ్రాయుట 

కాదు సుమండోయి, వాదు లేల

నవ్వులు నాలుగు పువ్వులు బోలెడు 

పొందుకైనను జాలు విందుకాద!  

బంధములన్నవి యందిన జాలును 

ప్రేమల పల్లకిన్  ప్రీతి యగును

ఆశతో ముందుకు శ్వాసగా నడుచిన

మధురానుభూతులున్ మనవి కావ!  

తే.గీ.

మమతల సుధలను జిలికి మనసు కొఱకు

సమతల విలువలు బలికి సహితమవుచు 

సుమధుర సరసములొలికి సురల సరస

అమరము తలచు తరముల సుమముల యెడ! 

Wednesday, September 13, 2023

మీ ముందు మనబడి -మేమంత నిలబడి

సీ. మీ ముందు మనబడి -మేమంత నిలబడి

తెలుగుకై లోబడి -తెరచిన బడి

ముసిముసి నవ్వులు -పసిబుగ్గ దివ్వెలు

బాలబడిని బాల -మాల యగుచు

పదులలో జట్టుగ -పదముతో పలుకుతూ

వినయమున్ వలఁచు ప్రవేశపు గుడి 

నేర్చిన తెలుగును నెయ్యము తోడ ప్ర

సూన ప్రకాశపు వేణువైన! 

తే.గీ.

మోదమై కెల్లరందు ప్రమోదమౌచు 

బుద్ధిమంతులై జేరు ప్రభోదమందు

సుద్దులన్ని నేర్చుకొనుచు చూఱగొనుచు

ఒద్దికైన తెలుగు బాలలొడిసి పట్టె!    


--- మల్లేశ్వరరావు పొలిమేర 

     09.10.2023

Tuesday, September 5, 2023

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

తే.గీ.

రాని దేమంటు నేర్పుచు ప్రగతి నాటి, 

మదిని మీటిన గురువుల మఱపు రాక, 


క్రిష్ణుని తలచుచు నుతింతు ప్రేమము, యది 

పద్య పదముల నల్లుచు, ప్రణతి ప్రణతి!


ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు 

నాకు గురువులు అయి, గురువులుగా ఎంతో మందికి విద్యాదానము చేస్తున్న నా కుటుంబ సభ్యులను ఉంచి, రాధాకృష్ణుని తలచుచుఁ వారికి అర్పిస్తున్న ప్రణతులు. 

"రామకృష్ణుని తలచుచు నుతింతు ప్రేమము"

"నారాయణ" 


 ... మల్లేశ్వరరావు పొలిమేర 09.05.2023