Friday, September 27, 2024

మనబడి - “ఈవారం నామాట”

 “ఈవారం నామాట”

************************

మన పిల్లలు మన మాతృభాష అయిన తెలుగు నేర్చుకోవాలంటే, ఆ భాష సౌందర్యాన్ని మనము ముందు తెలిసుకోవాలి. అయితే మన దైనందిత జీవితములో ఎన్నో మాటలు అలా వచ్చిపోతుంటాయి కాని మనము వెతికి చూసినంతవరకూ ఆ సౌదర్యభావన అవగతమవదు. సరే ఒక సారి మన బంధుత్వాలనుంచి మొదలు పెడదాము .. అమ్మ , నాన్న, అక్క , అన్న, తమ్ముడు, చెల్లి, అత్త, మావయ్య .. వీటన్నిటిలో ఉన్న ఆ అందమేముటో గుర్తు పట్టారా? 😀లేదంటే ఇంకొన్ని పదాలు చూద్దాము.. పిల్లజల్ల, పెద్దమొద్దు, ముద్దవద్దు, అట్టిపెట్టు .. ఏమిటో ఈయన ఏమి చెబుతున్నారు అనుకుంటున్నారా.. అవును వీటన్నిటికీ సామరస్యము ఒక హల్లు మీద అదే హల్లు పడేలా ఈ భాషలో ఉన్న అందం .. మీరు ప్రయత్నించి చూడండి .. మిగతా భాషల్లో ఎలాఉందో తెలియదు గాని దీనివల్లనే అనుకుంటా మన మాటలో ఒక తెలియని గానమాధుర్యాన్ని వినగలుగుతున్నాము. మరి దీనినే ద్విత్వము అంటాము , ద్వి అంటే రెండు, రెండు సార్లు ఒకే హల్లు కలయిక.. ద్విత్వ+అక్షరము = ద్విత్వాక్షరము .. ప్రసూనము తరగతిలో రెండవ పాఠములో మన పిల్లలు నేర్చుకుంటన్నవి ఇవేనండోయ్.. ఒప్పుకుంటారా ! 😀

అందుకే అన్నారు “దేశభాషలందు తెలుగు లెస్స” అని రాయల వారు. 

… మల్లేశ్వరరావు పొలిమేర

************************

Thursday, September 5, 2024

గురుపూజాదినోత్సవ శుభాకాంక్షలు 2024

************నాగర (నాగరక)**********

ఓ గురువౌచు ధ్యానమున్

ఓ గురుతౌచు జీవమున్ 

ఓ గురువందు ప్రాణమున్ 

తా గురువుంచు నెల్లడున్! (1)   

*గురువుంచు = గౌరవముంచు 


గద్యములందు గమ్యమున్

పద్యములందు భావమున్ 

విద్యలనెల్ల నేర్పుచున్

ఉద్యమకారుడౌనుగా! (2)


ఓర్పును గూడ బెట్టుచున్

నేర్పును సానబెట్టుచున్

కూర్పును కోరుచుండుచున్

చేర్పును జెంతజేర్చురా! (3)


అంతటి గొప్పవారికిన్

చెంతన జేరినున్నచో

ఎంతటి భాగ్యమౌను, మీ  

కంతట, వందనమ్ములున్! (4)

                              --- మల్లేశ్వరరావు పొలిమేర 


**************************************************

నాగర పద్య లక్షణములు

  1. ఈ పద్య ఛందస్సుకే నాగరక అనే ఇతర నామము కూడా కలదు.
  2. వృత్తం రకానికి చెందినది
  3. అనుష్టుప్పు ఛందమునకు చెందిన 87 వ వృత్తము.
  4. 8 అక్షరములు ఉండును.
  5. 12 మాత్రలు ఉండును.
  6. మాత్రా శ్రేణిU I I - U I U - I U
  7. 4 పాదములు ఉండును.
  8. ప్రాస నియమం కలదు
  9. ప్రతి పాదమునందు భ , ర , వ(లగ) గణములుండును.