Tuesday, March 28, 2017

హేవిళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు


తేటగీతి:
******************************************
"హే"విళంబి నాహ్వానించి హృదయ మందు,
"వి"శ్వశాంతిని నిరతము వేడుకొని క
"ళం"కమివ్వక, భూమండలమ్ము నీ య
"భ"యమును తెలిపు మిత్రమా! ప్రణయ మందు!
******************************************
ఉగాది పచ్చడి
******************************************
సీసము:
బంధుమిత్రుల తోడ పంచు నానందమ్ము
తీపి జ్ఞాపకములై తెలుపు రోజు
వలపు తలుపులీడ్చు కలుపుగోలు తనము
పులుపు తలపులిచ్చి పొందు రోజు
కోపతాపములతో కుదుటపడుండక
కారమెక్కువవుచు కాచు రోజు
ఆశ జూపక జీవితాశయమునొదలి
ఉప్పు లేనటువంటి చప్ప రోజు
తేటగీతి:
పొగరుతో తూగలేకున్న నొగరు రోజు ,
చీదరింపుల చెలిమితో చేదు రోజు.
షడ్రుచుల సమాహారము సంయమమున
స్వీకరించు నుగాదికి స్వీకృతమున.
******************************************

మల్లేశ్వరరావు పొలిమేర
ట్రోఫీ క్లబ్ , టెక్సాస్

Friday, March 24, 2017

గౌరీపార్వతి దేవి


దుర్మిల (ద్విమిలా)
ప్రతి పాదమునందు స , స , స , స , స , స , స , స గణములుండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు 13 వ అక్షరము యతి స్థానము
మా స్వగ్రామము గవరపేట, పాలకొల్లు అయి గౌరీపార్వతి దేవి కోవెల ముందు మా గృహము. ప్రతీ రోజు దేవిని చూస్తూ బాల్యము గడచినది.
చాలా రోజులుగా వెళ్లక , డిసెంబర్ లో జరిగే ఉత్సవాలు జూడక తలచి ....
సుప్రభ గారి దుర్మిల పద్యాలు చూసి ప్రయత్నించాను ...

*****************************************
ఇలలో దిగివచ్చిన దేవతవే హిమవంతుని పుత్రిగ పార్వతివై
పొలుచుండిన గౌరిగ, నిత్యము మా పురమందున పూజలు పొందితివే
తలపింతువు నీ ఒడిలో యనునిత్యము నే తిరుగాడిన బాల్యమునన్
కలమున్ మదిలో నిను యీ విధమున్ కలిసే సుకృతమ్మును నా కొసఁగెన్
*****************************************


Tuesday, March 21, 2017

ప్రపంచ కవిత్వ దినోత్సవ శుభాకాంక్షలు


తరళము (ధ్రువకోకిల)
న , భ , ర , స , జ , జ , గ - 12 వ అక్షరము యతి స్థానము

**************************************
త. కవితలో కవి నిద్రపోవును కాలగర్భము నంతయున్
కవితతో తన భావజాలము కాంతి జిమ్ముచు పంచగా
కవిత కాదని, సృష్టి కష్టసుఖాల మాలని కూర్చుచున్
కవిత తోడను మానవాళికి కార్యసిద్ధిని జూపెరా!
**************************************


Monday, March 20, 2017

చలపతి రావు గార్కి

చ. తలపున సోదరుండయిన తండ్రిగ భాద్యతమోసి నండయై,
వలపుల జీవితమ్ము తనవారికి ధారగ పోసి ధన్యుడై,
విలువగు జీవనస్మృతులు పిళ్ల సమూహముకిచ్చి వీడగన్
చలపతి రావు గార్కి మనసా యిడుచుంటి నమస్సుమాంజలిన్


Sunday, March 19, 2017

అమెరికా యందున్న

విద్య నేర్చి కొలువులకు విదేశములుకు వెళ్లినంత తల్లి దండ్రులు ఎంత బాధ పడుతున్నారో ,
పిల్లలు తప్పని పరిస్థితులలో అదే అనుభవము పొందుచున్నారు...
కొంత మంది దేశము వీడినంత ప్రేమలు లేని వారని, ధన లోభులని తెలిపుచున్న,
తనయుల భావన జూపుచూ తల్లి లేక తండ్రి తో పలికే పలుకులుగా ....
సంత = చెంత, కాతు = కాచెదను, సంతసము = సంతోషము, నెమ్మి = ప్రేమ

సీ. నీదు కష్టము జూసి నేర్చిన బిడ్డను
నీ బాట నీ మాట నీడ యైన
ప్రతిభ పొందిన నాడు పయనమే విదితమై
వృత్తి ధర్మము నభివృద్ధి నిచ్చి
దారిద్రమును దాటి ధరణిలో తిరుగుచు
స్థిర పడెనిటు పరిస్థితుల తోడ
అమెరికా యందున్న ఆత్మ నీ యందుండు
నిన్ను వీడిన కాతు నెమ్మి యందు

తే. తల్లి దండ్రుల శ్రమకు సత్ఫలిత మిచ్చి
సంతసము పొందు వేళకు సంత లేక
తల్లడిల్లుచు విధియందు దాసుడైన
తప్పు తనయునందుంచుచు చెప్పు టేల?


Wednesday, March 8, 2017

మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

*** మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు *** వనితా - మహిళా దినోత్సవమును గుర్తించుచు మోహనరావు గారు కల్పించిన సార్థకనామ గణాక్షర వృత్తము "వనితా" - గణములు - వ, ని (న/న/న), తా (త/త)
వనితా - జ/న/న/స/ర/గల IUI IIII IIII - UUI UUI
****************************************************************
జగమ్ము సహృదయము గలిగి - సంసక్తినన్ జూపి
జగాల వెలుగులు ముఖమున - సంకీర్తనై పొంచి
విగర్హణల కెదురు నిలిచి - వీరత్వమున్ పెంచి
ప్రగాఢమగు తలపులనిడి - ప్రద్యోతమౌ స్త్రీవి.
****************************************************************