Thursday, July 26, 2018

మన భారతమ్ము

మన భారతమ్ము  మన మాతృకమునౌచున్
తన పూర్వ శోభలను ధార్మికత తోడన్
మునివర్యులందు తన మూలములు సృష్టిం
చిన దేశ మాత!  తగు శ్రీకరపు మాతా!    (1)

మన పౌరులందఱును మాధ్యమపు బాటై
తన శక్తియుక్తులను ధర్మముల బాటై
మన మానవత్వముకు మార్గములు దీఁటై
వినిపించె లోకముకు  వేదముల నెన్నో! (2)

చెడు లేక మంచియును చిక్కదను రీతిన్
కడు స్వార్ధపౌరులును కాలమున బుట్టెన్
విడగొట్టి లాభములు పెక్కువగు దల్చెన్
కడదేర్చె, వర్ణముల  కార్యముల దోడన్ ! (3)
మాత్రా బద్ధము అనవచ్చో లేదో తెలియదు , మొదటి ప్రయత్నము , యతి ప్రాసలు లేవు ...
మాత్రా బద్ధము (11 )
సూ సూ ఇం గణాలుగా వచ్చాయి
"USA - మనబడి" తరగతులకు పిల్లలను జేర్పించాలని తల్లిదండ్రులను కోరుచూ ...
**************************************
తెలుగు వీర లేవరా
దీక్షఁ బూని సాగరా
తెలుగు భాష కోసమై
సాక్షి వౌచు నిల్వరా (1)
తెలుగు నేర్పి చూపరా
వేష భాష లందునన్
తెలుగు జాతి కోసమై
ఆశఁ బెంచి చూపరా (2)
మనము వాడు భాషరా
మాట తీరు మంచిరా
మనసు నత్తు భాషరా
చేటుఁ గాదు సోదరా (3)
తెలుగు వారి సొత్తుగా
మాతృభాష పిల్లలన్
తెలపకున్న మన్నునా
మాతృ భావ గోష్ఠిరా (4)
కవుల చేతి ముత్యమై
నేర్పుఁ బెంచు భాషరా
వివిధ శోభ లిచ్చుచున్
చేర్పుఁ గూర్పు విందురా (5)
తెలుగు వీర లేవరా
దీక్షఁ బూని సాగరా
తెలుగు భాష కోసమై
సాక్షి వౌచు నిల్వరా (1)
**************************************
వదలవద్దు ... బెదరవద్దు ... వంశవృక్ష సాక్షిరా 😀


Monday, July 23, 2018

అమ్మమ్మ (పార్వతి యల్లపు ) వర్ధంతి

అమ్మమ్మ (పార్వతి యల్లపు ) వర్ధంతి సందర్భముగా నా తలపు ...
***********************పద్మనాభము***********************
అమ్మమ్మ  తోడుండి యమ్మౌచు నాయందుఁ నాత్మీయ బంధమ్ముఁ నల్లించె గాదా
అమ్మమ్మ కష్టమ్ము  నాకల్లలోనుంచి  యౌచిత్యమందించి నేర్పంగ నాడున్ 
అమ్మమ్మ మాటందుఁ నా మంచి యూహందుఁ నందించె చైతన్య జీవమ్ము నేడున్
అమ్మమ్మ వీడుండుఁ నీ రోజునందున్ మహాతల్లి ప్రేమమ్ము గుర్తించు కొంటిన్!     
**********************************************************
పద్మనాభము
వృత్తం రకానికి చెందినది
వికృతి ఛందమునకు చెందిన 1198373 వ వృత్తము.
23 అక్షరములు ఉండును.
39 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: U U I - U U I - U U I - U U I - U U I - U U I - U U I - U U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు 13 వ అక్షరము యతి స్థానము
ప్రతి పాదమునందు త , త , త , త , త , త , త , గా(గగ) గణములుండును.

Friday, July 20, 2018

పరిణతిఁ జెందు చుంటిమని

*******************************************************************
చం. పరిణతిఁ జెందు చుంటిమని వాడలుఁ దిర్గిన లాభమేమిరా
తరిగిన మానవత్వము యథావిధిగాఁ గనిపించుచుండగా
విరివిగ స్వార్థభావములు వేదిక నెక్కిన విఱ్ఱవీగుచున్
సరియగు జీవనమ్ములు ప్రశాంతముగాఁ విహరించునెప్పుడో (1)
చం. తెలియని నాడు నేర్చుకునిఁ దీయటి మాటలుఁ బంచు కొంటిమే
మలినము లేని మానసము మక్కువఁ బెంచెను మేదినందునన్
అలిగిన రోజు నందఱును నైక్యము తోడుగఁ నాదరించెరా
కలిగిన నాడు దానమనుఁ గార్యములందున సంతసించెగా (2)
చం. మనుషులు నంద రొక్కరని మాటలు నేర్చిన మార్పుచెందకన్
వెనుకటి కుక్క తోకవలె విజ్ఞతఁ జూపని దృష్ట బుద్ధితో
కనుగొని వర్ణ భేదములుఁ గంచెయె చేనును మేయుచుండగా
"మనుగడ వృద్ధి చేయుట"ను మానవ జాతికిఁ జేతనయ్యనా ? (3)
చం. కొలిచిన నాడు దూరమునఁ గొండలు నున్పుగఁ గాంచునన్చుచున్
పలికినఁ బిల్లలందరకు, భాద్యత తీరునఁ? జేసి చూపకన్
కలతలు మాని సంఘమున గౌరవమున్ మనుటేలఁ దెల్పుచున్
విలువగు జన్మ సారమును విశ్వమునందున వీడి వీరుఁడౌ (4)
*********************************************************************

Wednesday, July 11, 2018

వివర విలసితమ్ ,

సుప్రభ గారి పరిచయము జేసిన వృత్తము , సరదాగా యతిని 9 చేసి ...
***********వివర విలసితమ్ , గణములు -త,న,స,మ ***********
ఏమౌనొ? జనుల కిల యే రోగమ్మౌ!
ఏమౌనొ? వినక చెడి యీ సంఘమ్మున్
ఏమౌనొ? తెలియనిది యే గమ్యమ్మౌ!
ఏమౌనొ? తెలివిగొను నే జన్మమ్మౌ! (1)

గ్రంథమ్ము  చదవకనె రాముండంచున్
బంధమ్ము నలకువగ వక్రత్వమ్మున్ 
పంథాలు వెదికెదవు పాశ్చాత్యుండై
సాధించక నెఱుఁగుము సంస్కారమ్మున్ (2)
పంథ = మార్గము

నీ మాట పొదుపవుచు నీ రూపమ్మున్
నీ మాట పదిలమయి నీ సౌమ్యమ్మున్
నీ మాట పరులకును నీ స్మారమ్మున్
నీ మాట నిలబడిన నీ మోక్ష్మమ్మౌ (3)
స్మారము = సంస్మృతి

ఆనాటి చరితములు ఆరాధ్యమ్మై
ఈనాటి పరిణతికి నేకమ్మౌచున్
మానమ్ము కలగలిపి మాధ్యస్థమ్మై
నీ నామము వెలిగిన నీ బుణ్యంబౌ (4)
మానము = గౌరవము
**************************** ***********

Friday, July 6, 2018

అమెరికా స్వాతంత్ర దినోత్సవము

అమెరికా స్వాతంత్ర దినోత్సవము
************మంజరీ ద్విపద*************
ఏ దేశమేగిన ఎందు కాలెడిన
ఏ పీఠమెక్కిన, ఎవ్వరేమనిన
పొగడరా ఆ తల్లి భూమి యున్నతిని
నిలపరా నీ జాతి నిండు గౌరవము (1)
నీ మంచి సంస్కృతి నీ దేశ భక్తి
నీ మానవత్వము నీ సేవ నిరతి
మెండుగా పొంగిన మేలు జేకూరు
విశ్వము బొందును విశ్వశాంతి కల (2)
ఏ మతమైనను ఏ కులమైన
ఏ జాతియైనను ఎంతవారైన
పుడమిపై బ్రతుకుకై పుట్టున వారు
నిలుపరా గెలుపుని నీతితో మనకు (3)
***********************************
రాయప్రోలు వారి దేశభక్తిని విశ్వవ్యాప్తముగా స్మరిస్తూ ...

Monday, July 2, 2018

బీశెట్టి అప్పయమ్మ

బీశెట్టి అప్పయమ్మ - నా చిననాటి తోడు
*************కనకప్రభ**************
మన బామ్మ లంత మన మంచి గోరుచున్
తన వారికన్చుఁ దమ తప్పులొప్పులున్
విను గాధలందు వెనువెంట నేర్పుచున్
మనలోన నుండు మన మాతృదేవతల్ (1)
అటువంటి బామ్మ యను "యప్పయమ్మ" నా
కెటువంటి లోటు నెదురించి వచ్చినా
మటుమాయమంటు మది మంట లార్పుచున్
ఇటు పద్యమందు నెదనెంచి వచ్చెరా! (2)
ముసలమ్మఁ జూడ మొగమున్ ప్రకాశమున్
ముసలయ్య మాట మురి ముచ్చటందునా
బసిపిల్లలందుఁ బనిపాటలందుఁ దా
రసపెట్టు బామ్మ! ప్రతిరాజమాతరా ! (3)
కడియాలఁ గూడు కళ, కంకణమ్ముతోఁ
ఒడికట్టు తోడు నొక యూపు నూపుచున్
బిడియాలుఁ గొన్ని బిగబెట్టు మామ్మగా
కడు నిండు రూపుఁ గనకమ్ము కానదా! (4)
ఒడికట్టు = ఒడ్డాణము
చదివింది లేదు జలజంతువన్చుఁ నా
పదహారు నిండు ప్రజపాలకన్చుఁ నా
విధిలేని రాణి విలపించునన్చుఁ నా
గదలన్ని జెప్పి కథ కంచి కన్నదిన్! (5)
వరిచేల జానపద పాటలన్నియున్
మురిపంగఁ బాడి, ముదమున్ తనిచ్చుచున్
ఝరి పారు నట్టు సరిసాటి యెవ్వరౌ
దరిచేరు నెల్ల తన తన్మయత్వమున్ (6)
ఝరి - నది
****************************************
కనకప్రభ (మంజుభాషిణి , జయా , నందినీ , ప్రబోధితా , మనోవతీ , విలంబితా , సునందినీ , సుమంగలీ)
వృత్తం రకానికి చెందినది
అతిజగతి ఛందమునకు చెందిన 2796 వ వృత్తము.
13 అక్షరములు ఉండును.
18 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: I I U - I U I - I I U - I U I - U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు 9 వ అక్షరము యతి స్థానము
ప్రతి పాదమునందు స , జ , స , జ , గ గణములుండును.
*** మోహనరావు గారు యతి 7 గా ఉంచుట జూసి రెండూ సరిపోయేలా 7,9 అక్షరములు యతిగా నా ప్రయత్నము ***