Tuesday, September 25, 2018

మనకేమి దుస్థితిది

**********************కనకప్రభ********************
మనకేమి దుస్థితిది మంచి నేర్వకన్
మనబిడ్డలందరును మల్లెమొగ్గలై
తనచిన్న ప్రాయమునుఁ దాప మెక్కువై
వెనువెంట వెళ్ళెదరుఁ బ్రేమ కోసమై (1)
తను కన్న వారిదినిఁ దక్కువైనదా
తన మీద ప్రేమయును దండనౌదునా
తన మంచి కోరుకొను తల్లిదండ్రులై
తను గుండె చప్పుడయి తల్లడిల్లెగా (2)
అనువైన ప్రాయమును అర్థమౌనుగా
మనతోడు ప్రేమమును మానసమ్మునన్
వినలేవ పెద్దలను, విద్య నేర్చుచున్
కనలేవ సాధనము కార్యసిద్ధికై (3)
పరులంత వర్ణమని, స్వార్ధబుద్ధితో
కురిపించి వార్తలను కోతిమూకలై
కొఱగాని కొయ్యవలె కొట్టుకున్నచో
సరియౌన దేశమున చక్కబెట్టుటన్ (4)
మన ప్రేమ చిత్రములు మట్టు బెట్టెనా?
ప్రణయమ్ములంటితిరి పాఠశాలలో
ఎనలేని నాత్రములు నెక్కు పెట్టుచున్
మనవారి విద్యలను మంటఁ గల్పుచున్ (5)
అది చించకుండకను నందరందఱున్
పదివేల మాటలని వక్రబుద్ధితో
చదువుండి సాధ్యపడు సక్ర మార్గమున్
మదినెంచ లేరు నిది మార్పుఁ జెందదా? (6)
*****************************************************
కనకప్రభ (మంజుభాషిణి , జయా , నందినీ , ప్రబోధితా , మనోవతీ , విలంబితా , సునందినీ , సుమంగలీ)
వృత్తం రకానికి చెందినది
అతిజగతి ఛందమునకు చెందిన 2796 వ వృత్తము.
13 అక్షరములు ఉండును.
18 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: I I U - I U I - I I U - I U I - U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు 9 వ అక్షరము యతి స్థానము
ప్రతి పాదమునందు స , జ , స , జ , గ గణములుండును.

Wednesday, September 19, 2018

చిక్కాల బడి

మనము చిక్కాల బడికంటు మార్గ మందు
కాలి నడకలో నూసులు మేళవించి
స్నేహ బంధపు నొడిలోన చిగురు తొడిగి 
గోల జేసిన రోజులు గుర్తుకొచ్చె

కొలను ప్రక్కన కూర్చొను గువ్వ లౌచు
ఆట పాటలు చదువుల నారగించి
గురువు లేనిచో మాటల కూర్పు తోటి
ఏమి పండుగ రోజులు నెమ్మి నందు

Tuesday, September 18, 2018

ద్వేషము బెంచిన

సీ.
ద్వేషము బెంచిన తీయటి బంధము
తండ్రని మరచిన తండ్రి యతను
కూతురు బతుకును కూల్చునని మఱచి
కోరుకున్న పగల గుడ్డి వాడు 
ప్రేమగ బెంచెను ప్రేమకై తుంచెను
ప్రేమలో కడతేర్చె ప్రియుని నతను
నందరి ముందర నలుసగు, తండ్రియే
ఆదికాలమునుండి యాప లేక
తే.గీ.
మానవత్వము మిన్నగ మంచి చూడు
ఎన్ని ద్వేషములున్నను నెంచి చూడు
మనిషి జీవము తీసిన మార్చగలమ?
మనసు మందబుద్ధిని నేడు మట్టు బెట్టు
పిల్లలందున ప్రేమలు ప్రియుని కన్న
పెద్ద పుంతలు తొక్కుచు పేరుకున్న
తెలిపి చూపెదవెన్నియో దీవెనలను
పరువు నిలిపి బంధములను పంచగలవు

Saturday, September 15, 2018

సుప్రభ గార్ని కలిసిన రోజు

*************************************
చ. గురువుల సన్నిధమ్ములవి కోరగ వచ్చును కొద్దిమందికే
పరిణతిఁ బొందు కాలమను భాగ్యము, నిత్యము మీకు నుండగా
గురువుగ నేనుఁ దల్చు మిము కొద్దిగఁ గల్వగ నాదు భాగ్యమై
మరువని రోజు నాకునది మంచి దినమ్ముగ, ధన్యవాదముల్!
*************************************

Wednesday, September 12, 2018

మా చేతుల మీదుగా మా పెరటిలో పెరిగి వచ్చిన కూరగాయలకు కొన్ని పద్యాలు ...

మా చేతుల మీదుగా మా పెరటిలో పెరిగి వచ్చిన కూరగాయలకు కొన్ని పద్యాలు ...
****************భోగివిలసిత(కుప్యమ్)**********************
మా పెరటిని సామరస్యమై
మా పలుకులు నామమంత్రమై
మా పలువురి ప్రేమ పాదులన్
కాపును నిల సంగమించెఁగా (1)
********
గోగు దళములొంగు చెట్లతో
సాగు మొదలు పచ్చ పచ్చగా
లాగు దవడ పుల్లపుల్లగా
దాగు రుచులు నాంధ్ర పచ్చడిన్ (2)
గోగు దళము = గోంగూర ఆకులు
********
నూగు కలిగి మేను బెండగా
వేగినపుడు నావి, చారులో
బాగ మునిగి యాపలేనిదౌ
దాగు రుచులు నాంధ్ర బెండలో (3)
మేను = శరీరము, ఆవి = ఆవిరి, తాపము
********
ఆనబ లవియే యలా జతై
వేణువుల వలే ప్రియమ్ముగా
లేని సొగసు వాలి పందిరిన్
గానములిడు రాగ మాలికన్ (4)
********
ఆనబ చవియే యనాన్యమై
కానగబడు నంగ పాలతో
కూనలకది బాగు నువ్వులన్
దాని రుచులు నాంధ్ర మెండులే (5)
చవి = రుచి, అంగ = అచ్చగా
********
బీరవి మడిలో విరాజితై
కోరిన కొసరున్ కుదుర్చుచున్
చేరువయెను మెచ్చె కూరలన్
తారసపడు నాంధ్ర వంటలో (6)
********
మా పెరటిని సామరస్యమై
మా పలుకులు నామమంత్రమై
మా పలువురి ప్రేమ పాదులన్
కాపును నిల సంగమించెఁగా (1)
**************************************
భోగివిలసిత(కుప్యమ్)
వృత్తం రకానికి చెందినది
పంక్తి ఛందమునకు చెందిన 351 వ వృత్తము.
10 అక్షరములు ఉండును.
14 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: U I I - I I U - I U I - U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు 7 వ అక్షరము యతి స్థానము
ప్రతి పాదమునందు భ , స , జ , గ గణములుండును.

Wednesday, September 5, 2018

గురుపూజా దినోత్సవ శుభాకాంక్షలు

గురుపూజా దినోత్సవ శుభాకాంక్షలతో నా గురువులందఱకు ...
******************************************************************
మత్తేభవిక్రీడితము:
గురువున్ కొల్చెడి సాంప్రదాయమున లోకోద్ధర్తగాఁ దల్చుచున్,
ధరణిన్ నిత్యము ధార్మికత్వమును సంధానమ్ము బోధించగా 
కరుణన్ ప్రేమను వ్యాప్తిజేయమను నా కర్తవ్య సవ్యేష్ఠునిన్,
కరముల్ జోడుచు వందనమ్ములను సంస్కారమ్ముతో నిచ్చెదన్ (1)
ఉద్ధర్త = ఉద్ధరించువాఁడు, సంధానము = కూర్చుట, సవ్యేష్ఠుఁడు = సారథి
చిత్రపదము:
బుద్దులు నేర్పిన అమ్మన్
పద్దులు నేర్పిన నాన్నన్
సుద్దులు నేర్పగఁ నొజ్జన్
మద్దతు నిచ్చిన వారున్ (2)
బోధన పద్దతి లందున్
శోధన నిచ్చెడి రీతిన్
బాధను నోర్చెడి శక్తిన్
సాధన నందున నిచ్చున్ (3)
మారిన కాలము లందున్
మారిన లోకము నందున్
మారిన మార్పుల తోడన్
కోరును నేర్పును వారున్ (4)
ఒజ్జ = గురువు, మద్దతు = సహాయము
కందం:
సర్వేపల్లి స్మరణతో
సర్వ జనులిటుల గురువుల శక్తిని మెచ్చున్
మర్వక నిత్తుము వందన
పూర్వక గౌరవములన్ని ప్రోత్సాహమ్మున్ (5)
******************************************************************

Monday, September 3, 2018

శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు

శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు
***************** *****************
తే.గీ. రాధమాధవధామను “రాధె రాధె
కృష్ణ కృష్ణ” యనుచు మమ్ము కృష్ణ పిలిచె
వెల్లి జన్మాష్టమందున విషయములను
పంచదలచితి మీకును పండుగంత (1)
ఆ.వె. రాధె రాధె రాధె రాధె రాధ ప్రియుని
కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ
రాధె రాధె రాధె రాధె రాధ ప్రియుని
కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ(2)
తే.గీ. పూర్వి మారుచు రాధగ పూల తోడ
పిలిచె “నెక్కడ కృష్ణ” ని వలపు తోడ
నిలిచి వస్త్రధారణ పోటి నెగ్గినంత
కలిగె నీరూపు బహుమతి కంట నిండ (3)
తే.గీ. చిన్ని కృష్ణను జేరిన చిన్నతనము
సంతషించెను బొమ్మను చంకనుంచి
“కృష్ణ వచ్చెను” నాన్నని కృష్ణ యందు
మునిగి తేలుచు నాడెను ముద్దు పట్టి (4)
ఆ.వె. చిన్నతనపు పల్లె చిత్రములు తలచె
నుట్టి కొట్టి పట్టు నుత్సాహమ్ను
పెరుగులోన తడిసి పరుగు పరు గెగిరి
పట్టలేని తనపు చిట్టి వలపు (5)
తే.గీ. ఏమి దర్శన భాగ్యము నెదను దట్టి
ఏమి కారణ జన్మము నిలను పట్టి
ఏమి స్పర్శది మానసమేగి ముట్టి
ఏమి స్మరణ కన్నయ్య యిట్టి చుట్టి (6)
***************** *****************