Tuesday, September 25, 2018

మనకేమి దుస్థితిది

**********************కనకప్రభ********************
మనకేమి దుస్థితిది మంచి నేర్వకన్
మనబిడ్డలందరును మల్లెమొగ్గలై
తనచిన్న ప్రాయమునుఁ దాప మెక్కువై
వెనువెంట వెళ్ళెదరుఁ బ్రేమ కోసమై (1)
తను కన్న వారిదినిఁ దక్కువైనదా
తన మీద ప్రేమయును దండనౌదునా
తన మంచి కోరుకొను తల్లిదండ్రులై
తను గుండె చప్పుడయి తల్లడిల్లెగా (2)
అనువైన ప్రాయమును అర్థమౌనుగా
మనతోడు ప్రేమమును మానసమ్మునన్
వినలేవ పెద్దలను, విద్య నేర్చుచున్
కనలేవ సాధనము కార్యసిద్ధికై (3)
పరులంత వర్ణమని, స్వార్ధబుద్ధితో
కురిపించి వార్తలను కోతిమూకలై
కొఱగాని కొయ్యవలె కొట్టుకున్నచో
సరియౌన దేశమున చక్కబెట్టుటన్ (4)
మన ప్రేమ చిత్రములు మట్టు బెట్టెనా?
ప్రణయమ్ములంటితిరి పాఠశాలలో
ఎనలేని నాత్రములు నెక్కు పెట్టుచున్
మనవారి విద్యలను మంటఁ గల్పుచున్ (5)
అది చించకుండకను నందరందఱున్
పదివేల మాటలని వక్రబుద్ధితో
చదువుండి సాధ్యపడు సక్ర మార్గమున్
మదినెంచ లేరు నిది మార్పుఁ జెందదా? (6)
*****************************************************
కనకప్రభ (మంజుభాషిణి , జయా , నందినీ , ప్రబోధితా , మనోవతీ , విలంబితా , సునందినీ , సుమంగలీ)
వృత్తం రకానికి చెందినది
అతిజగతి ఛందమునకు చెందిన 2796 వ వృత్తము.
13 అక్షరములు ఉండును.
18 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: I I U - I U I - I I U - I U I - U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు 9 వ అక్షరము యతి స్థానము
ప్రతి పాదమునందు స , జ , స , జ , గ గణములుండును.

No comments:

Post a Comment