****************మధుమతి (స్వనకరీ)**************
మనసు మాటలతో
తనువు చేతలతో
కనుల చూపులతో
అనుచు వ్రాయుదునే (1)
కలము కాగితమున్
మలచి మంత్రములన్
తలచి పద్యములన్
వలచి వ్రాయుదునే (2)
మెరుగు మానసముల్
తరుగు తాపములున్
కరుగు ప్రాణములున్
తరిగి వ్రాయుదునే (3)
చదువు పుస్తకముల్
ఒదుగు నొజ్జలలా
కుదురు కల్గెదరే,
విధిగ వ్రాయుదునే (4)
ఒక “శరత్తు”న, మీ
రొక “ప్రియ”మ్మవుచున్
ఒకరి కొక్కరు చే
రికయి, బంధువులౌ (5)
కలసి స్నేహితులై
కలసి బంధువులై
కలసి వేడుకులన్
కలసి నింపెదరున్ (6)
కలసి "నేహ"ను ధ్రువ్
వలచి పూర్వి "క్రిష"న్
అలుపు రావనుచున్
కలసి పోయెదరే (7)
కలసి ఆటలతో
కలసి మాటలతో
కలసి వచ్చెరు, నే
కలగ వ్రాయుదునే (8)
కలము చూడగనే
విలువ చూడగనే
కలువ రేకులలా
మలచి వ్రాయుదునే (9)
తెలిపి వందనముల్
కలసి మాధవితో
తలచు కుందునులే
తలచి తన్మయమున్ (10)
*******************************************
మధుమతి పద్య లక్షణములు
- ఈ పద్య ఛందస్సుకే స్వనకరీ అనే ఇతర నామము కూడా కలదు.
- వృత్తం రకానికి చెందినది
- ఉష్ణిక్కు ఛందమునకు చెందిన 56 వ వృత్తము.
- 7 అక్షరములు ఉండును.
- 9 మాత్రలు ఉండును.
- మాత్రా శ్రేణి: I I I - U I I - U
- 4 పాదములు ఉండును.
- ప్రాస నియమం కలదు
- ప్రతి పాదమునందు న , భ , గ గణములుండును.
మల్లేశ్వరరావు పొలిమేర
05.19.2020
No comments:
Post a Comment