Wednesday, June 14, 2023

ఆశ

సుధగారి కథకు పద్యపు స్వేచ్ఛానువాదము 

తే.గీ. 
ఏమి నాశించకుండుట నిచ్చు మనకు 
చాలినంతటి తృప్తిని వీలుజూపి
కొంచెముంచిన నాశలో కోరవచ్చి

పొందరాకున్న ప్రతిసారి చింత గలుగు! -1 


ఆ.వె. 

చదువుచున్న దిట్లు మధురిమ మంచివౌ

మాటలన్ని నవ్వుకుంటు తాను!

ఆశ పడక నున్న శ్వాసలో మౌనమ్ము

జీవితమ్ము కాదు, భువిననుకొనె! -2


ఆ.వె. 

ఎట్టి వారికైన నెనలేని కోరికల్

ఎట్టి దశనునైన పుట్ట గలవు 

ఇట్టి భావమందు గట్టిగా నమ్మిన

పెట్టిపుట్టినపుడు విడవటేల!-3


తే.గీ. 

ఓపికయు, డబ్బు కలిగి నారోగ్యమున్న

ఆశ పడుట సహజమౌచు అందిపుచ్చు

తాను నమ్మిన వాదన తలచు నెపుడు 

మనసు కోరిన చాలుగా వనిత యందు-4


మత్తకోకిల.

బాల్యమందున చూడముచ్చటి పల్లెసీమలు చుట్టుచున్

లౌల్యమందు విహారయాత్రల లాలిపాటలు పాడుచున్    

తుల్యమౌచును తల్లిదండ్రులు తోచినంతన చూపగా

బాల్యజీవిత శోభలెన్నని పంచుకుండుచు నాత్రమున్! - 5

లౌల్యము = ఆశ 


తే.గీ. 

తనకు నూతన దేశములనిన ప్రీతి 

కనుక నెక్కడ జెప్పిన వినుచునుండె 

ఆదివారపు పత్రిక చదువుకొనుచు  

జూడు, ననుబంధ శీర్షిక వీడకుండ - 6 



No comments:

Post a Comment