ఆంధ్ర పౌరులై!
ఉత్పలమాలలు
నేనొక రోజు
చిత్తమున నిచ్చెలగా పరిశీలనాత్మమున్
దేనిని బొందడానికని
దీరములన్నియు దాటివచ్చి, యా
కానని బుణ్యభూమియెడ కమ్మని బ్రేమను బంచునంచు, నే
వానిని గుర్తుచేసుకొను
భాగ్యము నిప్పుడు పద్యమల్లికన్ ! (1)
ఊరును వీడి,
యున్నతము నోర్పుగ యుక్తిని దోడ నేర్చుచున్
వీరులు వీరు
నభ్యుదయ వీక్షణ గాంచగ విశ్వ వ్యాప్తికై
చేరి ప్రవాస
జీవితము శ్రేయముగా గనువిందు గాంచుచున్
పేరును బెంచుచున్,
తెలుగు బిడ్డలు, నెంతటి బాట లేయునో! (2)
కష్టములెన్నియున్న
తన కార్యపు దీక్షను బెంచి జూపుచున్
సృష్టిని సాధనాయుతపు
వృద్ధిని బుద్ధిని పొందుపర్చుచున్
ఇష్టముజేసి
నేర్పులను శిక్షణ బొందుచు ముందుజూపుతో
స్పష్టత జూపి
కార్యమును సాధన నిల్పెను, యాంధ్ర పౌరులై! (3)
తాతలు లేరు
నేర్పుటకు, దండ్రుల సంపదలెల్ల లేకనే
చేతురు కాయకష్టములు,
స్నేహపు భావము స్వీకరించుచున్
భీతిని వీడి
సాగినను బింబము జూపెడు రోజుకోరుచున్
జాతికి వీరు
నాద్యులగు, సంస్కృతి నేర్పుచు నెల్లలోకమున్ (4)
పెంచిన ప్రేమ
నిల్పుకొని పెద్దల సుద్దుల బాటనడ్చుచున్
వంచనలెన్నియున్న
తమపంచన జేర్చక నిష్టబుద్ధితో
అంచల నంచలన్
నిలిపి అందని దేమని నెక్కిచూపుచున్
మంచి ప్రవాస
ఆంధ్రులని మాటలతో మనపేరునిల్పెరా! (5)
అంతట నాగి ఉండుటయె గాక తరాలగురించి తోచుచున్
అందరు తెల్గునేర్వవలెనంచు
స్వభాషను సత్కరించిచున్
అందరునొక్కరై
బడులు బాధ్యతతో నెలకొల్పి నేర్పగన్,
అంతట ఆంగ్లమాంధ్రములు
ఆశల బాసలు తీర్చు భాషలౌ! (6)
పోరుకు సిద్దమందురట
భూతలమందున నెట్టిరంగమున్
భారతదేశపౌరులయి
బాధ్యతతోడను దౌత్యవేత్తగా
వేరొకదేశ సంపదలు
విస్తృతరీతిని విస్తరించుచున్
వారి ప్రశంసలందుకొను
వారసులందరు నేమి భాగ్యమో! (7)
సాహితి సాంప్రదాయములు
చక్కటి చిక్కటి నాట్యగానముల్
ఊహకు మించి
చూపగల శోభలనన్నియుఁ సంతరించుచున్
తాహతకొద్ది
సాయపడి దాతగనాదుచు పుణ్యభూమికై
దోహదమైన కార్యములు
దోడ్డగజేయుచు చాటుచుండిరే! (8)
కొందరు సాఫ్టువేరులను
కోరుచు నెక్కెన గద్దెలెన్నియో
కొందరు వైద్యవృత్తులను
కోరుచు మిక్కిలి శక్తివంతులౌ
కొందరు నాయకత్వమును
కోరుచు చెక్కిన సంస్థలెన్నియో
కొందరు నెందరో!
తెలుగు కూనలు మక్కువతోడ చేరికౌ! (9)
ఛందములోన నందమును జాతిని నెప్పుడు మేలుకొల్పగా
బంధములన్ని
కూర్చుకుని పచ్చని జీవనమెంచుచుండగా
అందరువేయు ముందడుగు
పౌరుని తీరుని, వృద్ధి జూపగా
వందనముల్ ప్రవాసులకు,
వారథి వీరులకెల్ల నెల్లడున్! (10)
మల్లేశ్వరరావు పొలిమేర
ట్రోఫీ క్లబ్ , డల్లాస్
05.15.2025
No comments:
Post a Comment