Wednesday, August 29, 2018

తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.

తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.
ఏ ఛందస్సులో అని ఆలోచిస్తూ సుప్రభ గారి పద్యములు చూసి ...
--
రాజమరాళ /కరశయా వృత్తము
--
గణములు - న,భ,ర
యతి లేదు
******************************************
తెలుగు భాషకు పండుగౌ
వెలుగు జూపెడు రోజుగా
పలుకు లందున ముత్యముల్
చిలుకు తెల్గుల వీరుడా (1)
నిలుపు నిత్యము గర్వమున్
కలుపు మాటల బంధమున్
తెలుపు తేనెల తేటలన్
తలపు లందున వీరుడా (2)
అలలు పొంగిన రీతిగా
జలము పాఱెడు వాగుగా
కులుకు లొల్కెడు భాషయై
మలుచు పిల్లల జన్మమున్ (3)
తళుకు తారల సందడిన్
నలుపు రాత్రిని చంద్రుడై
కళల లోకపు కాంతులన్
విలువ కల్గిన భాషరా (4)
******************************************

Tuesday, August 28, 2018

రాఖి పండుగ

కెల్లరు , టెక్షాస్ అగ్నిమాపక దళము , రక్షక భటులతో మా రాఖి పండుగ వివరాలు
"చిత్రములు రసధుని గ్రూపులో ఉంచెదను"
***********************************************************
మ.కో. రాఖి పండుగ లోకమందున రమ్యమైనది బాల కా 
రాఖి పండుగ నక్కచెల్లెలు రక్షకోరును సోదరున్
రాఖి పండుగ గుర్తుచేయును రక్షనిచ్చెడు ఖాకిలన్
రాఖి పండుగఁ బంచభూతములందు రక్షని కోరురా (1)
త. మనుషులందున బంధముల్ తమ మార్గమందున జేర్చుచున్
మనసులందున బాధ్యతల్ తమ మంచిభావము లందుచున్
మనసమాజపు సఖ్యముల్ తగు మార్పునిచ్చుచు వచ్చు నీ
దినము పండుగ వేడుకై తన దివ్యమైనటి శోభతో (2)
మ.కో. కెల్లరందున నగ్నిమాపక కేంద్ర ధీరుల తోడుగాఁ
నెల్లరందున రక్షనిచ్చుచు నేర్పుచూపిన రక్షకుల్
చెల్లునంటిరి రక్షకట్టెడు శ్రేష్ఠమైనటి పండుగన్
అల్లుకుంటిరి భారతీయుల నందమైనటి సంస్కృతిన్ (3)
***********************************************************
మల్లేశ్వరరావు పొలిమేర
08.28.2018

Monday, August 27, 2018

భక్తి భావపు ఆటవెలదులు

********భక్తి భావపు ఆటవెలదులు ***********
అమ్మ యన్న భక్తి నమ్మకానికి శక్తి
అమ్మ కన్న మిన్న యవని నేది?
అమ్మ వేరు వేరు యనుచు నందఱును, మా
యమ్మ మతము గొప్ప యనుట లేదు! (1)
నాన్న యన్న భక్తి వెన్నెముకఁగఁ దల్చు
నాన్న మార్గమిచ్చి నాంది పలుకు
నాన్న వేరు వేరు యున్న నందఱును, మా
నాన్న మతము గొప్ప ననుట లేదు! (2)
గురువు యుక్తి నెఱిఁగి కోరు జ్ఞానపు బోధ
గురువు యందు "లేని" గురుతు లేదు
గురువు వేరు వేరు గున్న నందఱును, మా
గురువు మతము నుండు గొప్ప యనరు! (3)
మీరు నమ్ము చుండి, మెచ్చెడి దేదైన
మీకు సొంతమౌను మేలు కొఱకు
వేరు వారి మతము వారి భక్తికి చెల్లు
ఎవరి మతము వారి యెదనుఁ దట్టు (4)
భక్తి భావ మందు వరలును స్నేహమ్ము
భక్తి మూఢు లందు బ్రతక లేదు
భక్తు లందు మూఢ భక్తులు వేరయా
భక్తి నెరిగి మసులు బాధ్యుడవుచు! (5)
మంచి చెడులు వీడి మానవత్వము వీడి
మనిషి బ్రతుకు కొఱకు మసల లేక
మతము నందు దాగు మంచిని నేర్వక
మాది మీది యనుచు మంట లేల? (6)
***********************************************
మతము = అభిప్రాయము
మల్లేశ్వరరావు పొలిమేర
08.27.2018

Tuesday, August 21, 2018

కృష్ణసర్పబంధము -1

కృష్ణసర్పబంధము -1
=========================
తే.గీ (పంచపాది )
*********************************************
పార్వతి శివులను తలపై పాగ నెత్తి 
పానుపునను కానుకలను , పండ్లుఁ గాక
పైకములను రాశిగ సమర్పణముఁ గనుచు
మూడగు ప్రదక్షిణములను మోదమున, స్వ
స్తి, ముగితి గలిగి ప్రదమును తిరుగు నాడు.
*********************************************
మల్లేశ్వరరావు పొలిమేర
08.21.2018
ప్రదము = జయప్రదమైన కార్యము
సుప్రభగారు మరియు పలువురి కృష్ణసర్పబంధములు జూసి వ్రాయవలెనున్న సమయము ఇప్పటికి కుదిరినది. ఇది ఒక ప్రయత్నము మాత్రమే. ఎంతవరకు సఫలమో మీరే తెలుపవలెను.
మా ఊరి (గవరపేట)దేవతను తలచి చాలా రోజులయినది అని ఆ పార్వతి దేవి పండుగ రోజు ప్రతి ఇంటిముందు పానుపులతో
ఆహ్వానించు సమయమును ఇక్కడ వివరించదలచాను.
మొదటగా ప్రక్క ఇంటినుంచి మా ఇంటికి తీసుకురావడానికి ఇంటి యజమాని మంచి తలపాగ ధరియించి, తలపైన పీఠకముతో పార్వతి శివులను ఎదురువెళ్ళి ఎత్తుకుని తీసుకువచ్చి , పానుపునిండ తన శక్తికొలది కానుకలను, పండ్లను, చదివింపుగా డబ్బులునుంచి, పానుపు చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ జేసి సంతోషమున
ఆ మంచి కార్యమును జేసి పూజించు నాడు. అయితే ఈ పద్యములో ఆహ్వానించే క్రమమును మాత్రమే వివరించాను.

Sunday, August 19, 2018

Atal Bihari Vajpayee

***********************************************
సీ. భారతమాతకు బాధ్యత తోడను
రాజనీతిజ్ఞుడై వాజుపేయి
భారతరత్నయి వ్యక్తిత్వ వక్తగ
కవిరాజు తానౌచు ఖ్యాతికెక్కె
దేశాభివృద్ధికై ధీరత్వ పటిమతో
బ్రహ్మచర్యమునందుఁ బట్టుబట్టె
కలగన్న రారాజు యలయుచు నీరోజు
కాలగర్భములోనఁ గన్ను మూసె
తే.గీ. నాతరము వారెఱుఁగు మంచి నేత యతను
నా ప్రదేశము గర్వించు సుప్రవరుఁడు
నాణ్యతకు మారుపేరగు పుణ్యుడతను
నేను శ్రద్ధాంజలిడిచెద దీనముగను.
***********************************************
మల్లేశ్వరరావు పొలిమేర
08.16.2018
ప్రదేశము = దేశము
సుప్రవరుఁడు = మంచి శ్రేష్ఠుఁడు (శ్రేష్ఠులలో శ్రేష్ఠుడు )

Saturday, August 18, 2018

అమ్మను కీర్తిస్తూ ...

అమ్మను కీర్తిస్తూ ...
************శ్లోకములు **************
పార్వతి నామ మంత్రమ్మున్
మర్వను నేను మచ్చుకిన్
సర్వము నమ్మ  ధ్యానంతో
గర్వము వీడి కొల్చెదన్  (1)

గవరపేట గాత్రమ్మున్
అవతరించు నమ్మవే
సవివరంగ నీయందున్
ప్రవహించిన భక్తియే (2)

అమ్మలుగన్న నమ్మంటున్
కమ్మగనిన్ను చేరెదన్
నెమ్మిని పొందు శక్తంతా
నమ్ముచు నాకు నొస్గవే  (3)

పల్కులు నాకు నేర్పించీ
పల్కులు నీకు పల్కగన్
మేల్కొలుపు ప్రసాదించెన్
చిల్కుచు నేను సాగెదన్ (4)
*******************************************
 శ్లోకము లేక అమృతవాహిని లేక జయ,
యతి లేదు, ప్రాస నియతము, ఐదు, ఆఱు, ఏడు అక్షరములు
సరి పాదములలో జ-గణము, బేసి పాదములలో య-గణము
శ్లోకము అనుష్టుప్పు ఛందమునకు చెందినది.

మల్లేశ్వరరావు పొలిమేర
08.18.2018

Tuesday, August 14, 2018

స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
************శ్లోకములు **************
భారతమ్మునఁ బౌరుండై
చేరవచ్చిన వీరుడా
కోరుకున్నటి స్వైరమ్మున్
నేరుగాఁ జరిపించరా (1)
బానిసత్వపు కోరల్లో
కూనిఁ జేయుట నేమని
హానిచేయఁకఁ బోరాడి
మేను వీడుచు పొందెరా (2)
వీరులందర్ని గుర్తించి
పేరుపేరునఁ దెల్పరా
వీరత్వమునుఁ గీర్తించి
వారి ఫలము నెంచరా (3)
మనదేశపు మాటల్లో
మనదేశపు చేతలన్
మనదేశపు మంచంత
మనతో నేడు పంచరా (4)
స్వాతంత్రమందు చేయూతన్
స్వాతంత్రమందు గౌరమున్
ఏ తంత్రములు లేవంచున్
నీ తోటి వార్కిఁ బంచరా (5)
******************************************
శ్లోకము లేక అమృతవాహిని లేక జయ,
యతి లేదు, ప్రాస నియతము, ఐదు, ఆఱు, ఏడు అక్షరములు
సరి పాదములలో జ-గణము, బేసి పాదములలో య-గణము
శ్లోకము అనుష్టుప్పు ఛందమునకు చెందినది.
మల్లేశ్వరరావు పొలిమేర
08.15.2018

Wednesday, August 8, 2018

తెలుగు వీర లేవరా

*******************
తెలుగు వీర లేవరా
దీక్షఁ బూని సాగరా
తెలుగు భాష కోసమై
సాక్షి వౌచు నిల్వరా  (1)

తెలుగు నేర్పి చూపరా
వేష భాష లందునన్
తెలుగు జాతి కోసమై
ఆశఁ బెంచి చూపరా (2)

మనము వాడు భాషరా
మాట తీరు మంచిరా 
మనసు నత్తు భాషరా
చేటుఁ గాదు సోదరా (3)

తెలుగు వారి సొత్తుగా
మాతృభాష పిల్లలన్ 
తెలపకున్న  మన్నునా
మాతృ భావ గోష్ఠిరా  (4)

కవుల చేతి ముత్యమై
నేర్పు బెంచు భాషరా
వివిధ శోభ లిచ్చుచున్
చేర్పుఁ గూర్పు విందురా  (5)
*******************
మ.కో. నేను సైతము మాతృభాషను నిష్ఠతోడను నేర్పుచున్
కూనలందున దెల్గువెల్గులు గోరుచుండగ నా మదిన్
ప్రాణ మిచ్చుచు ప్రేమపంచుచు  ప్రాతినిధ్యమె నా విధిన్
మేనునిచ్చిన నాంధ్ర వాక్కుని మేళవించెద మోదమున్ (1) 



Sunday, August 5, 2018

స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు
**********ఆటవెలదులు********************
స్నేహ మన్న మాట చేదోడు వాదోడు
నెట్టి వారి కైన నెదనుఁ దట్టుఁ
నుర్వి జనుల కెల్ల నోదార్పు నిచ్చుచు
బంధువులను మించు బంధ మగును! (1)
చిన్న నాడు మైత్రి చిగురించు తీగలా
అల్లుకొనుచుఁ బూయు మల్లె మనసు
ఎట్టి వైర మైన నింతలో మాయమై
కుదుట పరుచు నోయి కొంటె తలపు! (2)
యుక్త వయసు నందు యుక్తమౌ స్నేహమ్ము
బతుకు తెరువు నేర్పి బాధ్య తిచ్చు
మంచి చెడ్డ లన్ని మాటలోఁ గలబోసి
హాస్య మందు నింపి హత్తు కొనును! (3)
నేటి వరకుఁ గలిసి నిత్యమ్ముఁ దోడుగ
స్నేహ బంధ మిచ్చు స్నేహితులకు
తెలుపు చుంటి నిటులఁ దీయటి పద్యమ్ము
అందఱకు నిడుదును వందనములు (4)
************************************************
మల్లేశ్వరరావు పొలిమేర
08.05.2018

Friday, August 3, 2018

వసంతతిలకము

గత రెండు వారముల నుండి ఏమైంది ...
అంతలో చింతా రామకృష్ణ గారి వసంత తిలకము చూసి ...
*****************వసంతతిలకము******************************
నా పొద్దు నెప్పుడును నాకిల కానరాదే?
నాపూర్వి గజ్జలను నా చెవి కానరాదే?
నా పిచ్చి తల్లి తన నాన్నను వీడలేదే?
నా పంచ ప్రాణమయి నామది దేవులాడున్ ! (1)
తా నన్న తోడుగను తా నడుగేసి సాగెన్
తా నట్టు మామగని తా మురిసింది నాడున్
తానట్టి బంధములు తా నలరించి రాగా
తానేమొ రేపుననె! తా నెపుడొచ్చునంటే? (2)
నా బిడ్డలిద్దఱును నా కనుపాప లౌచున్
నా బంధు ప్రేమములు నా కతియిష్ట మౌచున్
నా బాటలో వెలుగు నా చిరుదివ్వెలౌచున్
నా బల్కులందునను నానుడి గాక యేమౌ? (3)
*****************************************************************
వసంతతిలకము
ఈ పద్య ఛందస్సుకే ఉద్ధర్షిణీ , ఔద్ధర్షిణి , కర్ణోత్పలా , మధుమాధవీ , శోభావతీ , సింహోన్నతా , సింహోద్ధతా , మదనము అనే ఇతర నామములు కూడా కలవు.
వృత్తం రకానికి చెందినది
శక్వరి ఛందమునకు చెందిన 2933 వ వృత్తము.
14 అక్షరములు ఉండును.
21 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: U U I - U I I - I U I - I U I - U U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు 8 వ అక్షరము యతి స్థానము
ప్రతి పాదమునందు త , భ , జ , జ , గా(గగ) గణములుండును.