Monday, August 27, 2018

భక్తి భావపు ఆటవెలదులు

********భక్తి భావపు ఆటవెలదులు ***********
అమ్మ యన్న భక్తి నమ్మకానికి శక్తి
అమ్మ కన్న మిన్న యవని నేది?
అమ్మ వేరు వేరు యనుచు నందఱును, మా
యమ్మ మతము గొప్ప యనుట లేదు! (1)
నాన్న యన్న భక్తి వెన్నెముకఁగఁ దల్చు
నాన్న మార్గమిచ్చి నాంది పలుకు
నాన్న వేరు వేరు యున్న నందఱును, మా
నాన్న మతము గొప్ప ననుట లేదు! (2)
గురువు యుక్తి నెఱిఁగి కోరు జ్ఞానపు బోధ
గురువు యందు "లేని" గురుతు లేదు
గురువు వేరు వేరు గున్న నందఱును, మా
గురువు మతము నుండు గొప్ప యనరు! (3)
మీరు నమ్ము చుండి, మెచ్చెడి దేదైన
మీకు సొంతమౌను మేలు కొఱకు
వేరు వారి మతము వారి భక్తికి చెల్లు
ఎవరి మతము వారి యెదనుఁ దట్టు (4)
భక్తి భావ మందు వరలును స్నేహమ్ము
భక్తి మూఢు లందు బ్రతక లేదు
భక్తు లందు మూఢ భక్తులు వేరయా
భక్తి నెరిగి మసులు బాధ్యుడవుచు! (5)
మంచి చెడులు వీడి మానవత్వము వీడి
మనిషి బ్రతుకు కొఱకు మసల లేక
మతము నందు దాగు మంచిని నేర్వక
మాది మీది యనుచు మంట లేల? (6)
***********************************************
మతము = అభిప్రాయము
మల్లేశ్వరరావు పొలిమేర
08.27.2018

No comments:

Post a Comment