Sunday, April 19, 2020

మా పెళ్లి రోజు - మా కందములు - మాకు అందములు

*********మా పెళ్లి రోజు - మా కందములు - మాకు+అందములు ***********
ఒట్టులు పెట్టుచు బాసలు
మట్టుకు కలబోసె జంట  మాధవి మల్లేష్
మొట్టమొదటి వత్సరమున
తట్టు తలపులు, మనసులను దగ్గరి జేర్చెన్ (1) - 2007

మట్టుకు = పొందికకు , ప్రేమకు

"అండగ నేనుండెద నీ
నిండుగ నేనుండెదననె" నెచ్చెలి వౌచున్
రెండవ వత్సరమందున
మెండుగ మది పంచుకొనెను మిక్కిలి ప్రేమల్ (2) - 2008


ముచ్చటగా మూడవ సమ,
పచ్చని కాపురముఁ గలిగె బాబుగ చెర్రీ
వెచ్చని ప్రేమలు వెలుగుచు
నిచ్చెను శోభలను పుత్రు నిచ్చనుఁ గూర్చీ (3) - 2009

సమ = వత్సరము , ఇచ్చ = చిత్తం, మనస్సు

కొలువులని విదేశములన్
నలుదిక్కులు తిరిగి తరిగె నాల్గవ యేడున్ 
విలువయిన బంధము లవై
మలుపును కోరుకొని వచ్చె మంచిగ తలపుల్ (4) - 2010

బుడిబుడి నడకల ధ్రువుతో
వడివడి రోజులు కదులుచు వలపుల వలలో
చెడుగుడు యాటలు కలిపెన్
అడుగులు నలవోక గింట  నైదవ శకమున్ (5) - 2011

చేరుకొనె నమెరికా నా
ఆరవ సంవత్సరమ్ము నాశల తోడన్
దూరము బెర్గిన బంధపు
ద్వారము ధృఢమౌ వలపులు స్వాగత మిచ్చెన్  (6)  - 2012

సరికొత్త జీవితమ్మిటు
విరచితమై మా మది చదివెను "సాన్రోమన్"
ధరణిని వరమని కలగని
ఎరిగెను నిద్దరముఁ బలికి నేడవ యేటన్ (7)  - 2013

వలసలు వదలక వడిగా
కలవర బెట్టిన కదిలెను కలగలుపు "బ్రియా"
అలవక తోడుండి నడచి
చిలికిన పెరిమల కుటుంబ చిత్ర మెనిమిదౌ (8)  - 2014

ఈ యింటి మహాలక్ష్మియె
ఈ యేడున వచ్చెననుచు నిచ్చెను వార్తన్
ఈ యెదలను సంతృప్తిన్
ఈ యన్నకు సంతషమ్ము నిలలో నవమున్  (9) - 2015

అందని యాకాశము దిగి
అందిన మా తార పూర్వి ఆటల యందున్
అందరి పొందిక లమరుచు
చందము జిమ్మెను దశమున జాతరనొప్పెన్  (10) - 2016

రెండుగ మొదలై మనసులు
మెండుగ కలబోసి మదిన మీటుచు సృతులన్
అండగ మెదిలే మనసులు
పండుగలన్ దెచ్చి పలికెఁ బదునొకటి సమన్     (11) - 2017

అన్నియు తానై కొలచుచు
వెన్నుగ తానుండి మలచు ప్రేమగ నారీ
పన్నెండు వత్సములలో
నన్ని తన కనులను గాంచు నాతృత నుండెన్  (12) - 2018

పదమూడు జయించి నిపుడు
ఒదిగిన పిల్లల మమతల నొద్దిక తోడన్
విధిని నెదిరించి సాగుచు
చదివెద జీవితపు వాణి సంఘటితమ్మున్  (13) - 2019
వాణి = పుస్తకము

******************************************
కందం
పద్య లక్షణములు:
  1. 4 పాదములు ఉండును.
  2. ప్రాస నియమం కలదు
  3. రెండవ పాదమునందు 4 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
  4. నాలుగవ పాదమునందు 4 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
  5. ఒకటవ పాదమునందు మూడు 4 మాత్రల గణములుండును.
  6. రెండవ పాదమునందు ఐదు 4 మాత్రల గణములుండును.
  7. మూడవ పాదమునందు మూడు 4 మాత్రల గణములుండును.
  8. నాలుగవ పాదమునందు ఐదు 4 మాత్రల గణములుండును.
  9. 6వ గణము నల లేదా  కావలెను.
  10. చివరి అక్షరం గురువు కావలెను.
  11. బేసి గణం  కూడదు















Friday, April 17, 2020

మధురగతి రగడ

**********************మానవ జాతికి ******************
మానవ జాతికి మారిన రోజులు
ప్రాణముఁ దీయుచు భయమిడి రోజులు
కానని కరోనఁ గాల్చిన రోజులు
మా నవ జాతికి మభ్యపు రోజులు (1)

పరిణతిఁ జెందిన ప్రాణివి గదరా
పరులను జయించు బలుపువి గదరా
కరుణను మరచిన కామివి గదరా
దొరకని జబ్బుకి దొరికెను గదరా (2)

ఉరుకులు పరుగులు ను త్తివి కాదా
మరిచిన బంధము మండునుఁ గాదా
విరుగుడు విద్యలు వింతలుఁ గాదా
అరయఁగ మార్పును కోరెను గాదా (3)

ఆశలు భాషలు అడియాసౌనా
వేషము మార్చుట వీలగునౌనా
రోషము వీడిన రోదసియౌనా
దోషము లేనటి దొరలాగౌనా (4)
****************************************

మధురగతి రగడ పద్య లక్షణములు


  1. జాతి(రగడలు) రకానికి చెందినది
  2. 8 నుండి 16 అక్షరములు ఉండును.
  3. 4 పాదములు ఉండును.
  4. ప్రాస నియమం కలదు
  5. అంత్య ప్రాస నియమం కలదు
  6. ప్రాస యతి నియమం కలదు
  7. ప్రతి పాదమునందు 3 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
  8. ప్రతి పాదమునందు నాలుగు 4 మాత్రలు గణములుండును.

Friday, April 10, 2020

మనసులో మాట

04/10/2020

గౌరి శంకరులను కార్యమున్ తల్చుచున్
ఆ వినాయకునికి హారతిచ్చి
విజ్ఞములకెదురగు విజ్ఞతన్ కోరుచున్
వీరతిలకమద్ది వేడుకొనెద  (1) 


Wednesday, April 1, 2020

నా బాల్య మందున్నటి

********************ఇంద్రవంశము**********************
నా బాల్య మందున్నటి నాటిరోజులై 
బాట  లేకుండుట యిట్టి రోజులై
ఆబాలగోపాలము లాడు రోజులై 
మాబాగు లోకమ్మయి మంచి రోజులౌ (1)
ఆబాలగోపాలము = చిన్నలు మొదలు పెద్దల వఱకు
మాబాగు = very well 

లోకమ్ము నేలున్నను లోటు లేదురా
శోకమ్ము లేకుండను చూడు సోదరా 
నీ కళ్లముందుండునె నీ కుటుంబమై
నీ కంటి ప్రేమౌనుగ నిన్ను దల్చుచున్ (2)  

అందాల లోగిల్లను హత్తుకుండుచున్ 
బంధాల ముంగిల్లను పంచుచుండురా
విందంటు ముందుండు నవే మమేకమై
మందంటు ముందుండిన మంచి గుర్తులౌ (3)  

నీ భోగభాగ్యమ్ములు నీకు నిచ్చునా? 
నీ భార్య నీ బిడ్డలు నీకు దగ్గరై  
నీ భాగ్యవంతమ్మును నిగ్గుచుండుగా 
నీ భారమంతా కననియ్యకుండుగా (4)  

కష్టమ్ము లౌచున్నను కాంచు మంచినే 
ఇష్టమ్ము లేకున్నటి ఈర్ష్య లేలరా
స్పష్టమ్ము గా నిప్పుడు సాయమిచ్చుచున్ 
సృష్టించు నీజాతిని వృద్ధి చేయరా (5)

******************************************
ఇంద్రవంశము(ఇన్దువంశా)
ఇంద్రవంశము పద్య లక్షణములు
  • పద్య ఛందస్సుకే ఇన్దువంశా అనే ఇతర నామము కూడా కలదు.
  • వృత్తం రకానికి చెందినది
  • జగతి ఛందమునకు చెందిన 1381  వృత్తము.
  • 12 అక్షరములు ఉండును.
  • 19 మాత్రలు ఉండును.
  • మాత్రా శ్రేణిU U I - U U I - I U I - U I U
  • 4 పాదములు ఉండును.
  • ప్రాస నియమం కలదు
  • ప్రతి పాదమునందు 8  అక్షరము యతి స్థానము
  • ప్రతి పాదమునందు  , , ,  గణములుండును.