Sunday, April 19, 2020

మా పెళ్లి రోజు - మా కందములు - మాకు అందములు

*********మా పెళ్లి రోజు - మా కందములు - మాకు+అందములు ***********
ఒట్టులు పెట్టుచు బాసలు
మట్టుకు కలబోసె జంట  మాధవి మల్లేష్
మొట్టమొదటి వత్సరమున
తట్టు తలపులు, మనసులను దగ్గరి జేర్చెన్ (1) - 2007

మట్టుకు = పొందికకు , ప్రేమకు

"అండగ నేనుండెద నీ
నిండుగ నేనుండెదననె" నెచ్చెలి వౌచున్
రెండవ వత్సరమందున
మెండుగ మది పంచుకొనెను మిక్కిలి ప్రేమల్ (2) - 2008


ముచ్చటగా మూడవ సమ,
పచ్చని కాపురముఁ గలిగె బాబుగ చెర్రీ
వెచ్చని ప్రేమలు వెలుగుచు
నిచ్చెను శోభలను పుత్రు నిచ్చనుఁ గూర్చీ (3) - 2009

సమ = వత్సరము , ఇచ్చ = చిత్తం, మనస్సు

కొలువులని విదేశములన్
నలుదిక్కులు తిరిగి తరిగె నాల్గవ యేడున్ 
విలువయిన బంధము లవై
మలుపును కోరుకొని వచ్చె మంచిగ తలపుల్ (4) - 2010

బుడిబుడి నడకల ధ్రువుతో
వడివడి రోజులు కదులుచు వలపుల వలలో
చెడుగుడు యాటలు కలిపెన్
అడుగులు నలవోక గింట  నైదవ శకమున్ (5) - 2011

చేరుకొనె నమెరికా నా
ఆరవ సంవత్సరమ్ము నాశల తోడన్
దూరము బెర్గిన బంధపు
ద్వారము ధృఢమౌ వలపులు స్వాగత మిచ్చెన్  (6)  - 2012

సరికొత్త జీవితమ్మిటు
విరచితమై మా మది చదివెను "సాన్రోమన్"
ధరణిని వరమని కలగని
ఎరిగెను నిద్దరముఁ బలికి నేడవ యేటన్ (7)  - 2013

వలసలు వదలక వడిగా
కలవర బెట్టిన కదిలెను కలగలుపు "బ్రియా"
అలవక తోడుండి నడచి
చిలికిన పెరిమల కుటుంబ చిత్ర మెనిమిదౌ (8)  - 2014

ఈ యింటి మహాలక్ష్మియె
ఈ యేడున వచ్చెననుచు నిచ్చెను వార్తన్
ఈ యెదలను సంతృప్తిన్
ఈ యన్నకు సంతషమ్ము నిలలో నవమున్  (9) - 2015

అందని యాకాశము దిగి
అందిన మా తార పూర్వి ఆటల యందున్
అందరి పొందిక లమరుచు
చందము జిమ్మెను దశమున జాతరనొప్పెన్  (10) - 2016

రెండుగ మొదలై మనసులు
మెండుగ కలబోసి మదిన మీటుచు సృతులన్
అండగ మెదిలే మనసులు
పండుగలన్ దెచ్చి పలికెఁ బదునొకటి సమన్     (11) - 2017

అన్నియు తానై కొలచుచు
వెన్నుగ తానుండి మలచు ప్రేమగ నారీ
పన్నెండు వత్సములలో
నన్ని తన కనులను గాంచు నాతృత నుండెన్  (12) - 2018

పదమూడు జయించి నిపుడు
ఒదిగిన పిల్లల మమతల నొద్దిక తోడన్
విధిని నెదిరించి సాగుచు
చదివెద జీవితపు వాణి సంఘటితమ్మున్  (13) - 2019
వాణి = పుస్తకము

******************************************
కందం
పద్య లక్షణములు:
  1. 4 పాదములు ఉండును.
  2. ప్రాస నియమం కలదు
  3. రెండవ పాదమునందు 4 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
  4. నాలుగవ పాదమునందు 4 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
  5. ఒకటవ పాదమునందు మూడు 4 మాత్రల గణములుండును.
  6. రెండవ పాదమునందు ఐదు 4 మాత్రల గణములుండును.
  7. మూడవ పాదమునందు మూడు 4 మాత్రల గణములుండును.
  8. నాలుగవ పాదమునందు ఐదు 4 మాత్రల గణములుండును.
  9. 6వ గణము నల లేదా  కావలెను.
  10. చివరి అక్షరం గురువు కావలెను.
  11. బేసి గణం  కూడదు















No comments:

Post a Comment