Sunday, August 29, 2021

తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలు


సీ. మదిలోన మెదిలిన మౌనగానములకు  

నక్షరసామ్యము నందు భాష 

పలుకులో ముత్యాలు వెలికితీయగ మెచ్చు 

పదసంపదలు గూర్చి పంచు భాష 

రచనలో సరళమై రమ్యమౌచుఁను రాగ 

మాలిక వృత్తమౌ మరలు భాష 

ఆలకించుటకైన అమృతమ్మయి చెవులు

సున్నితధ్వనిలోన సొగయు భాష

ఆ. జానపదములిముడు సాహిత్యసంపద 

పద్యసొగసు నిముడు ప్రౌఢ భాష 

గిడుగు నన్నయాదు లడుగులో వికసించి 

దివ్య మైన వాణి  తెలుగు భాష


 

Saturday, August 28, 2021

శ్రీహరి కల్యాణమహోత్సవము

చదువులు కావవి, పరుగెడు!   

పదవులు కావవి, మనసుని పలుకగ లేకన్

చెదిరిన బ్రతుకుల కుంపటి!

కుదురగు మార్గము తెలియును, కొలవగ భక్తిన్!  (1)


పలికిన మాటలు వేఱఁగు 

కలిగిన చేతలు నిరతము గమ్యము లేకన్

చిలికిన ధనములు వెతలగు 

విలువగు జీవమును ముక్తి వెలుగును భక్తిన్!  (2)


మంగమ్మను మోయు  సుకృత

మింగ దొరికెను మదిలోన మెచ్చగ నేడున్

హంగులతో నోర్లాండన్

రంగుల శోభలను మురిసె ప్రాయము భక్తిన్! (3)

 

ఎంతటి భాగ్యము, శ్రీహరి 

ఇంతటి కళ్యాణమందు నిక్కడ జేర్చెన్    

వింతగ లోకము జూసిన 

అంతరమందున ప్రశాంతమందెను భక్తిన్! (4)

Sunday, August 22, 2021

రాఖి పౌర్ణమి శుభాకాంక్షలు

 సీ. తోబుట్టు అమ్మవై  దోబూచు దొంగవై 

గారాల పట్టియై కదులు నీవు

గయ్యాళి గంపవై కయ్యాల కంచువై 

కేరింత గొట్టేటి కీచురాయి

అన్నకే యన్నయై యన్ని "నా వంటివే" 

చిన్ని చిట్కాలతో చెలిమి కోరి 

ఏడ్చుచు నవ్వుతూ వీడంటు గిల్లుతూ

అల్లరి పిల్లయౌ  అన్నతోడు   

తే.గీ. రాఖి పౌర్ణమి శోభతో రవళి యొసగి 

రాఖి కట్టగ యదలోన ప్రణయమొసగి
రాఖి సందడి అందడి రాగమొలకి 
నన్ను మెచ్చగ వచ్చెరా నాదు చెల్లి  



Saturday, August 7, 2021

సరస్వతిగార్కి నా సమర్పణ

తేటగీతి:

వాక్కు శక్తులన్ పురిగొల్పు వాణి వౌచు

పెక్కు యుక్తులన్ సరిజేయు విద్య జూపి  

మ్రొక్కు ముక్తులన్ నెరవేర్చు పోకడందు

చిక్కులన్నియున్ ఛేదించె శిఖరిణి గను (1)

వాణి = సరస్వతి 

పోకడ = గమనము, నడత

శిఖరిణి = ఉత్తమ స్త్రీ



తేటగీతి:

అడరి గరిమెళ్ళ వారింట నాడ పడుచు 

లక్ష్మి రమణలకాఖరి ప్రవరమవుచు

మాత మార్గమున్ తోడుండి మంచి నెరిగి  

బాల్యమున్ విద్యలకు నాందిపల్కి చూపె! (2)   

అడరి = జనించి  , పుట్టి 

ప్రవరము = సంతానము 



కందం:

సహనము తోడ సరస్వతి 

సహృదయపు  చదువులతల్లి! సంశయమేలన్!

సహచరులందున మెలుగుచు  

మహిళాభ్యుదయముకు తాను మహిలో మెదిలెన్! (3)



 ఉత్పలమాల :

భారతి నామధేయమును బాధ్యత, నిచ్చను మేళవించుచున్

చేరితి సంప్రతిష్ఠలను స్వీయకృషిన్, పలు బ్రహ్మశక్తులన్

కోరితి విద్య విస్తరణ గోప్యము లేమని శిష్యబృందమున్

వారధి వంటి జీవనము పంచిరి! బోధన మార్గమెంచుచున్!   (4)

సంప్రతిష్ఠ = ఉన్నతస్థితి



శార్దూలవిక్రీడితము

ఉద్యోగంబున స్ఫూర్తిదాయకముతో నుత్తీర్ణతన్ పొందుచున్

ఆద్యంతమ్మున భక్తిభావములతో నాధ్యాత్మికమ్ముండుచున్

విద్యుచ్ఛక్తిని వేదశక్తిని సదా విజ్ఞానమున్ జూపుచున్

మాధ్యమ్మున్ తన త్యాగజీవితము నాత్మారాధణమ్మెంచెరా! (5)



 ఉత్పలమాల :

శ్రీయను భోగభాగ్యములు శ్రీకరమౌచు తరింపజేయుచున్

హాయను మోక్షమార్గములు హంసలు తోడున చిల్కిపొందుచున్

రేయిపగల్ ప్రశాంతమిడు ప్రేమల పంచన కూర్పుగల్గుచున్

ఆయువు పెంచు స్థైర్యములు నందునె నిత్యము! వీరికెల్లడన్! (6)



*************************************************************************************

ఓం ప్రణో దేవీ సరస్వతీ 
వాజేభిర్వాజినీవతీ 
ధీనామవిత్య్రవతు !

తాత్పర్యము : మనలోని వాక్ శక్తులను ప్రేరేపించి జాగృతమొనర్చమని ఆ వాగ్దేవి అనగా సరస్వతీ దేవిని వినమ్రముగా ప్రార్ధించుట. ప్రామాణికము - ఋగ్వేదము.

తత్ వాక్ శక్తులను తన నామధేయమున గలిగి, చదువుల తల్లియై , విద్యను విశ్వవ్యాప్తము జేయ దలచి తన దైన శైలితో ఎన్నో ఉన్నత విద్యలనభ్యసించి, విద్యుచ్చక్తి విజ్ఞాన సోపానాలను అధిరోహించిన డా. గరిమెళ్ళ సరస్వతి గార్కి పదవీవిరమణ అక్షర అభినందన సుమధుర మందార మాల. 

కీ.శే. జి.వి.రమణ మూర్తి గారు మరియు జి.లక్ష్మి నరసుమాంబ పుణ్యదంపుతుల ఆరవ మరియు చివరి సంతానంగా అలహాబాద్ లో జన్మించి సరస్వతీ నామమున అందరి ఆశీర్వచనములను పొందినారు. తన చిన్నతనములోనే తండ్రిగారిని కోల్పోయి, తన తల్లిగారికి చేదోడు వాదోడుగా ఉంటూ తన బాల్యవిద్యను పూర్తిచేశారు. 

విశాఖపట్నము, ఆంధ్ర విశ్వవిద్యాలయము నుండి బ్యాచులర్ మరియు మాస్టర్ అఫ్ ఇంజనీరింగ్ పట్టాలను అందుకున్నారు. తన ఉన్నత విద్యాభ్యాసము నందు డాక్టర్ అఫ్ ఫిలాసిఫీ (పి.హెచ్ .డి ) పట్టాను  కూడా జె.యన్.టి.యు హైదరాబాద్ నుండి సొంతము చేసుకొని మరో మజిలీని చేరుకున్నారు. అంతేకాకుండా అన్నామలై విశ్వవిద్యాలయము నుండి యం.బి.ఏ పట్టాను కూడా చేపట్టారు. వ్యక్తిగతముగా శాస్త్రీయ సంగీతమును ఆస్వాదిస్తూ , ఇన్ని విద్యాభ్యాసములను పొందుతూ ఎంతో నిరాడంబరంగా , ఎంతో సన్నిహిత్యములతో తన జీవన గమనాన్ని పయనిస్తుండటము తన గొప్పమనసునకు నిదర్శనము.

మొట్టమొదటగా  1984-1989 సమయములో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ , న్యూ ఢిల్లీ నందు పవర్ ప్లానింగ్ మరియు థర్మల్ పవర్ ప్లాంట్ డిజైన్లలో పనిచేస్తూ సాంకేతిక పరిజ్ఞానమును సంపాదించినారు. తదుపరి అధ్యాపక పదవిని స్వీకరించి గీతం విశ్వవిద్యాలయములో 1989 నుండి 2012 వరకూ ఎంతో మంది శిష్యులకు విధ్యుత్ సంబంధిత సంక్లిష్ట పాఠ్యమములను బోధించి వారి పుటలలో చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పవచ్చు. ఇంతటి సుధీర్ఘ ప్రయాణములో ఎన్నో బోధనా పద్దతులను, బోధనేతర విషయములను తెలుసుకొని ఆ అనుభవ పూర్వకముగా 2013లో జె.ఎన్.టి.యు.కె యూనివర్సిటీ కాలేజీ అఫ్ ఇంజనీరింగ్ , విజయనగరం లో ప్రొఫెసర్ గా పదవిని చేపట్టి విద్యాభ్యుదయానికి కృషిచేసినందుకు ఎంతో  అభినందనీయులు. 

నిరంతరం నూతన ఆవిష్కరణలకు పరితపిస్తూ పలు దేశీయ మరియు విదేశీయ సదస్సులలో పాల్గొని , ఇప్పటివరకూ మూడు పదుల విదేశీయ జర్నల్స్ లు ప్రచురించడము మీ కృషికి తార్కాణము . మొట్టమొదటి మహిళా వైస్ ప్రిన్సిపాల్ గాను , మొట్టమొదటి మహిళా ప్రిన్సిపాల్ గాను మీరు పొందిన ఘనత ఎందరికో స్ఫూర్థిదాయకము ప్రశంసనీయము అనుటలో సంమసయము లేదు. 

వీరిలాంటి బహుప్రజ్ఞాపాఠకులను, సహజసిద్ధమైన మానవతా విలువలను కలగలిపిన ఆదర్శజీవితము కలుగు బోధకులు అవసరము నేటి తరమునకుఎంతో ఉంది . అటువంటి ఆదర్శజీవితము నందు మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని , మరింత శోభానుమయముగా జీవితము సాగాలని …

యశస్వీభవ ... విజయీభవ ...దిగ్విజయీభవ ...అని 
ఆ సర్వాంతర్యామి ఆశీర్వదించాలని... మనసా , వాచా , కర్మణా  ఆకాంక్షిస్తూ 
సర్వదా మీ శ్రేయస్సును కోరే 
                                                                                                                             మీ 
సహోద్యోగులు మరియు శిష్యులు (ఇ.ఇ.ఇ)

Sunday, August 1, 2021

స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

స్నేహం 

నా స్వప్న లోకానికి నాంది స్నేహం 

నా ఒంటరి పోరుకు ఊరట స్నేహం 

నా ఎడారి బాటలో నమ్మకం స్నేహం 

నా గమ్యపు మజిలీ గుర్తులు స్నేహం 


భయభక్తుల సంఘర్షణలో 

మంచిచెడుల సమాలోచనలో 

ప్రేమానురాగల సముపార్జనలో 

మరో మజిలీ నా స్నేహం 


విభిన్న సంస్కృతులకు నిలయం 

విభిన్న సంస్కరణలకు నిలయం 

విభిన్న సంకీర్తనలకు నిలయం 

విశ్వసృష్టిలో మరో మజిలీ స్నేహం 


హాస్యానికి ఆయుపట్టు స్నేహం 

కరుణలో కరిగిపోవు స్నేహం 

రౌద్రానికి చోటివ్వని స్నేహం 

వీరత్వాన్ని వెలికితీయు స్నేహం 


భయానకంలో బలము జూపు స్నేహం 

భీభత్సాన్ని బిగియపట్టు స్నేహం 

అద్భుతాన్ని ఆహ్లాదించు స్నేహం 

శృంగారాన్ని శోభలను ఇముడించు స్నేహం 

శాంత జీవితపు సోఫాన మజిలీ స్నేహం