Thursday, October 31, 2024

దీపావళి

                                                                         పల్లెటూళ్లను దాటి

పట్టణాళ్ళను దాటి

ప్రపంచ వీధుల్లోకి సముద్రతీరాలు దాటి పలకరించు దీపావళి (1)

సూర్యోదయ కాంతిలో

పురోగతికి తొలిమెట్టై

మరుజన్మగా ప్రతిదినం  పలకరించు దీపావళి (2)

చిరు దివ్వెను వెలిగించి

చిరునవ్వుల పులకించి

చిరుగాలిని వెదజల్లి పలకరించు దీపావళి (3)

మనసంతా ధ్యానమును

తనువంతా కార్యమును

కనువిందులో కవ్వింపును పలకరించు దీపావళి (4)

ఆశల పల్లకి నందుకొని

పసి హృదయాల నత్తుకొని

ముసిముసి నవ్వుల కోలాహలంతో  పలకరించు దీపావళి (5)

ఏదో తెలియని తేజస్సు

ఎప్పుడూ చూడని ఆహ్లాదం

ఎల్లపుడూ మనతోడౌ పులకరించి పలకరించు దీపావళి (6)

మల్లేశ్వరరావు పొలిమేర 

10/31/2024

Friday, October 18, 2024

మనబడి - “ఈవారం నామాట”

   *****ఈ వారం నా మాట.*******

ఇంటిపని ఎక్కువ అనుకుంటున్నారా .. ?

పిల్లలు చదువుచున్నవాటిలలో భాషను నేర్చుకోవడం అనేది చాల కష్టం అయినది. ఎందుకు అంటే ఎంత పుస్తకములో చదివిన వాడుక లేనంతసేపు మరవటము సహజము. అందువల్ల మనము కొంచెం సమయము, వారములో కుదిరినప్పుడు వాళ్లతో సరదాగా చేయించాలి. అందరు పిల్లలు ఒకే విధముగా ఉండరుగనుక కొంచెం సంయమనము పాటించాలి. ఇక్కడ అమెరికాలో  చాలా ఇతర తరగతులలో ఉంటారు కనుక మనము సమయాన్ని ఎటుల ఉపయోగించాలి అనేదే పెద్ద ప్రశ్న. అందులో భాగంగా ఎప్పుడయినా ఆడియో చేసి ఉంచుకుంటే ఉపయోగపడతాయి. నాకు కుదిరినప్పుడు చేసి పంపిస్తున్నాను కనుక అవి మీరు వాడుకోవచ్చు. ఇంకా ఏమైనా కొన్ని విషయాలలో మీకు సహాయము కావాలి అంటే నేను ఒక ఫోన్ కాల్ దూరములో ఉంటాను అని మాట ఇస్తున్నాను. మీరు తరగతి గురువులను సంప్రదించవచ్చు కూడా. 

మనబడి వారు విశ్వవిద్యాలయమునకు అనుగుణంగా చాలా వివరముగా ప్రతీ రోజుకు 5 నిమిషాల నుండి 10 నిముషాలు సరిపడగా ఇంటిపనిని తయారు చేసి , మరల మరొకరిచే సరిచేయించి మరీ మనకు పంపిస్తున్నారు .  మనము కుదిరినంత వాడుకున్నచో ఎంతో ఉపయోగపడుతుంది అని నా అభిప్రాయము. 

అప్పుడప్పుడు కుదరనిచో ఒక వారము ముందో వెనకో చూసుకొని సమయము కుదురినప్పుడు ప్రయత్నించాలి. అదేవిధముగా తరగతిలో గురువులు కూడా ఎంతో ఓర్పుతో నేర్పుటకు ప్రయత్నిస్తున్నారు. మనకు ఉన్న వాటిలో 100% ప్రయత్నించి 60-80% చేసిన చాలు. ప్రయత్నసాధన లేకుండా ఏది సాధ్యముకాదు. అందరికీ తెలిసినది చెప్పుచున్నాను అని కాకుండా, ఇది మన పిల్లలకు, మనకు, తరువాత తరములకు శ్రేయస్కరమని అనుకుని కలిసి ముందుకు వెళదాము. 

-మల్లేశ్వరరావు పొలిమేర 😊

************************

Friday, October 11, 2024

మనబడి - “ఈవారం నామాట”

  *****ఈ వారం నా మాట.*******

తెలుగు పద్యములు సరళములా పరుషములా .. ?

ఒకానొకకాలములో చదువు అంటే సంస్కారము అనే భావనతోనే వాడేవారు. అంటే చదువుకుంటే సంస్కారము అబ్బుతుంది అని. ఏది మంచో ఏది చెడ్డో తెలిపేదే చదువు .  అందుకే మన గురువులకు మనము ఎంతో గౌరవాన్ని ఇచ్చే సంప్రదాయము మనకు వచ్చింది . అయితే ఆ సంస్కారాన్ని అప్పట్లో మన చదువులో ఇమిడి ఉంచేవారు .  చిన్నతనమునుండి పిల్లలు అలవర్చుకుని ఎవరితో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో కూడా (లోకజ్ఙానాన్ని) నేర్చుకునేవారు .  మరి ఇప్పుడు ఎంతవరకు మన పిల్లల చదువులలో ఉన్నాయో మీరే ఆలోచించండి. మరి ఆ సంస్కారాన్ని నేర్పే పద్దతులలో కొన్ని నీతి కథలు , శతక పద్యములు.ఆ పద్యాల పలుకలతో చిన్నతనములో దాని అర్ధాలను నేర్చి ,వయస్సుతో పాటు వాటి పరమార్ధము నేర్చుకుని ఎంతో మంచి సమాజము గర్వించదగ్గ వ్యక్తులుగా ఎదిగేవారు.


ఆ పద్యసంపదను పాడుకొనే విధముగా మార్చే వ్యాకరణ ప్రక్రియనే ఈ సరళములు పరుషములు. తెలుగు అక్షరాల హల్లులలో మొదటి అక్షరములు పరుషములుగా పిలవబడతాయి. అవే (క, చ, ట, త. ప). ఇవి ఉచ్చరించుటకు పరుషముగా ఉంటాయి. మీరు కూడా ఆ ఉచ్ఛారణను ప్రయత్నించి చుడండి.  తెలుగు అక్షరాల హల్లులలో మూడవ  అక్షరములు సరళములుగా పిలవబడతాయి. అవే (గ, జ, డ, ద, బ). అందుకే ఎక్కడైనా పద్యాలలో సరళములతో మొదలైన పదములుండి ఆ పదము తెలుగులో లేదు కదా అనిపిస్తే పరుషములుగా మార్చి చూడండి అర్థమవుతాయి. "ఇమ్ముగఁ జదువని నోరును - తమ్ములఁ బిలువని నోరును  గుమ్మరి మనుద్రవ్వినట్టి "  ఇక్కడ   జదువని,  బిలువని,  గుమ్మరి, ద్రవ్వినట్టి  వీటి అసలు పదాలు "చ"దువని , "పి"లువని , "కు" మ్మరి ,"త్ర " వ్వినట్టి  పరుషములతో మార్చగా వచ్చును. అంటే ఇమ్ముగన్ +చదువని = ఇమ్ముగ  జదువని , తమ్ములన్ + పిలువని = తమ్ముల బిలువని , నోరునున్ +కుమ్మరి = నోరును గుమ్మరి , మనున్ +త్రవ్వనట్టి = మనుద్రవ్వినట్టి అలా మారతాయి . . చూసారా . . అలా మారాక పద్యము చదివిన చాలా సరళముగా పద్య ధార వెళుతుంది. అందుకే ప్రసూనం నుంచి పిల్లలకు తెలుగు తరగతిలా ఉండదు ,  గణిత తరగతిలా ఉంటుంది అని పిల్లలకు చెబుతాను. అందరికీ లెక్కలు చెయ్యడం చాలా ఇష్టం కనుక .  మరికొన్ని విషయాలు వచ్చేవారం తెలుసుకుందాము. 

-మల్లేశ్వరరావు పొలిమేర 😊

************************

Friday, October 4, 2024

మనబడి - “ఈవారం నామాట”

 *****ఈ వారం నా మాట.*******

మాట్లాడితే సరిపోదా? చదవటం, వ్రాయడం రావాలా? 


“మా అమ్మాయి మాట్లాడగలదండీ, చదవటం, వ్రాయటం ఎందుకు!” అనేవారు ఎక్కడైనా తారసపడతారు. అవును ఒక భాష మాట్లాడటం సరిపోతుంది. కాని దానిలోని పర్యావసానాన్ని అర్థంచేసుకోవాలంటే చదవడం వస్తే మంచిది. అంతేకాకుండా అలా చదవడం వల్ల ఇంకా ఆ భాషలోని గొప్పతనాన్ని ఎప్పుడయినా వారికి వారుగా నేర్చుకోగలరు, అంతేకాకుండా ఎప్పటికీ మరవలేరు. అదే వ్రాయగలిగితే, భాషతో పాటు ఓపికగా ఉండటాన్ని నేర్పిస్తుంది, మనిషి జీవిత గమనానికి ఓపిక చాలా అవసరము. వ్రాయడం ఒక కళ కూడా. వీటి వల్ల ఒకరకమైన పద్ధతి వారికి తెలియకుండానే అలవర్చుకుంటారు. అది చిన్నతనములోనే అలవాటు అయితే తమ జీవితములో ఎన్నో మంచి పనులకు నాంది చేకూరుతుంది. లిపిలేని భాషలు ఎన్నో అంతరించిపోయాయి కదా!. అలా వ్రాసిపెట్టగలిగారు కనుక మన పూర్వికుల గ్రంథాలు మనము చదవగలుగుతున్నాము. చదవటం వ్రాయటం రెండూ వచ్చిన ఆ భాషలో భావము కూడా అర్థమవుతుంది. మనము లేక పోయినా మనము వ్రాసే వ్రాత మనలను సజీవముగా చరిత్ర పుటల్లో నిలుపగలదు. మరి మన ప్రయత్నం మనము చెయ్యాలి.. 

-మల్లేశ్వరరావు పొలిమేర 😊

************************