*****ఈ వారం నా మాట.*******
తెలుగు పద్యములు సరళములా పరుషములా .. ?
ఒకానొకకాలములో చదువు అంటే సంస్కారము అనే భావనతోనే వాడేవారు. అంటే చదువుకుంటే సంస్కారము అబ్బుతుంది అని. ఏది మంచో ఏది చెడ్డో తెలిపేదే చదువు . అందుకే మన గురువులకు మనము ఎంతో గౌరవాన్ని ఇచ్చే సంప్రదాయము మనకు వచ్చింది . అయితే ఆ సంస్కారాన్ని అప్పట్లో మన చదువులో ఇమిడి ఉంచేవారు . చిన్నతనమునుండి పిల్లలు అలవర్చుకుని ఎవరితో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో కూడా (లోకజ్ఙానాన్ని) నేర్చుకునేవారు . మరి ఇప్పుడు ఎంతవరకు మన పిల్లల చదువులలో ఉన్నాయో మీరే ఆలోచించండి. మరి ఆ సంస్కారాన్ని నేర్పే పద్దతులలో కొన్ని నీతి కథలు , శతక పద్యములు.ఆ పద్యాల పలుకలతో చిన్నతనములో దాని అర్ధాలను నేర్చి ,వయస్సుతో పాటు వాటి పరమార్ధము నేర్చుకుని ఎంతో మంచి సమాజము గర్వించదగ్గ వ్యక్తులుగా ఎదిగేవారు.
ఆ పద్యసంపదను పాడుకొనే విధముగా మార్చే వ్యాకరణ ప్రక్రియనే ఈ సరళములు పరుషములు. తెలుగు అక్షరాల హల్లులలో మొదటి అక్షరములు పరుషములుగా పిలవబడతాయి. అవే (క, చ, ట, త. ప). ఇవి ఉచ్చరించుటకు పరుషముగా ఉంటాయి. మీరు కూడా ఆ ఉచ్ఛారణను ప్రయత్నించి చుడండి.
తెలుగు అక్షరాల హల్లులలో మూడవ అక్షరములు సరళములుగా పిలవబడతాయి.
అవే (గ, జ, డ, ద, బ). అందుకే ఎక్కడైనా పద్యాలలో సరళములతో మొదలైన పదములుండి ఆ పదము తెలుగులో లేదు కదా అనిపిస్తే పరుషములుగా మార్చి చూడండి అర్థమవుతాయి. "ఇమ్ముగఁ జదువని నోరును - తమ్ములఁ బిలువని నోరును గుమ్మరి మనుద్రవ్వినట్టి " ఇక్కడ
జదువని,
బిలువని,
గుమ్మరి, ద్రవ్వినట్టి వీటి అసలు పదాలు "చ"దువని , "పి"లువని , "కు" మ్మరి ,"త్ర " వ్వినట్టి పరుషములతో మార్చగా వచ్చును. అంటే ఇమ్ముగన్ +చదువని = ఇమ్ముగ జదువని , తమ్ములన్ + పిలువని = తమ్ముల బిలువని , నోరునున్
+కుమ్మరి = నోరును గుమ్మరి , మనున్ +త్రవ్వనట్టి = మనుద్రవ్వినట్టి అలా మారతాయి . . చూసారా . . అలా మారాక పద్యము చదివిన చాలా సరళముగా పద్య ధార వెళుతుంది. అందుకే ప్రసూనం నుంచి పిల్లలకు తెలుగు తరగతిలా ఉండదు , గణిత తరగతిలా ఉంటుంది అని పిల్లలకు చెబుతాను. అందరికీ లెక్కలు చెయ్యడం చాలా ఇష్టం కనుక . మరికొన్ని విషయాలు వచ్చేవారం తెలుసుకుందాము.
-మల్లేశ్వరరావు పొలిమేర 😊
************************
No comments:
Post a Comment