Sunday, December 31, 2017

నూతన సంవత్సర శుభాకాంక్షలు

మిత్రులందఱకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
**************ద్విపద**************** ***********
గడచు ప్రతి క్షణము గతముగా దలఁచు
విడుచు కష్ట సుఖముల్ విరివిగా మనకు
కలసి వత్సరమందు కదలాడు స్మృతులు
పలుకుతున్నది నేడు ప్రత్యక్షమౌచు
తప్పు జేయని వాడు ధరణిలో లేడు
ఒప్పు జేసిన నాడు గొప్పవాడగును
కష్టముల్ చూసిన కలత చెందకుము
దృష్టి సారించు, నీ కృషినుండు జయము
ఆనంద సమయాలు నరుదుయై నేమి
వానందు దొరుకురా వసి పెక్కు తుదకు
నూతన మన్నను నుత్సాహమిచ్చి
చేతల నన్నియున్ శ్రీకారమిచ్చు
ఉభయ కుసలముల నొలయుచు మళ్ళి
అభినందనలతోడ నాశించు "మల్లి"
***********************************************
వత్సరము = సంవత్సరము , వసి = ఉత్సాహము,
ఒలయు = కోరు

Wednesday, December 27, 2017

కళావెంకట్రావు

మా ఉన్నత పాఠశాల రోజులు ...
కళావెంకట్రావు జిల్లా ప్రజాపరిషత్ పాఠశాల,
శివదేవుని చిక్కాల, ప.గో.జిల్లా
స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న సందర్భముగా
**************************************************
సీ. అల్లూరి సాక్షిగా అడుగు లేసిన రోజు
ప్రార్థనతో సాగు పాఠశాల
కొలనులో నందాలు బాలల చందాలు
బడి నేర్పు పాఠాలు పండుగులయి
కాలమున్న మొదలు కపటపు మాటలు
కలబోయు చదువులు కాంతి నిచ్చు
నాతోటి మిత్రులు నలుదిక్కులాడుచున్
పల్కుచున్ వచ్చిరి పల్లె వఱకు
తే.గీ. చేరి శివదేవ చిక్కాల, చిన్నతనము
బాల్య విద్యను నేర్చిన ప్రతిదినమ్ము
పలకరించుచు దట్టిన ప్రతి క్షణమ్ము
మంచి స్మృతులుగా నేటికి మదిని దలచు
**************************************************


Tuesday, December 26, 2017

మత్తకీర

చదువులకై ప్రాణములు తీసుకుంటున్న విద్యార్థి వార్త విని, వ్రాయబడినది..
మత్తకీర
***********************************************************
చదువుల కొఱకు ప్రాణముల్ విడి చాటిచెప్పిన దేమిరా
చెదురు మదురయి జీవితమ్ములు చేటుకాలము నిచ్చురా
మదన పడుచు శ్రమించు నాప్తుల మానసమ్ముల సాక్షిగా
వదల వలదు ప్రయత్న సాధన భావితమ్ముకు బాలకా!
***********************************************************
మత్తకీర:
20 అక్షరములు ఉండును.
26 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: I I I - I I I - I U I - U I I - U I U - I I U - I U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు 13 వ అక్షరము యతి స్థానము
ప్రతి పాదమునందు న , న , జ , భ , ర , స , వ(లగ) గణములుండును.

చదువులకై ప్రాణములు తీసుకుంటున్న విద్యార్థి వార్త విని, వ్రాయబడినది.. మత్తకీర

చదువులకై ప్రాణములు తీసుకుంటున్న విద్యార్థి వార్త విని, వ్రాయబడినది..
మత్తకీర
***********************************************************
చదువుల కొఱకు ప్రాణముల్ విడి చాటిచెప్పిన దేమిరా
చెదురు మదురయి జీవితమ్ములు చేటుకాలము నిచ్చురా
మదన పడుచు శ్రమించు నాప్తుల మానసమ్ముల సాక్షిగా
వదల వలదు ప్రయత్న సాధన భావితమ్ముకు బాలకా!
***********************************************************
మత్తకీర:
20 అక్షరములు ఉండును.
26 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: I I I - I I I - I U I - U I I - U I U - I I U - I U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు 13 వ అక్షరము యతి స్థానము
ప్రతి పాదమునందు న , న , జ , భ , ర , స , వ(లగ) గణములుండును.

Monday, December 25, 2017

Happy Christmas

*******************KANDAM ******************** Happy Christmas my friends Hoping this festival day, U celebrate well! Happy Merry Christmas Get Peace and joy, day by day, Gift of God's bell! *****************కందం ********************* హాపీ క్రిస్ట్మస్ మై ఫ్రెండ్స్ హోపింగ్ దిస్ ఫెస్టివల్ డె, యు సెలబ్రేట్ వెల్! హాపీ మెర్రీ క్రిస్ట్మస్ గెట్ పీస్ అండ్ జోయ్ డె బై డె, గిఫ్ట్ ఆఫ్ గాడ్స్ బెల్! **************************************

Thursday, December 14, 2017

సుప్రభ

*******************************
ఆ.వె. ఆటవెలదులన్ని నందచందమ్ముగా
బ్రాసతోడ బలికె రాగములను
వాణి మీద భక్తి ప్రభవించు పద్యముల్
సుప్రభలను జిందె సుస్వరమ్ము
*******************************

Monday, December 11, 2017

AIRHYD

మత్తేభవిక్రీడితము
*************************************
కనరా! పూర్వము నష్టదిగ్గజములున్ గానమ్ము  కీర్తించెరా
వినరా! నాటి కవిత్రయమ్ము పలుకుల్, విఖ్యాతమై  పోతనన్
వనమై నేడు విదేశముల్ పఱచుచూ ప్రఖ్యాతమొందెన్ గదా 
ఘనమై వెల్గు తెలుంగు తేజము తెలంగానమ్ము నందంతటన్!
*************************************


Saturday, December 9, 2017

శ్రీగౌరి

గవరపేట గ్రామంలో ఈ రోజు గౌరీ పార్వతి దేవి పుట్టినిల్లుగా తలచి ఊరిలోని ఇంటింటికి వెళ్లి అందరిని పలకరించి తరువాత అత్తవారిల్లుగా తలచు గంగలో నిమజ్ఞమునకు సిద్ధమగుచున్నది.
అయితే ఆ ప్రస్థానంలో పానుపునేసి వేడుకొంటున్నారు పుర ప్రజలు ...

ఉ. పానుపు నింటి ముంగిటను పర్చుచు పూవులు పళ్లతోడ మా
కానుకలన్న మర్చితిమి గౌరి, మహేశ్వర తోడ నీదు ప్ర
స్థానము గ్రామమంతయును సాగుచు దీవెనలిచ్చి కాచి మా
మేను కదృష్టముల్ విడిచి మిక్కిలి జీవనమందు నిల్పుమా!

ప్రస్థానము =ప్రయాణము , మేను = జన్మము

మల్లేశ్వరరావు పొలిమేర
12/09/2017



Friday, December 8, 2017

KVR

కం. శివదేవుని చిక్కాలన్
భవిత కొరకు విద్యనేర్చి భాగ్యుడ నైతిన్
అవనిని నేడ బ్రతికినన్
సవిధమ్మున తిరిగుచుండు సత్వము నందున్
సవిధమ్ము=సమీపము, సత్వము=మనన్సు
అవని=భూమి

మల్లేశ్వరరావు పొలిమేర
12-08-2017

Tuesday, November 21, 2017

శ్రీగౌరి

ఇంద్ర వజ్రము - యతి ఆఱవ అక్షరముగా
శ్రీగౌరిని మా ఊరుకి ఆహ్వానిస్తూ ...
*****************************
పిళ్ళారి తల్లీ విహరించు మాతో
కళ్ళన్ని నీకై కలిగించె నేడున్
మళ్ళించుచూ రా మననూరు లోకిన్
త్రుళ్ళింత మాయందున బొంగె గౌరీ! 
*****************************
పిళ్ళారి = వినాయకుడు
కలిగించె = సృజించు



Saturday, November 18, 2017

శ్రీగౌరి

ఉత్సాహము
గవరపేట లందు వెలసి కరుణ జూపు తల్లివై
అవనినెల్ల శక్తి రూపమౌచు గొల్చు నారివే
కవనమందు యుక్తి కొలది కల్పనమ్ము కూర్చెదన్
శివుని తోడ దీవనలను చివరి వరకు చూపుమా!

గౌరీ 
******************************************
కొలిచెద మనసు నిరతము తల్లీ 
తలచెద ప్రతిదినము హిమపుత్రీ
వలపుని సుతునకు నిడుచు గౌరీ 
విలసితమయిన కరుణవు నీవే! 
******************************************
గౌరి

గౌరి పద్య లక్షణములు

  1. వృత్తం రకానికి చెందినది
  2. అతిజగతి ఛందమునకు చెందిన 2048 వ వృత్తము.
  3. 13 అక్షరములు ఉండును.
  4. 15 మాత్రలు ఉండును.
  5. మాత్రా శ్రేణిI I I - I I I - I I I - I I U - U
    • 4 పాదములు ఉండును.
    • ప్రాస నియమం కలదు
  6. ప్రతి పాదమునందు న , న , న , స , గ గణములుండును.

Monday, November 13, 2017

ఇంద్రవజ్రము

ఇంద్రవజ్రము - యతి ఎనిమిదవ అక్షరము
**********************************************
పద్యాల పైనమ్మును భాగమౌచున్
అధ్యాయనమ్మున్ మనసంత నుండెన్
విద్యాధికారుల్ తగు వృద్ధికై నా
యద్యత్వమున్ తోడుగ నంది నారే!
**********************************************
ఆరవ స్థానము యతిగా :



ఇంద్రవజ్రము యతి ఆఱవ అక్షరముగా
శీర్షిక : మనుజుండు 
*********************************************
నానాటికిన్ మన్ననలన్ని వీడెన్ 

ప్రాణమ్ముకన్నా ద్రవిణమ్ము కోరెన్
మానమ్ము లేకన్ మనుజుండు మారెన్
ఏనాటికిన్ తానెఱుఁగుండు దీనిన్!
*********************************************


ఇంద్రవజ్రము:
వృత్తం రకానికి చెందినది
త్రిష్టుప్పు ఛందమునకు చెందిన 357 వ వృత్తము.
11 అక్షరములు ఉండును.
18 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: U U I - U U I - I U I - U U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు 8 వ అక్షరము యతి స్థానము
ప్రతి పాదమునందు త , త , జ , గా(గగ) గణములుండును.

Friday, November 10, 2017

రాట్న బంధము

"రాట్న బంధము" లో రాట్నము చెప్పు మాటలుగా వ్రాయబడినది.
*****************************************************
కం. గాంధీతో చిహ్నమవుచు
బంధమ్మును కలిగియుంటి ప్రతి చిత్రమునన్
సంధి, విధి సంస్మరణముల్
రంధి కొరకని తను జెప్పి ప్రగతిని గనిరిన్
******************************************************
సంధి = కూడిక
రంధి = ఏకాగ్రత

Wednesday, November 8, 2017

నాగ బంధములు

*********************************************************
సీ. కమతము వృత్తయి కార్యము నందున 
కాలుకి తగిలిన కాటు బడుచు 
పూజించినను గడు పుణ్యము గూడక
విగత జీవులవుచు వీడి నారు 
భూతలమ్మున మానవులతోడ జీవించు
ఫణులను కాంచగ భయము కలుగు 
కలలోన వచ్చిన కలత పడుచునున్న 
మానవుల్ మనసును మార్చు టేల? 

తే.గీ. నిశిత దృష్టితో బ్రాయము నిలుపుటకును
నిరువురి ప్రయత్నమగుచు ననిశ్చితమగు 
విషము కలిగి యుండుట వాని వృజినమౌన?
దశను మార్చుటన్ మనిషికి తగదు గాద!
*********************************************************

Tuesday, November 7, 2017

విశాఖ ప్రజా పద్య సమ్మేళనము


ద్విపదమాలిక
*********************************************
ప్రజపద్యము తలచె పద్య పక్షములు
ప్రజలకు జేరువౌ వర్ణమాలలవి

కవుల మనస్సున కలముల నుండి
ప్రవహించు సెలయేరు ప్రణయపు టేరు

ఏమి భాగ్యము నాది ఎదురపడినది
సాముల సాంగత్య సహవాసమబ్బె

అడ్మిన్ల ప్రోత్సాహమందిన నాడు
కడ్మియగుచు నాశ కదిలాడె కలము

నా వంతు కృషితోడ నాకు వచ్చినది
సేవ జేయ దలచి చేయూత నిచ్చె

ఆణిముత్యములను నావిష్కరించి
వేణుగానములతో విందగు రోజు
*********************************************
కడ్మి = అతిశయము

*************************************
కం. సంద్రపు తీరము జేరి క
వీంద్రులు పద్యములు బాడు వేళాయెనురా!
ఇంద్రుని సభలకు ధీటుగ 
ఆంధ్రుల విద్యలను జాటి ఆహా యనరా!   
*************************************   

Wednesday, November 1, 2017

నాగబంధము

నాగబంధము 
మొదటి రెండు పాదములు "ప్రియురాలు" 
తరువాత రెండు పాదములు "ప్రియుడు" పలికినట్లు వ్రాయబడినది. ప్రయత్నము, సవరణలు ఉన్న తెలుప ప్రార్ధన. 
*********************************************************
కం. మామ! బ్రమ వీడ లేకన్
నీ మదిలోన మెదులు నిజ నిజమును నేనే!
భామ! శ్రమ మేడ లేకన్
ఆమెగ లోని మనసు గను అనుఁగును నేనే!
*********************************************************
నిజ = నెచ్చెలి,
నిజము = స్వభావము
ఆమె = భార్య
అనుఁగు = ప్రియుఁడు



Monday, October 30, 2017

శ్రీకారబంధము -1

మా స్వగ్రామము(గవరపేట)లో ప్రతీ దీపావళికి గౌరిదేవిని మా దేవాలయము నందు ప్రతిష్టించి, ఒక మాసము అమ్మవారు మా పురజనుల పూజలందుకొనును. ఇటువంటి గవరపేటలందు సంబరాలు(క్షణములు) అంబరాన్ని అంటుతాయి. శ్రీకారబంధమున నా తొలి ప్రయత్నము. ఈ బంధము పరిచయము చేసినందుకు సుప్రభ గారికి ధన్యవాదములు. 
*******************************************************************
కం. శ్రీ గౌరి! హృదయ శంకరి
గా, గాంధర్వి! దయతోడఁ గాంచుము తల్లీ! 
యీ గవరపేట లందు స్వ
రాగాల క్షణము లిడుదుము, ప్రణయము నందున్! 
*******************************************************************

Thursday, October 19, 2017

దీపావళి శుభాకాంక్షలు

దీపావళి శుభాకాంక్షలు
*********ద్విపదమాలిక********************
దీపావళిన్ నింటి దీపాలు వెలుగు
భూ ప్రజలందున భోగమ్ము కలుగు
చిన్న,పెద్ద యనెడి చిరమరల్ లేక
కన్నుల విందుగా కలిసున్న రోజు
లక్ష్మి దేవిని గొల్చు లక్ష్యమ్ము కొరకు
సూక్ష్మమౌ లోపముల్ చూపవలదని
రాక్షతత్వమ్ము పారద్రోలి భువిని
వీక్షించు నెల్లరు విశ్వశాంతి కని
క్రొత్త వస్త్రములతో, కొవ్వొత్తుల మెయి
చిత్తము నందున చిరునవ్వు పెంచు
ముంగిలి నిండుగా ముగ్గులు వేసి
పొంగెను పడుచులు పూమాల లందు
సంధ్యాసమయమున సరదాలు మొదలు
మాంద్యమ్ము జూపక మందితో కదులు
పక్కనే టామ్ టామ్ టపాకాయ లన్ని
తొక్కు తూమ్ తూమను తూటాలు కొన్ని
కాకరపువ్వొత్తు కాంతులు జిమ్ము
ఏకమై పిల్లలు నెగసిల్లి గుమ్ము
చిచ్చుబుడ్డులు చింది జివ్వున బొంగు
వచ్చి పో యందర్కి వర్ణముల్ జూపు
దివ్వెల వెలుగులు దివ్యమ్ము దలచి
నవ్వుల పువ్వులన్ నలుగుర కిచ్చు
***************************************************


Sunday, October 15, 2017

భారత రాజ్యాంగము - అభిప్రాయ ప్రకటన స్వేచ్ఛ - ప్రజ పద్యం చివరి పక్షము

భారత రాజ్యాంగము - అభిప్రాయ ప్రకటన స్వేచ్ఛ
మ.కో. మాటలో నిడు, భారతమ్మున మంచి యన్నది పంచుచున్
మాట జారిన మార్చలేమను మర్మమెప్పుడు మర్వకన్
మూట కట్టిన పల్కులన్నియు ముచ్చటించుము శాంతికై  
బాట వెంబడి నవ్వు పువ్వులు భాగ్యమేకద నేటికిన్! (1)

ఆ.వె. స్వేచ్ఛ పలుకు లన్ని విచ్చలవిడియైన
హానిజేసి మార్చు హద్దుమీరి
మెప్పుపొందు మాట మేలగున్ సోదరా
తెలిసి మసులు కొనుము దివ్య మగును  (2)

కం. నొప్పించెడి మాటలతో
తప్పుగ మాట్లాడరాదు ధరణిన్ పరులన్
ఒప్పును తెలుసుకొనిన సరి   
మెప్పుని చెప్పక మరచిన మేలగును గదా!  (3)

మ.కో. జాతిరక్షణ కాలరాయుచు జాతి వైరము పెంచకన్
నీతివీడి విదేశహస్తము నెయ్యమౌనని ద్రోహమున్
పాతకక్షలు త్రవ్విజూపెడు పల్కులాడుట మానుచున్
చేతనైన సహాయహస్తము శ్రేష్ఠమైనది దేశమున్   (4)


తే.గీ. స్వచ్ఛ భారత దేశపు వాక్కు నెపుడు
నుచ్చరించుము స్వేచ్ఛగ నూతి కొరకు
రెచ్చగొట్టేడు, దూషించు రీతి నొదలు
నచ్చుమాటలు నెప్పుడు నాణ్యమగును (5)
ఊతి = రక్షణ
… మల్లేశ్వరరావు పొలిమేర
   Trophy Club, Texas, USA. Ph: +1 9253894335


Saturday, September 30, 2017

విజయదశమి శుభాకాంక్షలు

విజయదశమి శుభాకాంక్షలు
***********************ద్విపదమాలిక ****************************
అసురునిపై దేవ యని కృతయుగము
వశపరచుకొనెడి వంకర బుద్ధి 
త్రేతాయుగమ్ము దరిన్ చేర దలచె 
సీత నపహరించి శ్రీలంక నందు
ద్వాపర యుగ మన్న దమ్ములలోన
నాపసోపాలతో నధికమించగను
కలియుగమందు నీకంతర్గతమయి
కలవరపరచుచూ కల్మష మిచ్చు
మతములు జెప్పెడి మానవత్వమిడి
సతమతమయి నేడు స్వార్ధమ్ము కోరి
దుష్ట శక్తి నెదిరి దుర్బుద్ధి నెదిరి
కష్టమ్ము రాకుండ కలిమి కోరుచును
మానవుడె మనిషిన్ మనలో నొకడని
మానము నిచ్చెడి మార్పు కొరకును
దసరాను జరుపుచు ధ్యానించు భువిని
దిశజూపి నెలకొల్పు దేశమున్ శాంతి.
***************************************************
అని = యుద్ధము , మానము = గౌరవము



Sunday, September 24, 2017

ప్రసూనం - ఇంటిపని

మొదటి పాఠము పిల్లలు ముచ్చటించి
చదివి వినిపించిరి కథను  మధురముగను
అక్షరములను కూర్చెడు దక్షత తమ
చెంత నున్నదన్నారిటు సంతసించి

ఇంటి పనిలోని పదములు నేమి టనుచు
అడిగి తెలుసుకొనుచు వాటి యర్థములను
నిశితముగ వివరించుచు  నేర్ప వలెను
మనము నేర్చిన మధురపు మాతృభాష

ఆకతాయి యని నిరవై ఆరు పుటను
మొదలు, నిరువది యేడును వదల కుండ
వ్రాయ మంటిని నింటిలో పలుకు చుంటు
పర్యవేక్షణ చేయండి వందనములు    

Friday, September 15, 2017

వైద్యరంగం - మారుతున్న సమీకరణాలు

వైద్యరంగం - మారుతున్న సమీకరణాలు
మానిని (మదిరా , లతాకుసుమ , సంగతా)::

వైద్యులు నూరుకి వచ్చుచు, ముచ్చట బంచుచు జేసిన వైద్యములున్
విద్యను నమ్ముచు బేరము లాడక పేదల నారయు వేళలు పో
చోద్యము జూపుచు సొమ్మును గోరుతు సోకులు బెంచుచు చూపులకున్
బాధ్యత నాదని ప్రాయము నిల్పెడు భావన రానటి బ్రధ్నములౌ (1)

ఆరయు = ఆదుకొను, పో = పోయి ,   బ్రధ్నము = దినము
******************************************************************
వృత్తం రకానికి చెందినది
22 అక్షరములు ఉండును.
30 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: U I I - U I I - U I I - U I I - U I I - U I I - U I I - U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు 7,13,19 వ అక్షరములు యతి స్థానములు
ప్రతి పాదమునందు భ , భ , భ , భ , భ , భ , భ , గ గణములుండును.
******************************************************************

ఆ.వె. నమ్మకమును పెంచి వమ్ము జేయక మందు
నిచ్చె నాడు వెజ్జు నెఱుక తోడ
అమ్మకమును పెంచి సొమ్ము  జేయుట యందు
ములిగి నేడు వెజ్జు మోసగించి  (2)

ఆ.వె. వైద్య విద్య లందు వచ్చు మార్పును జూడు
లింగమార్పులొచ్చె  చెంగు మంటు
సృష్టికి యెదురు ప్రతి సృష్టిని గావించి
అబ్బుర పరిచె మన యంత్ర శక్తి  (3)


కం. ఏ మాత్రము శస్త్రచికి
త్సల్ మనకు వలదని బిడ్డ సంబరపడగా
భీమా చూపిన చాలని
కోమాలో కాన్పునేయు ఘోరపు సంస్ధల్! (4)

కం. భారతదేశపు వైద్యము
నేరుగ యనుభవము వల్ల  నేర్పును జూపున్
పేరుకు పెట్టిన విద్యను
చేరి నెఱుగుటకు తగినటి  స్థిరము మనదిరా!  (5)
 స్థిర = భూమి
… మల్లేశ్వరరావు పొలిమేర
   Trophy Club, Texas, USA. Ph: +1 9253894335


Tuesday, September 5, 2017

గురుపూజాదినోత్సవ శుభాకాంక్షలు

గురుపూజాదినోత్సవ శుభాకాంక్షలు 
***********************************************************************
మ.వి. తను స్వార్థమ్మును సంస్మరించకనె విద్యార్థిన్ సువిజ్ఞాతగా
మన కందించుచు నిర్విరామమున తా మాధ్యస్థముండౌచు శ
క్తిని యుక్తిన్ తగు పిల్లలందున ప్రసాదించంగ గర్వింతురే, 
కని నాచార్య దినోత్సవమ్మున శుభాకాంక్షల్ ప్రదర్శించెదన్!
***********************************************************************

Sunday, September 3, 2017

గుంటూరు సభ - ప్రజ పద్యం

******************************
కం. బాగున్నవి చిత్రమ్ములు,
సాగిన గుంటూరు సభను సందడి తోడన్
రాగపు పద్యములన్నియు,
పోగయి కవిమిత్రులంత ప్రోత్సాహించెన్!
******************************

Thursday, August 31, 2017

తెలుగు భాషా పరిరక్షణలో ప్రభుత్వం యొక్క పాత్ర-మన కర్తవ్యం "ప్రజ పద్యం "

తెలుగు భాషా పరిరక్షణలో ప్రభుత్వం యొక్క పాత్ర-మన కర్తవ్యం
.కో. నేను సైతము మాతృభాషను నిష్ఠతోడను నేర్పుచున్
కూనలందున దెల్గువెల్గులు గోరుచుండగ నా మదిన్
ప్రాణ మిచ్చుచు ప్రేమపంచుచు  ప్రాతినిధ్యమె నా విధిన్ 
మేనునిచ్చిన నాంధ్ర వాక్కుని మేళవించెద మోదమున్ (1) 

సీ. తెలుగు యక్షరములు తేనీటి కణములు
రుచి చూడు మొకసారి శ్రోణగలయు
తెలుగు వ్యాకరణము స్థిరమైన వరణము
నేర్చి చూడు సొగసౌ నీదు వాక్కు
తెలుగు ఛందస్సులు ధీరత్వ కవితలు
సాహిత్య సంపద సారమెరుగు
తెలుగు గద్యములన్ని తెలుపు నాంధ్రులకీర్తి
తెలుసుకో మన గొప్ప తెలుగు విలువ
తే.గీ. తెలుగు నేర్చుచు ప్రభువులు వెలిగిరపుడు
తెలుగు నేముందనుచు నేడు పలుకు లేల?
తెలుగు నేర్చిన నభివృద్ధి తేలి పోదు
తెలుగు పరిరక్షణము జేసి నిలుపు ఖ్యాతి! (2)      

కం. గ్రంథాలయములు పెంచుచు
సంధానించుము తెలుగును సంస్కరణమ్మున్
బంధమవుచు నాశక్తిన్ 
స్కంధములను  తెరుచునయ్యసర్కారయ్యా!   (3)

స్కంధములు  = దారులు 

.వె. భాష గొప్పతనము ప్రజలకు తెలుపుతూ
తెలుగు వెలుగు పంచు ధ్యేయ మనుచు
జాతి విలువ నిలిపి జాగృతి నిచ్చుచు
తరతరాల చెంత దాగు నెపుడు   (4)

కం. తెలుగును నేర్పిన గురువుల
విలువ తెలిసి నాదరించు విద్వత్తునిడున్
కలవరపడి వారుండిన
కలతలు మెండగు తెలుగుకి, కాచుము విధిగా  (5)

… మల్లేశ్వరరావు పొలిమేర
   Trophy Club, Texas, USA. Ph: +1 9253894335


Saturday, August 26, 2017

వినాయక చవితి కథ

కం. గజగజ వణికించు నసుర
గజముఖుడై లోకములను గర్వము తోడన్
విజయము తనను వరించుచు  
నజేయు డగుటకు తపస్సు నావశ్యమనెన్ (1)

తే.గీ. తపము జేసిన కరుణించు తాప సతడు
వరము కోరిన రుద్రుడు పరవశించు
నేమి యడిగిన విదితము నిచ్చు ననుఁచు
దూరదృష్టితో దలఁచెను దుష్టబుద్ది (2)

కం. "భక్తికి మెచ్చెద, నీకున్
ముక్తిని నిచ్చెదను కోరుము"యని దెలుపగా,
శక్తిగ శివుని యుదరమున్
యుక్త మయిన జాలనెను గజోత్సాహమునన్!  (3)

ద్వి. సంధించిన వరము సంతసమొంది
బంధము నందుండె పరమేశ్వరుండు    (4)

మ.కో. నాధుడెక్కడ కానఁబట్టక నారి పార్వతి లోకమున్
బాధతోడను గుండెనిండుగ భారమంతను మోయుచున్
మాధవా నను బ్రోచవయ్యన మారు రూపున శ్రీహరిన్
గాథ జెప్పుచు మెప్పుపొందెను గంగిరెద్దుగ నందితో   (5)

కం. మెచ్చెదను మీ ప్రతిభ నే
నిచ్చెదను దెలుపు మనె గజ ఎట్టిదయిననూ!
వచ్చిన వారెవరోయని
మచ్చుకయిన తా దలచక మాటను విడిచెన్! (6)     

Monday, August 14, 2017

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
********************************
మ.కో. భోగరాగములన్ని వీడుచు పోరులెన్నియొ చేయగా
త్యాగజీవులు సాధనమ్మున ధారబోసిన స్వేచ్ఛరా
సాగుచేయుము పుణ్యభూమిని సారవంతపు నేలకై
రాగమాలిక రంగరించు స్వరాజ్య సంపద పొందుకౌ
********************************
భోగరాగములు = అంగరంగభోగములు

Monday, August 7, 2017

రాఖీ శుభాకాంక్షలు

రాఖీ శుభాకాంక్షలు 
******************************************************************
మ.కో. తోబుట్టిన నక్కచెల్లెలు తోడునౌదురు ప్రేమతో 
నాబిడ్డగ నాదరింతురు న్నదమ్ముల నెప్పుడున్
వావాడల రక్షగట్టెడు పండుగొచ్చెను సోదరా 
చూ
ముచ్చటి సంప్రదాయము జూపవయ్య తరాలకున్
******************************************************************

Sunday, August 6, 2017

స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

కవిమిత్రులకు "స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు"
***********************************************************************
మ.కో. స్నే బంధము శాంతి సౌఖ్యము శ్రేష్టమైనది విశ్వమున్
సాసమ్ములు లెక్కచేయక శాశ్వతమ్ముగ నిల్చుచున్
కందని యూసులెన్నియొ యూరడించుచు తెల్పుచున్
మోమన్నది కొంచెమైనను మోపకున్నది మైత్రితో!
***********************************************************************

Saturday, July 29, 2017

మాదక ద్రవ్యాల మత్తులో యువత - నాశనమవుతున్న భవిత

మాదక ద్రవ్యాల మత్తులో యువత - నాశనమవుతున్న భవిత
క.వి. విలువలు నేర్పక విద్యను నేర్పక విత్తము తోడను బెంచినచో
లతలు జూసిన కావ్యము పొందిన ర్మగ దల్చిన కారణమున్        
ళముగ మత్తుపదార్ధములన్నియు త్రాగుచు తూగెను దాసులుగా
లచుచు సక్రమ మార్గము జూపిన  మంచిగ బిల్లలు మారెదరున్      (1)

విత్తము = ధనము, కావ్యము = సుఖము, దళము = అధికము
******************************
కవిరాజవిరాజితము (హంసగతి , మహాతరుణీదయిత , శ్రవణాభరణమ్):
23 అక్షరములు ఉండును.
మాత్రా శ్రేణి: I I I - I U I - I U I - I U I - I U I - I U I - I U I - I U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు 8,14,20 వ అక్షరములు యతి స్థానములు
ప్రతి పాదమునందు న , జ , జ , జ , జ , జ , జ , వ(లగ) గణములుండును.
*************************************

కం. చెత్తయని తెలిసిన యువత
త్తున కలవాటు పడుచు గ్గుచునుండెన్
మొత్తుకొనిన బండి నడిపి
నెత్తురు కార్చుటలు నేడు నిత్యము జూపెన్ (2)

సీ. విద్యార్థి దశలోన విచ్చలవిడి తన
లవర్చు సంస్థలు మాటు వేయు 
మాదకద్రవ్యమ్ము  మా చక్క చుక్కని
భ్యపెట్టుచు వారు మార్చదలచు
నలోభులౌచు హిమొనరించక నేడు 
మానవత్వము గూడ రచు నెపుడు 
యువత భవితతో ప్రయోగముల్ చేయుచు
చీడపురుగులౌచు చెఱచు చుండు

తే.గీ. గారముగ తాము పెంచిన న్నబిడ్డ
విద్యకై చమటోడ్చిరి విస్తృతమ్ము,
వ్యసనములకు బానిసముగ వ్యర్ధమయిన
ల్లిదండ్రుల హృదయాలు ల్లడిల్లె!  (3)


కం. ల్పిత జీవితమది  యని
తెల్పక నీ జీవితమును తేల్చెను మత్తున్
స్వల్పానందము కొరకున్
ల్పతెరువులా కనపడి కాల్చును మనిషిన్!  (4)

తే.గీ. మాదకద్రవ్యములలోన గ్గ కుండ 
బ్రతుకు బాటను ఛేదించు బాధ్యతగను 
త్తు వీడుచు చూడు మ్మత్తు రోజు
ష్టసుఖములు జూపును ర్మ విలువ (5)  

… మల్లేశ్వరరావు పొలిమేర

   Trophy Club, Texas, USA. Ph: +1 9253894335