Friday, November 15, 2024

తాతయ్యగారి 85 వ పుట్టినరోజు

 తాతను పట్టుకు తారాడే నే 

చేతిని వీడక చేదోడై నే

పోతిని వెంటన బుట్టంగా నే,

తాతను  ప్రేమము దాచేదేనా! (1) 


పిల్లలు బెంచుచు ప్రేమించే తా

నుల్లము నందున నుయ్యాలూపే

ఎల్లలు దాటిన నీరోజేమో

అల్లది భారమ నాలోచించే!  (2)      


సాధ్యత నేమది  సందేహమ్మా! 

భాద్యత జూపుచు భారమ్మైనన్

ఆద్యుఁడుతానయి ఆశాజ్యోతిన్

విద్యలు నేర్పుచు ప్రేరేపించెన్ (3)


కష్టములన్నవి కావేరోజూ

ఇష్టము చేయుచు నేర్వంగా యీ

సృష్టికి బాటలు సేద్యంతో నీ

దృష్టిని మల్చుము తృష్ణేదైనా  (4)


యుక్తిని బెంచుచు యుద్ధాలెన్నో

శక్తికి మించిన సాధించొచ్చోయ్

భక్తిని నేర్చిన బాధ్యత్వమ్మున్

ముక్తిని మీటెద ముందస్తుండై    (5)


పేదరికమ్మును పీల్చేగాలిన్

బాధలనన్నియు బంధించంగా    

వేదనగమ్ముచు వీచేగాలిన్

శోధనలెట్లని  సూచించంగా  (6) 


ఆ హనుమంతుని పాఠాలెన్నో 

ఊహనునుంచుచు శోధించంగా

సాహస జీవత సాఫల్యమ్ముల్

దోహదమైనవి దూరాలోచన్  (7)


రానిది యేమని ప్రారంభిస్తే

కానిది యేమని కాస్తోకూస్తో

మానక నేర్వని మాటందిస్తే  

కానద గెల్పును కార్యార్థమ్మున్ (8)


***************************************************

కోమల

కోమల పద్య లక్షణములు

  1. వృత్తం రకానికి చెందినది
  2. పంక్తి ఛందమునకు చెందిన 55 వ వృత్తము.
  3. 10 అక్షరములు ఉండును.
  4. 16 మాత్రలు ఉండును.
  5. మాత్రా శ్రేణిU I I - U I I - U U U - U
    • చతుర్మాత్రా శ్రేణి: U I I - U I I - U U - U U
    • షణ్మాత్రా శ్రేణి: U I I U - I I U U - U U
    • మిశ్రగతి శ్రేణి (3-4) : U I - I U I - I U - U U - U
  6. 4 పాదములు ఉండును.
  7. ప్రాస నియమం కలదు
  8. ప్రతి పాదమునందు 7 వ అక్షరము యతి స్థానము
  9. ప్రతి పాదమునందు భ , భ , మ , గ గణములుండును.







Thursday, October 31, 2024

దీపావళి

                                                                         పల్లెటూళ్లను దాటి

పట్టణాళ్ళను దాటి

ప్రపంచ వీధుల్లోకి సముద్రతీరాలు దాటి పలకరించు దీపావళి (1)

సూర్యోదయ కాంతిలో

పురోగతికి తొలిమెట్టై

మరుజన్మగా ప్రతిదినం  పలకరించు దీపావళి (2)

చిరు దివ్వెను వెలిగించి

చిరునవ్వుల పులకించి

చిరుగాలిని వెదజల్లి పలకరించు దీపావళి (3)

మనసంతా ధ్యానమును

తనువంతా కార్యమును

కనువిందులో కవ్వింపును పలకరించు దీపావళి (4)

ఆశల పల్లకి నందుకొని

పసి హృదయాల నత్తుకొని

ముసిముసి నవ్వుల కోలాహలంతో  పలకరించు దీపావళి (5)

ఏదో తెలియని తేజస్సు

ఎప్పుడూ చూడని ఆహ్లాదం

ఎల్లపుడూ మనతోడౌ పులకరించి పలకరించు దీపావళి (6)

మల్లేశ్వరరావు పొలిమేర 

10/31/2024

Friday, October 18, 2024

మనబడి - “ఈవారం నామాట”

   *****ఈ వారం నా మాట.*******

ఇంటిపని ఎక్కువ అనుకుంటున్నారా .. ?

పిల్లలు చదువుచున్నవాటిలలో భాషను నేర్చుకోవడం అనేది చాల కష్టం అయినది. ఎందుకు అంటే ఎంత పుస్తకములో చదివిన వాడుక లేనంతసేపు మరవటము సహజము. అందువల్ల మనము కొంచెం సమయము, వారములో కుదిరినప్పుడు వాళ్లతో సరదాగా చేయించాలి. అందరు పిల్లలు ఒకే విధముగా ఉండరుగనుక కొంచెం సంయమనము పాటించాలి. ఇక్కడ అమెరికాలో  చాలా ఇతర తరగతులలో ఉంటారు కనుక మనము సమయాన్ని ఎటుల ఉపయోగించాలి అనేదే పెద్ద ప్రశ్న. అందులో భాగంగా ఎప్పుడయినా ఆడియో చేసి ఉంచుకుంటే ఉపయోగపడతాయి. నాకు కుదిరినప్పుడు చేసి పంపిస్తున్నాను కనుక అవి మీరు వాడుకోవచ్చు. ఇంకా ఏమైనా కొన్ని విషయాలలో మీకు సహాయము కావాలి అంటే నేను ఒక ఫోన్ కాల్ దూరములో ఉంటాను అని మాట ఇస్తున్నాను. మీరు తరగతి గురువులను సంప్రదించవచ్చు కూడా. 

మనబడి వారు విశ్వవిద్యాలయమునకు అనుగుణంగా చాలా వివరముగా ప్రతీ రోజుకు 5 నిమిషాల నుండి 10 నిముషాలు సరిపడగా ఇంటిపనిని తయారు చేసి , మరల మరొకరిచే సరిచేయించి మరీ మనకు పంపిస్తున్నారు .  మనము కుదిరినంత వాడుకున్నచో ఎంతో ఉపయోగపడుతుంది అని నా అభిప్రాయము. 

అప్పుడప్పుడు కుదరనిచో ఒక వారము ముందో వెనకో చూసుకొని సమయము కుదురినప్పుడు ప్రయత్నించాలి. అదేవిధముగా తరగతిలో గురువులు కూడా ఎంతో ఓర్పుతో నేర్పుటకు ప్రయత్నిస్తున్నారు. మనకు ఉన్న వాటిలో 100% ప్రయత్నించి 60-80% చేసిన చాలు. ప్రయత్నసాధన లేకుండా ఏది సాధ్యముకాదు. అందరికీ తెలిసినది చెప్పుచున్నాను అని కాకుండా, ఇది మన పిల్లలకు, మనకు, తరువాత తరములకు శ్రేయస్కరమని అనుకుని కలిసి ముందుకు వెళదాము. 

-మల్లేశ్వరరావు పొలిమేర 😊

************************

Friday, October 11, 2024

మనబడి - “ఈవారం నామాట”

  *****ఈ వారం నా మాట.*******

తెలుగు పద్యములు సరళములా పరుషములా .. ?

ఒకానొకకాలములో చదువు అంటే సంస్కారము అనే భావనతోనే వాడేవారు. అంటే చదువుకుంటే సంస్కారము అబ్బుతుంది అని. ఏది మంచో ఏది చెడ్డో తెలిపేదే చదువు .  అందుకే మన గురువులకు మనము ఎంతో గౌరవాన్ని ఇచ్చే సంప్రదాయము మనకు వచ్చింది . అయితే ఆ సంస్కారాన్ని అప్పట్లో మన చదువులో ఇమిడి ఉంచేవారు .  చిన్నతనమునుండి పిల్లలు అలవర్చుకుని ఎవరితో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో కూడా (లోకజ్ఙానాన్ని) నేర్చుకునేవారు .  మరి ఇప్పుడు ఎంతవరకు మన పిల్లల చదువులలో ఉన్నాయో మీరే ఆలోచించండి. మరి ఆ సంస్కారాన్ని నేర్పే పద్దతులలో కొన్ని నీతి కథలు , శతక పద్యములు.ఆ పద్యాల పలుకలతో చిన్నతనములో దాని అర్ధాలను నేర్చి ,వయస్సుతో పాటు వాటి పరమార్ధము నేర్చుకుని ఎంతో మంచి సమాజము గర్వించదగ్గ వ్యక్తులుగా ఎదిగేవారు.


ఆ పద్యసంపదను పాడుకొనే విధముగా మార్చే వ్యాకరణ ప్రక్రియనే ఈ సరళములు పరుషములు. తెలుగు అక్షరాల హల్లులలో మొదటి అక్షరములు పరుషములుగా పిలవబడతాయి. అవే (క, చ, ట, త. ప). ఇవి ఉచ్చరించుటకు పరుషముగా ఉంటాయి. మీరు కూడా ఆ ఉచ్ఛారణను ప్రయత్నించి చుడండి.  తెలుగు అక్షరాల హల్లులలో మూడవ  అక్షరములు సరళములుగా పిలవబడతాయి. అవే (గ, జ, డ, ద, బ). అందుకే ఎక్కడైనా పద్యాలలో సరళములతో మొదలైన పదములుండి ఆ పదము తెలుగులో లేదు కదా అనిపిస్తే పరుషములుగా మార్చి చూడండి అర్థమవుతాయి. "ఇమ్ముగఁ జదువని నోరును - తమ్ములఁ బిలువని నోరును  గుమ్మరి మనుద్రవ్వినట్టి "  ఇక్కడ   జదువని,  బిలువని,  గుమ్మరి, ద్రవ్వినట్టి  వీటి అసలు పదాలు "చ"దువని , "పి"లువని , "కు" మ్మరి ,"త్ర " వ్వినట్టి  పరుషములతో మార్చగా వచ్చును. అంటే ఇమ్ముగన్ +చదువని = ఇమ్ముగ  జదువని , తమ్ములన్ + పిలువని = తమ్ముల బిలువని , నోరునున్ +కుమ్మరి = నోరును గుమ్మరి , మనున్ +త్రవ్వనట్టి = మనుద్రవ్వినట్టి అలా మారతాయి . . చూసారా . . అలా మారాక పద్యము చదివిన చాలా సరళముగా పద్య ధార వెళుతుంది. అందుకే ప్రసూనం నుంచి పిల్లలకు తెలుగు తరగతిలా ఉండదు ,  గణిత తరగతిలా ఉంటుంది అని పిల్లలకు చెబుతాను. అందరికీ లెక్కలు చెయ్యడం చాలా ఇష్టం కనుక .  మరికొన్ని విషయాలు వచ్చేవారం తెలుసుకుందాము. 

-మల్లేశ్వరరావు పొలిమేర 😊

************************

Friday, October 4, 2024

మనబడి - “ఈవారం నామాట”

 *****ఈ వారం నా మాట.*******

మాట్లాడితే సరిపోదా? చదవటం, వ్రాయడం రావాలా? 


“మా అమ్మాయి మాట్లాడగలదండీ, చదవటం, వ్రాయటం ఎందుకు!” అనేవారు ఎక్కడైనా తారసపడతారు. అవును ఒక భాష మాట్లాడటం సరిపోతుంది. కాని దానిలోని పర్యావసానాన్ని అర్థంచేసుకోవాలంటే చదవడం వస్తే మంచిది. అంతేకాకుండా అలా చదవడం వల్ల ఇంకా ఆ భాషలోని గొప్పతనాన్ని ఎప్పుడయినా వారికి వారుగా నేర్చుకోగలరు, అంతేకాకుండా ఎప్పటికీ మరవలేరు. అదే వ్రాయగలిగితే, భాషతో పాటు ఓపికగా ఉండటాన్ని నేర్పిస్తుంది, మనిషి జీవిత గమనానికి ఓపిక చాలా అవసరము. వ్రాయడం ఒక కళ కూడా. వీటి వల్ల ఒకరకమైన పద్ధతి వారికి తెలియకుండానే అలవర్చుకుంటారు. అది చిన్నతనములోనే అలవాటు అయితే తమ జీవితములో ఎన్నో మంచి పనులకు నాంది చేకూరుతుంది. లిపిలేని భాషలు ఎన్నో అంతరించిపోయాయి కదా!. అలా వ్రాసిపెట్టగలిగారు కనుక మన పూర్వికుల గ్రంథాలు మనము చదవగలుగుతున్నాము. చదవటం వ్రాయటం రెండూ వచ్చిన ఆ భాషలో భావము కూడా అర్థమవుతుంది. మనము లేక పోయినా మనము వ్రాసే వ్రాత మనలను సజీవముగా చరిత్ర పుటల్లో నిలుపగలదు. మరి మన ప్రయత్నం మనము చెయ్యాలి.. 

-మల్లేశ్వరరావు పొలిమేర 😊

************************

Friday, September 27, 2024

మనబడి - “ఈవారం నామాట”

 “ఈవారం నామాట”

************************

మన పిల్లలు మన మాతృభాష అయిన తెలుగు నేర్చుకోవాలంటే, ఆ భాష సౌందర్యాన్ని మనము ముందు తెలిసుకోవాలి. అయితే మన దైనందిత జీవితములో ఎన్నో మాటలు అలా వచ్చిపోతుంటాయి కాని మనము వెతికి చూసినంతవరకూ ఆ సౌదర్యభావన అవగతమవదు. సరే ఒక సారి మన బంధుత్వాలనుంచి మొదలు పెడదాము .. అమ్మ , నాన్న, అక్క , అన్న, తమ్ముడు, చెల్లి, అత్త, మావయ్య .. వీటన్నిటిలో ఉన్న ఆ అందమేముటో గుర్తు పట్టారా? 😀లేదంటే ఇంకొన్ని పదాలు చూద్దాము.. పిల్లజల్ల, పెద్దమొద్దు, ముద్దవద్దు, అట్టిపెట్టు .. ఏమిటో ఈయన ఏమి చెబుతున్నారు అనుకుంటున్నారా.. అవును వీటన్నిటికీ సామరస్యము ఒక హల్లు మీద అదే హల్లు పడేలా ఈ భాషలో ఉన్న అందం .. మీరు ప్రయత్నించి చూడండి .. మిగతా భాషల్లో ఎలాఉందో తెలియదు గాని దీనివల్లనే అనుకుంటా మన మాటలో ఒక తెలియని గానమాధుర్యాన్ని వినగలుగుతున్నాము. మరి దీనినే ద్విత్వము అంటాము , ద్వి అంటే రెండు, రెండు సార్లు ఒకే హల్లు కలయిక.. ద్విత్వ+అక్షరము = ద్విత్వాక్షరము .. ప్రసూనము తరగతిలో రెండవ పాఠములో మన పిల్లలు నేర్చుకుంటన్నవి ఇవేనండోయ్.. ఒప్పుకుంటారా ! 😀

అందుకే అన్నారు “దేశభాషలందు తెలుగు లెస్స” అని రాయల వారు. 

… మల్లేశ్వరరావు పొలిమేర

************************

Thursday, September 5, 2024

గురుపూజాదినోత్సవ శుభాకాంక్షలు 2024

************నాగర (నాగరక)**********

ఓ గురువౌచు ధ్యానమున్

ఓ గురుతౌచు జీవమున్ 

ఓ గురువందు ప్రాణమున్ 

తా గురువుంచు నెల్లడున్! (1)   

*గురువుంచు = గౌరవముంచు 


గద్యములందు గమ్యమున్

పద్యములందు భావమున్ 

విద్యలనెల్ల నేర్పుచున్

ఉద్యమకారుడౌనుగా! (2)


ఓర్పును గూడ బెట్టుచున్

నేర్పును సానబెట్టుచున్

కూర్పును కోరుచుండుచున్

చేర్పును జెంతజేర్చురా! (3)


అంతటి గొప్పవారికిన్

చెంతన జేరినున్నచో

ఎంతటి భాగ్యమౌను, మీ  

కంతట, వందనమ్ములున్! (4)

                              --- మల్లేశ్వరరావు పొలిమేర 


**************************************************

నాగర పద్య లక్షణములు

  1. ఈ పద్య ఛందస్సుకే నాగరక అనే ఇతర నామము కూడా కలదు.
  2. వృత్తం రకానికి చెందినది
  3. అనుష్టుప్పు ఛందమునకు చెందిన 87 వ వృత్తము.
  4. 8 అక్షరములు ఉండును.
  5. 12 మాత్రలు ఉండును.
  6. మాత్రా శ్రేణిU I I - U I U - I U
  7. 4 పాదములు ఉండును.
  8. ప్రాస నియమం కలదు
  9. ప్రతి పాదమునందు భ , ర , వ(లగ) గణములుండును.

 

Sunday, August 11, 2024

ఆశ

 


మానవ జీవితమంతా ఆశే,
ప్రాణము బుట్టిననంతా ఆశే,
నేనను భావననంతా ఆశే,
దేనిని వీడనిదంతా ఆశే! (1)

రైతుకు వానలరాకన్ చూపుల్ 
చేతికి పంటను జూసే రోజుల్ 
పాతికి డబ్బులు వచ్చే దారుల్
మూతికి కూడును నిచ్చే ఆశే! (2)

మొల్కలు మొల్చినవచ్చే నవ్వుల్ 
ఉల్కలు రాలిన రాత్రై మువ్వల్ 
పల్కున ప్రాయములేచెన్ గువ్వల్ 
మేల్కొని కష్టముజేసే ఆశే! (3)

బంధువులందరునున్నా బాధల్ 
విందులునెందఱినున్నా వాదుల్ 
వందల జీతములున్నా ఈర్ష్యల్ 
అందని ప్రేమలకోసం ఆశే! (4)

మాటకు మాటలుజూపే ప్రేమల్ 
కూటమి నేర్పడి నేర్పే ప్రేమల్ 
దాటుచు దగ్గరినుండే ప్రేమల్ 
నేటికి మంచిని కోరే ఆశే (5)

స్వప్నమే కావచ్చు

 

"పువ్వుల వనములో

నవ్వుల హరివిల్లు"

ఎవ్వరి సొంతమయి

మువ్వలు మ్రోగునో (1)

మనసులో మౌనమును

కనులలో గానమును

తనువులో ధ్యానమును

పనులలో ప్రాణమును (2)

నింగిని కళకళతో

రంగుల తలపులతో

హంగులు వలపులతో

పొంగిన పలుకలతో (3)

గోరంత తలపించి

తానంత పులకించి

పేరందు విలపించు

స్వప్నమే కావచ్చు (4)

…మల్లి 08.10.2024

Monday, July 8, 2024

పిలుపు వచ్చెనండి 2024

 ********************************************

పిలుపు వచ్చెనండి  వేసవి విడుదల్లో 
"అమ్మ ఆవు" అన్న కమ్మగాను 
తెలుగువారి సొత్తు తెనుగుగాక మరియేమి 
భాషనేర్పి తెలుపు భావితరము (1)

చిన్న చిన్న పద్య, చిత్రములతోడను 
కష్టమైనగాని కలతయేల 
నేర్పి చూపుదాము కూర్పుకొనుచు నేడు 
చిన్నతనమునందు వెన్నముద్ద (2)

భాషతెలిసి నంత భావము తెలియును 
అమ్మ నాన్న మనసు అర్థమగును 
భాషతెలిసి నంత భాద్యత పెరుగును 
వమ్ముకాదు వినుడి, నమ్మకమ్ము (3)

ఏడవుండు నమ్మ వేమన పద్యమ్ము 
ఏడనేర్పురమ్మ నీతికొరకు 
వాడవాడలందు తోడుగా నేర్పించి 
తెలుగువారి మంచి తెలుపుదాము (4) 
******************************************

Monday, May 13, 2024

MOTHERs DAY - Purvi

 Wherever you are 

Wherever you stand 

you are right there in my hand (1)

Wherever you are

Wherever you go 

you are right there, stand next to me

And I'm next to you (2) --(1)

You see me here

You see me there

you see me everwheeeeeer   (3) --(1)

I have to confess 

That you are the best 

That I ever seen of the rest (4) --(1)

Whatever you do

Whatever you say 

You are right there in my heart 

And this is what I want to sayyy (5) --(1)

HAPPY MOTHER'S DAY

--Purvi Polimera 

10-May-2024 










Wednesday, March 27, 2024

ఉగాది 2024 - నా బాల్యము

 

పేరునకు ఉగాది, తలచు ప్రేమలు లేవోయ్ 

చేరువగు అగాధ వలపు చిత్రము లేనోయ్ ,  

కోరుకొను సుగంధమనెడి క్రొత్తవి కావోయ్ 

దూరమయిన పండుగ మరి దొర్కుట నేమోయ్! (1)


తుళ్లిపడుచు నిద్రవిడచి తోటల చెంతన్ 

పల్లెవలపు పంచుకొనుచు పాటలు తోడై  

అల్లుకొనగ వేపచిగురు నాత్రుత తోడన్ 

మల్లుతిరిగి కొట్టుకొనుచు మామిడి కాయల్! (2) 


బాల్యమునవి స్నేహమునకు బాటలు కావా 

తుల్యపు మన జీవితములు తోడగు రోజుల్  

మూల్యమువలె జూడవలదు ముచ్చటలేగా 

బాల్యమున ఉగాదినొదుగు పండుగ రోజుల్ (3)



***************************************************

శంకర1 పద్య లక్షణములు

  1. వృత్తం రకానికి చెందినది
  2. అతిశక్వరి ఛందమునకు చెందిన 7135 వ వృత్తము.
  3. 15 అక్షరములు ఉండును.
  4. 20 మాత్రలు ఉండును.
  5. మాత్రా శ్రేణిU I I - I I U - I I I - I U I - I U U
    • త్రిమాత్రా శ్రేణి: U I - I I I - U I - I I I - U I - I U - U
    • చతుర్మాత్రా శ్రేణి: U I I - I I U - I I I I - U I I - U U
    • పంచమాత్రా శ్రేణి: U I I I - I U I I - I I U I - I U U
    • షణ్మాత్రా శ్రేణి: U I I I I - U I I I I - U I I U - U
    • మిశ్రగతి శ్రేణి (5-4) : U I I I - I U I - I I I U - I I U - U
  6. 4 పాదములు ఉండును.
  7. ప్రాస నియమం కలదు
  8. ప్రతి పాదమునందు 11 వ అక్షరము యతి స్థానము
  9. ప్రతి పాదమునందు భ , స , న , జ , య గణములుండును.