Sunday, August 17, 2025

తెలుగు వాడి ననుచు - ఆటవెలదులు

తెలుగు వాడి ననుచు పలుకరా ఈరోజు

తెలుగు భాషనుండు తియ్యదనము  

తెలుగు నేర్పి జూపి తెలుపరా, నీ విధి

తెలుగు జాతి కొరకు వెలుగు నిలిపి (1)


తాతదండ్రులందు దాగిన సొత్తురా

మ్మ బామ్మలందు నాత్మ కలిగి, 

భాషలోని తలపు వితలో జూపుచు 

బాధ్యతయని తెలిసి పంచు కొనుము (2)  


నెల్లలోకమందు నెందు కాలెడి యున్న

తెలుగు వారి సొత్తు తెనుగు వ్యాప్తి, 

కెల్లరందు నున్న పిల్లలందరు నేడు

తెలుగు నేర్చినంత కలుగు తృప్తి! (3)

 


Friday, June 20, 2025

ధర్మ ధనుష్టంకారం

 తే.గీ. సమర సాహిత్య సంగీత సారమందు

విజయభేరిని భాస్కర రచన గాంచి

ఉల్ల మందున ఉత్సాహమెల్ల జూపు 

గాన మాధుర్యమును గొల్పు కలము గాద !

Monday, April 28, 2025

8వ ఉత్తర అమెరికా తెలుగు సంబరాలు - ఆంధ్ర (ప్రవాస) పౌరులై!

  

ఆంధ్ర పౌరులై!

ఉత్పలమాలలు

 

నేనొక రోజు చిత్తమున నిచ్చెలగా పరిశీలనాత్మమున్

దేనిని బొందడానికని దీరములన్నియు దాటివచ్చి, యా

కానని బుణ్యభూమియెడ కమ్మని బ్రేమను బంచునంచు, నే 

వానిని గుర్తుచేసుకొను భాగ్యము నిప్పుడు పద్యమల్లికన్ ! (1)

 

ఊరును వీడి, యున్నతము నోర్పుగ యుక్తిని దోడ నేర్చుచున్

వీరులు వీరు నభ్యుదయ వీక్షణ గాంచగ విశ్వ వ్యాప్తికై  

చేరి ప్రవాస జీవితము శ్రేయముగా గనువిందు గాంచుచున్

పేరును బెంచుచున్, తెలుగు బిడ్డలు, నెంతటి బాట లేయునో! (2)

 

కష్టములెన్నియున్న తన కార్యపు దీక్షను బెంచి జూపుచున్

సృష్టిని సాధనాయుతపు వృద్ధిని బుద్ధిని పొందుపర్చుచున్    

ఇష్టముజేసి నేర్పులను శిక్షణ బొందుచు ముందుజూపుతో

స్పష్టత జూపి కార్యమును సాధన నిల్పెను, యాంధ్ర పౌరులై! (3)

 

తాతలు లేరు నేర్పుటకు, దండ్రుల సంపదలెల్ల లేకనే

చేతురు కాయకష్టములు, స్నేహపు భావము స్వీకరించుచున్

భీతిని వీడి సాగినను బింబము జూపెడు రోజుకోరుచున్ 

జాతికి వీరు నాద్యులగు, సంస్కృతి నేర్పుచు నెల్లలోకమున్  (4) 

  

పెంచిన ప్రేమ నిల్పుకొని పెద్దల సుద్దుల బాటనడ్చుచున్

వంచనలెన్నియున్న తమపంచన జేర్చక నిష్టబుద్ధితో

అంచల నంచలన్ నిలిపి అందని దేమని నెక్కిచూపుచున్

మంచి ప్రవాస ఆంధ్రులని మాటలతో మనపేరునిల్పెరా! (5) 

 

 అంతట నాగి ఉండుటయె గాక తరాలగురించి తోచుచున్    

అందరు తెల్గునేర్వవలెనంచు స్వభాషను సత్కరించిచున్  

అందరునొక్కరై బడులు బాధ్యతతో నెలకొల్పి నేర్పగన్, 

అంతట ఆంగ్లమాంధ్రములు ఆశల బాసలు తీర్చు భాషలౌ!  (6) 

 

పోరుకు సిద్దమందురట భూతలమందున నెట్టిరంగమున్

భారతదేశపౌరులయి బాధ్యతతోడను దౌత్యవేత్తగా

వేరొకదేశ సంపదలు విస్తృతరీతిని విస్తరించుచున్

వారి ప్రశంసలందుకొను వారసులందరు నేమి భాగ్యమో! (7)

 

సాహితి సాంప్రదాయములు చక్కటి చిక్కటి నాట్యగానముల్

ఊహకు మించి చూపగల శోభలనన్నియుఁ సంతరించుచున్

తాహతకొద్ది సాయపడి దాతగనాదుచు పుణ్యభూమికై

దోహదమైన కార్యములు దోడ్డగజేయుచు చాటుచుండిరే! (8) 

 

కొందరు సాఫ్టువేరులను కోరుచు నెక్కెన గద్దెలెన్నియో

కొందరు వైద్యవృత్తులను కోరుచు మిక్కిలి శక్తివంతులౌ 

కొందరు నాయకత్వమును కోరుచు చెక్కిన సంస్థలెన్నియో

కొందరు నెందరో! తెలుగు కూనలు మక్కువతోడ చేరికౌ! (9)

 

A person in a blue suit

AI-generated content may be incorrect.ఛందములోన నందమును జాతిని నెప్పుడు మేలుకొల్పగా

బంధములన్ని కూర్చుకుని పచ్చని జీవనమెంచుచుండగా

అందరువేయు ముందడుగు పౌరుని తీరుని, వృద్ధి జూపగా

వందనముల్ ప్రవాసులకు, వారథి వీరులకెల్ల నెల్లడున్! (10)

 

మల్లేశ్వరరావు పొలిమేర 

ట్రోఫీ క్లబ్ , డల్లాస్ 

05.15.2025



06/16/2025

8వ ఉత్తర అమెరికా తెలుగు సంబరాలలో భాగంగా నిర్వహించిన కథలు, కవితలు, మరియు
పద్యాల పోటీలలో పాల్గొన్న తెలుగు రచయితలకు శుభాభివందనాలు. దేశవ్యాప్తంగా
జరిగిన ఈ తెలుగు రచనాపోటీలకు వివిధరాష్ట్రాలనుంచి రచయితలు పాల్గొన్నారు.
ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన సినిమా పాటల రచయిత కల్యాణ
చక్రవర్తి త్రిపురనేని గారికి, జీడిగుంట విజయసారథి గారికి, మధిర మూర్తి
గారికి, శ్రీనివాస భరద్వాజ కిశోర్ (కిభశ్రీ) గారికి, ఉడుతల రామకృష్ణ
గారికి, భాస్కర్ పులికల్ గారికి, భాస్కర్ సోమంచి గారికి, మరియు లక్ష్మి
ఉడుతల గారికి NATS తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.
ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన రచయితలకు శుభాకాక్షలు.

కథల పోటీ విజేతలు:
ప్రథమస్థానం: ఐచ్ఛికం (ఓ బొచ్చు కుక్క స్వగతం), రచయిత: యర్రాబత్తిన
మునీంద్ర(చైత్రశ్రీ)
ద్వితీయస్థానం: మితాహారం, రచయిత్రి: రాధికా నోరి
తృతీయస్థానం: సామెతలే సర్వస్వం, రచయిత: రాజ్ మంచిరాజు

కవితల పోటీ విజేతలు:
ప్రథమస్థానం:  ఐకమత్యపుపంట,  రచయిత: యర్రాబత్తిన మునీంద్ర(చైత్రశ్రీ)
ద్వితీయస్థానం:  మనతెలుగు,  రచయిత: కాశీనాథ్ కొమరవెల్లి
తృతీయస్థానం:  గగనంలో దహనం, రచయిత: రాజ్ మంచిరాజు

  పద్యాల (ఛందస్సుతో కూడిన) పోటీ విజేతలు :
ప్రథమస్థానం: ఆంధ్ర పౌరులై, రచయిత: మల్లేశ్వరరావు పొలిమేర
ద్వితీయస్థానం: తెలుగు వైభవం, రచయితలు: వేణుగోపాల్ అక్కినేపల్లి, మరియు
రాజ్ మంచిరాజు
తృతీయస్థానం: కాలిఫోర్నియా, రచయిత: ప్రసాదరావు ర్యాలి



 

Sunday, January 26, 2025

గురువులు - మనబడి

ఈ రోజు మన గురువుల ధ్యేయానిరతిని చూస్తూ ... 

ఆటవెలదులలో .. 


చెప్పదలచినాను చిన్నమాట నయన

ఎంతగొప్ప గురువులందరికడ

బాలలందు తాము  బంధమ్ము ముడివడి

చెంత జేరవచ్చె నంత కలసి (1)   


తల్లిదండ్రులంత అల్లగురువులంత

తెలుగుతల్లి యందు పలుకులిడుచు

బాధ్యతాయుతమ్ము పంచుకున్న తలపు

అందిపుచ్చుకున్న త్మబలము (2)  


నేర్చుకొనుట కన్న నేర్పుట కష్టమ్ము

బాలలందు నోర్పు హుళ గాద

సంకటములు దాటి సంస్కృతిని నిలిపి

సంస్కరించు మీకు వందనాలు (3)

Wednesday, January 1, 2025

కొత్త వత్సరమని

పొద్దు పొడిసి నేడు నిద్దుర వీడుచు 

కొత్త వత్సరమని కోరు టేల,

మంచి తలపులన్ని మదిలోన పూయుచు

కొత్త లోకములకు విత్తు వేయు (1) 


నేను నాది యనక నెయ్యము చేకూర్చి 

కొత్త బంధములను కూర్పుకొనుచు 

మాటసాయమిచ్చి మానవత్వముతోడ  

కొత్త లోకములకు విత్తు వేయు (2)