Sunday, December 23, 2018

ఏమి వింతయో - ఉత్పలమాలలు

                   ఏమి వింతయో - ఉత్పలమాలలు    
2019 సంక్రాంతి పండుగ సందర్భంగా అమెరికా లో కాలిఫొర్నియా రాష్ట్ర రాజధాని నగరం అయినటువంటి శాక్రమెంటో లో నెలకొనిఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం (టాగ్స్) వారు నిర్వహించిన “శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ” లో ఈ క్రింది నా కవిత రెండవ ఉత్తమ కవిత గా ఎంపిక కాబడ్డాయి.  
********************************

ఏమది తట్టి లేపునది? యిట్లు నుషోదయ క్రాంతి పుంజమున్
ప్రేమలుఁ బంచు బంధములఁ  బేరుకుపోయిన భావ జాలముల్
నీమములన్ని  నిత్యమయి  నేర్పుగఁ నుత్పలమాల నల్లగా!
నామది నెల్ల పద్యముల నానుడి, హాయగు గాక నేమదౌ! (1)



కన్నుల రెప్పలాడుచునుఁ గమ్మని కైతలకేగి చూడగా
చిన్నగ వచ్చి దివ్యమగు జీవన యానపు జ్ఞప్తిఁ జూపుచున్
మన్నన బొందు మానవుల మంచిని మాటల యందుఁ గూర్చుచున్ 
మిన్నగ సారవంతముగ మీటిన జన్మము ధన్యమౌనుగా (2)  



అంతట లేచి పానుపున నాశలు భాషలు నెక్కు పెట్టుచున్
చింతలు వీడి చేరువగు శ్రేష్ఠపు బుద్ధిని సాధనమ్ముతో
అంతరమందు దైవమును నార్తిగఁ గొల్చుచు భక్తి నింపుచున్
వింతగ మారు లోకమును విజ్ఞత తోడను విప్పు చుండెరా  (3)



బంధము గాని బంధములు ప్రాసలుఁ గల్పెనుఁ బ్రేమ బంధమున్
బంధములన్ని దూరమయి పంచుట నేర్వని ప్రేమ లెక్కువై
బంధము గూర్చి పిల్లలకు భాద్యత తోడను నేర్ప లేకయే
అందరి త్రోవ లోక్కటయి యందల మెక్కుట నేమి వింతయో   (4)



తంటల నెన్ని చూచెదరు తక్కువ యైనను తిండి గింజలున్
వంటల నెల్ల వద్దనుచు వక్రపు వంటకమందు వంగుచున్
పంటలు సాగు రైతులను వంచన జేయుచు మంటఁ గల్పుచున్
కంటిరి క్రొత్త లోకములుఁ గాంచక కంచపు కూడు వింతయై  (5)








తీరిక లేదు మాటలకు తీయని బంధము లేల వచ్చునో
చేరిక లేదు కూటమికి శ్రేయపు స్నేహము లేల వచ్చునో
కోరిన లేదు కాలమని కోరు ప్రశాంతత లేల వచ్చునో
ప్రేరణ లేని కార్యముల పెన్నిధియై యెదిగుండు వింతయై (6)



అజ్ఞత నందు సంస్కృతుల నక్కరపట్టని బోధనమ్ములన్
విజ్ఞత లేని విద్యలను విక్రియ రూపములందు నేర్చుచున్    
ఆజ్ఞల తోడ వైరముల నంతట నింపుచు సృష్టిభిన్నమున్
ప్రజ్ఞత లేని శాస్త్రముల పంచన జేరుటనేల వింతగా (7)



మాటకు మాటఁ బెంచుకొని మక్కువ తెంచిన తల్లిదండ్రులై
ధీటుగ నేను గొప్పయను తిమ్మిరినందున వీడుచుండగా
చేటని సంఘమెన్నడును జెప్పక బిడ్డల బాగులెంచకన్
పోటని, మేటి వక్తలుగ భూమినిఁ నేలుట నేల వింతయో!  (8)



వార్తలు యన్నిఁ జేరునిటు వంచక సంస్థల దుష్ట శక్తులన్
కర్తగ మారి దేశములు గాల్చుచు, శాంతిని రూపుమాపుచున్
వర్తక హెచ్చుతగ్గులను, లాభము బొందుచు తాము గొప్ప సం
స్కర్తలునైన, లోకమున కర్మలు కాంచుట లేల వింతయో ! (9)



వింతలు యెన్ని నున్న మన విజ్ఞత తోడను మార్పు చెందుచున్
కంతలు కట్టిపెట్టి మన కార్యములందున భక్తి నింపుచున్
మంతనమందు మంచియను మర్మము నేర్చుచు సాగిపొమ్మురా
చింతలు లేని జీవితము చిక్కును శ్రేష్ఠపు బుద్ధి తోడుగా !  (10)




మల్లేశ్వరరావు పొలిమేర

12/23/2018

Monday, December 17, 2018

Dhruv Birthday 2018

HAPPY BIRTHDAY DHRUV
**************************చంద్రలేఖ*********************
ధ్రువుని మదిలో తోకచుక్కల్ని జూసెన్
దివికి నెగిసే ధీరుడై వ్యోమగామిన్
అవని కలలో నాశతో నాటలాడెన్
వివరమగులే వీనికిన్, పుట్టి నేడున్ (1)
వివరము = తొమ్మిది
గృహము కదియే కృత్యమై రూపమిచ్చే
సహితమదిగా సాధనమ్మౌచు మాకున్
నిహితమవుతూ నిత్య శోభల్ని పెంచీ
మహిత మగురా మాకిలా వేడుకౌచున్ (2)
తను మనసుతో తాకు నీ తల్లి ప్రేమల్
తను నెదుగుతూ తాకు నీ తండ్రి ప్రేమల్
తను తిరుగుతూ తాకు నీ చెల్లి ప్రేమల్
తను కదులుతూ తాకు మా యింటి ప్రేమల్ (3)
వలపు లొలికెన్ వాడి తాతయ్య కూడా
తెలిపె పలుకుల్ తెచ్చి "నాసా"ది రేకెట్
అలుపు నొదిలే యట్టతో "ఆర్టు" చేసీ
తళుకుమనెరా తాత ప్రోప్స్ లన్ని నేడున్ (4)
మనసు పలికే మాట "కన్నయ్య చెర్రీ
కనర చినుకుల్గా శుభాకాంక్షలన్నీ
దినము వెలుగుల్ దివ్యకాలమ్ము పొందై
వనము వలపుల్ స్వాభిమానమ్ము తోడన్" (5)
***********************************************
చంద్రలేఖ పద్య లక్షణములు
వృత్తం రకానికి చెందినది
అతిజగతి ఛందమునకు చెందిన 1184 వ వృత్తము.
13 అక్షరములు ఉండును.
19 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: I I I - I I U - U I U - U I U - U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు 7 వ అక్షరము యతి స్థానము
ప్రతి పాదమునందు న , స , ర , ర , గ గణములుండును.


Saturday, November 24, 2018

HSS - My first Song





English Translation by Chaitanya Ji (Prerana Shakha)

anyabhUmi nandu punyabhUmi vindu
— punya Bhumis treat/reunion on foreign land
sangha bandha mandu samskArapu pondu
—-sangh binding gives Mytri with sanskar


viswadharma kAksha asvamehda yajnam
—- wish for Vishwa dharma is like performing ashwameda yaaga
viswasanthi margam vijaya sOphAnam
—- the path for Vishwa Shanthi always leads /steps to victory
svAbhimAnamEmi svAgathinchakunda
—- with out welcoming / encouraging personal ego/self respect
swayamsEvakatvam swadharma lakshyam
—-  goal deep with in (swadhharma) is swayamsEvakatvaaa


tanuvu sakti penchi manasu swacchatenchi
— (shakha) improves body strength and mental peace
nAdi nIdi anna nAtakammu vIdi
— dissolves the drama of mine and yours
mAdi manadi antu mArpu kOrukuntu
— wishing for a change (in society) by (saying) the mantra of hum aur hamarA
malachu sanghavarga valapu kEdi minna
—-  what else is better than the love towards sangha which is working for change



Thursday, November 15, 2018

తాతయ్యగారి పుట్టిన రోజు

పద్మనాభము
తాతయ్య గారండి తోడుండి నారండి తా కోరు మాయందు క్షేమమ్ము లెన్నో
ఆ తృప్తి లోనండి చేదోడు వాదోడు నా పడ్డ  సేవంత  ఛేదించు వారై
ఆ తీపి రోజుల్ని గుర్తించి నేడండి ఆత్మీయ బంధమ్ము బంధించినారే
మా తండ్రి వారండి మా విద్య నేర్పించు మా దైవమేనండి విశ్వమ్ము నందున్   (1)

Wednesday, November 14, 2018

ఉత్పలమాల ఒత్తులు లేకుండా

ఉత్పలమాల:
***************************************
ఏమది! మీరు కోరినది "యెందుకు నేనునుఁ జేయలేననిన్"
నా మది నెంచి, రాయగల నా సమయోగము నిందుఁ జూపుచున్
నీమము నందుఁ దూగుటకు నేఁ దగు దారినిఁ జేరి, వీరులౌ     
మీ మది నాదరింపులను మీటెడు యోగముఁ బొందఁ గోరెదన్ !
***************************************

Monday, November 12, 2018

పూర్వీ కన్నే

******************కన్య *****************
పూర్వీ కన్నే
నిర్వాహమ్మున్
ఉర్వీ కన్నౌ
పర్వమ్మొచ్చెన్ (1)
నిర్వాహము = శక్తి
ఆ రామందున్
చేరేరోజై
మారామేదిన్
ఆరా లేదే (2)
ఆ సీతా యే
ఈ సీతమ్మై
ఆ సిగ్గుల్నే
చూసారమ్మా (3)
ఈ సంజ్ఞల్ తా
చేసే! రామా !
వేసమ్ముల్ తా
వేసే! రామా ! (4)
సంతోషమ్మౌ
ఎంతో మాకున్
అంతో కొంతో
వంతౌ మీకున్ (5)
***********************************
కన్య పద్య లక్షణములు
వృత్తం రకానికి చెందినది
ప్రతిష్ఠ ఛందమునకు చెందిన 1 వ వృత్తము.
4 అక్షరములు ఉండును.
8 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: U U U - U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు మ , గ గణములుండును.


Friday, November 2, 2018

గందరగోళపు జన్మ ...

గందరగోళపు జన్మ ...
*****************రథోద్ధతము*********************
కాలగర్భమునఁ గాలు మోపుచున్
నేల తాకిడికిఁ నేను బుట్టెరా
పాల బుగ్గలనుఁ బాల స్వచ్ఛతన్
మేలు జన్మయని మెచ్చినానుగా (1)
నమ్మకమ్ములకు నాన్న, అమ్మలన్
వమ్ము చేయరను బంధు మిత్రులన్
నెమ్మి జూపగల నేస్తమందునన్
కమ్మగా దలఁచుఁ గల్మషమ్ముతో (2)
ప్రేమ భావనలఁ బ్రీతి పెంచగన్
ఏమి జన్మయని నెక్కు పెట్టెరా
చీమ జాతికినిఁ జేటు చెయ్యరే
ఏమి మానవులు నిట్లు శుద్ధులౌ (3)
సత్యమాడగల సాధువందురే
నిత్యహింసలను నేర్వరాదనెన్
కృత్యముల్ కని నకృత్యమొద్దనెన్
ముత్యమౌదునని ముద్దులెట్టుచున్ (4)
.......
ఇంతలోనదియు నేల మారెరా
వంతులేసుకొనిఁ బంతమొందుచున్
చెంత స్వార్ధములఁ జేదు భావముల్
ఎంత నమ్మగలఁ నిట్టి పుట్టుకన్ (5)
డాబు ప్రేమలని డబ్బు ముఖ్యమౌ
జేబు నింపుటకు జీవితమ్ముగా
మా బడిన్ చదువు మార్పు నేర్పుచున్
నీ బలమ్ములను నెట్ట మందురే (6)
నీది నాదనుచు నింద మోపుచున్
వేదవాక్యములు వీడు చుండుచున్
మేదినిన్ విఱచి మీరు వేరనిన్
వాదముల్ పెఱిగి వాఁగు లెక్కువౌ (7)
వేరు వర్గమను వెఱ్ఱి వెఱ్ఱిగా
వేరు వర్ణమను వెఱ్ఱి కొందఱున్
వేరు లింగమను వెఱ్ఱి వింతలన్
వేరు కోరుకొని విగ్రహించురా (8)
విగ్రహించు = కొట్లాడు, క్రుమ్ములాడు
నీతివాక్యములు నేడు చెప్పుచున్
కోతికార్యములు కూర్చి చూపుచున్
జాతి బాలలను సంస్కరించు నీ
రాతి మానవుల రంగు చూడరా (9)
**************************************
రథోద్ధతము (పరాంతికము)
ఈ పద్య ఛందస్సుకే పరాంతికము అనే ఇతర నామము కూడా కలదు.
వృత్తం రకానికి చెందినది
త్రిష్టుప్పు ఛందమునకు చెందిన 699 వ వృత్తము.
11 అక్షరములు ఉండును.
16 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: U I U - I I I - U I U - I U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు 7 వ అక్షరము యతి స్థానము
ప్రతి పాదమునందు ర , న , ర , వ(లగ) గణములుండును.


Monday, October 29, 2018

గౌరీకై

***************************
"నారీ" లో
ఈ రోజీ
నా రాతల్
గౌరీకై (1)
ఛందమ్మున్
అందమ్మున్
బంధమ్మున్
విందౌచున్(2)
నీ భావ
మ్మే భాగ్య
మ్మౌ, భవ్యా!
నీ భక్తిన్ (3)
భవ్య = పార్వతి
శ్రీగౌరీ
నీ గాథల్
రాగాలై
సాగంగా (4)
నా యమ్మై
నా యాత్మన్
నీ యూహల్
నా యందున్ (5)
ఈ ప్రాయ
మ్మే ప్రీతిన్
నీప్రేమా
సుప్రేమౌ (6)
***************************
నారీ (జన , పుష్ప , మద , మధు , బలి)
ఈ పద్య ఛందస్సుకే జన , పుష్ప , మద , మధు , బలి అనే ఇతర నామములు కూడా కలవు.
వృత్తం రకానికి చెందినది
మధ్య ఛందమునకు చెందిన 1 వ వృత్తము.
3 అక్షరములు ఉండును.
6 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: U U U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు మ గణములుండును.

Tuesday, October 23, 2018

ఏమౌ నీ భరతావనిన్?

**********************శార్దూలవిక్రీడితము****************************
ఏమౌ నీ భరతావనిన్? తగువులే లీ దైవకార్యమ్ములన్
సామాన్యార్హతలందు సంస్కరణముల్ సాధించు వ్యూహమ్ముతోఁ
బ్రామాణ్యమ్ములు లేని ప్రేరణముతోఁ రాద్ధాంతమున్ బెంచుచున్
వ్యామోహమ్ములతోడఁ వేదనల నాహ్వానించి క్షీణించెగా! (1)
సంస్కారమ్ములు లేని విద్యలకుఁ బ్రోత్సాహమ్ము తోడైనచో
సంస్కారమ్ములు లేక పౌరులు నిరుత్సాహమ్ముతోఁ, దుష్టులన్
సంస్కారమ్ములు నమ్మి నేర్చుచు, మనస్థాపమ్ము తోఁ దేశమున్
సంస్కారమ్ములు నేల కూల్చుచు విశిష్టమ్మున్ విసర్జించెరా (2)
***********************************************************************
శార్దూలవిక్రీడితము
వృత్తం రకానికి చెందినది
అతిధృతి ఛందమునకు చెందిన 149337 వ వృత్తము.
19 అక్షరములు ఉండును.
30 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: U U U - I I U - I U I - I I U - U U I - U U I - U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు 13 వ అక్షరము యతి స్థానము
ప్రతి పాదమునందు మ , స , జ , స , త , త , గ గణములుండును.

Saturday, October 20, 2018

అమృత్ సర్ విషాదం

Sorry to hear about Amrithsar.. RIP to all
అమృత్ సర్ లో ప్రజల ఆత్మశాంతి కోరుతూ ...
***********************చంచల *************************
కోరి తెచ్చి నారు వీరు క్రూరమైన బాధకమ్ము
చేరి రైలు బిద్దెలందు చిత్రమైన బిద్దె నేడు 
నేర మెవ్వ రందు నున్న నిప్పు పెట్టె నాప్తులందు
తీరు నేల శోకణాలు తీరమెప్డు చేరు వారు? (1)
బాధకము = బాధించునది
బిద్దె1 = crossbars , బిద్దె2 = దుర్గతి
శోకణాలు = ఏడ్పులు
చేయగోరు సంస్థ వార్కి చేతకాని కార్య మౌచు
రేయి యంచు ఇంగితమ్ము లేని పర్యవేక్షణమ్ము
ఓయి! రాజకీయ క్రీడ! ఒప్పుకోవ హింస జేసి?
తీయలేని బండి వానిఁ దిట్టు టేల సిగ్గు లేద? (2)
మానవుండు కూడ యేల మంద బుద్ధి జూపి నాడు
స్థానమందు బండి వెళ్ళు దారి యంచు కానలేడ?
ప్రాణమందు తీపిలేని ద్రష్ట యౌచు నేల నోయి?
దీనియందు కొంచెమైన దేశమందు మార్పు రాద? (3)
ద్రష్ట = చూచువాఁడు
************************************************
మల్లేశ్వరరావు పొలిమేర
10.20.3028
చంచల (చిత్రశోభ,చిత్రమ్)(పంచపాది)
వృత్తం రకానికి చెందినది
అష్టి ఛందమునకు చెందిన 43691 వ వృత్తము.
16 అక్షరములు ఉండును.
24 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: U I U - I U I - U I U - I U I - U I U - I
5 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు 9 వ అక్షరము యతి స్థానము
ప్రతి పాదమునందు ర , జ , ర , జ , ర , ల గణములుండును.

Friday, October 19, 2018

అందరికీ విజయ దశమి శుభాకాంక్షలు

అందరికీ విజయ దశమి శుభాకాంక్షలు
*****************కనకప్రభ*********************
ధరణిన్ మరో విజయ దస్మి వచ్చెగా
స్థిరమున్ మరో విజయ తీర వాంఛతో,
సిరిసంపదల్ మనకు స్వీయమౌనుగా
పరమేశ్వరిన్ గొలుచు ప్రార్థనీయమున్ (1)
ప్రార్థనీయము = వేఁడఁదగినది.
స్వీయము = belonging to one's self, తనది
ప్రజలందఱున్ కలిసి రంగవల్లిగా
విజయోత్సవమ్ము జరిపించు పండుగౌ
త్యజనమ్ముతోడ చెడు తత్వ మేరుచున్
నిజరూప సంస్కృతగు నేటిభారతిన్ (2)
త్యజనము = giving up
అలనాటి గాథలవి యమ్మ తోడుగా
మలచారు మానవుని మంచి కోరుతూ
చిలుకైన చేటు మన చేతనంటునా
వెలిగించు దివ్యమును విశ్వశాంతికై (3)
దురగమ్మ రూపమున దుష్ట శక్తులన్
సరియైన మార్గమున సంహరించుచున్
మఱునాడు మంచియను మార్గ మెంచుతూ
పరిపూర్ణ జీవితము పంచు పండుగౌ (4)
*****************************************
మల్లేశ్వరరావు పొలిమేర
10.19.2018
కనకప్రభ (మంజుభాషిణి , జయా , నందినీ , ప్రబోధితా , మనోవతీ , విలంబితా , సునందినీ , సుమంగలీ)
వృత్తం రకానికి చెందినది
అతిజగతి ఛందమునకు చెందిన 2796 వ వృత్తము.
13 అక్షరములు ఉండును.
18 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: I I U - I U I - I I U - I U I - U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు 9 వ అక్షరము యతి స్థానము
ప్రతి పాదమునందు స , జ , స , జ , గ గణములుండును.

Sunday, October 7, 2018

GITAM

మరి శ్యామ్, బాపి అడిగారు కదా...
********
పదహారేళ్ల వయస్సు
మన
పచ్చటి స్నేహానికి...

పరిణతి చెందిన వయస్సు
మన
పరిపక్వపు ప్రవాహానికి...

రెసిస్టెంటు లేని ఓమ్స్ లా అగు
మన
విద్యుత్ ప్రవాహానికి...
I=V/R -> R=0 , So I= Infinite

గీతమ్ అనే జంక్షన్లో
క్రిచ్చాఫ్స్ కరెంట్ లా అగు
కలసి విడిపోయిన
మన
మనసుల ప్రవాహానికి...
I=I1+I2+I3...

జీవితమనే వలయంలో (loop)
క్రిచ్చాఫ్స్ వోల్టేజ్ లా అగు
కలసి పంచుకున్న
మన
బంధాల సమూహానికి...
V=V1+V2+V3...

లీనియర్ నెట్ వర్కులో
భవబంధాల నిరోధములో (Rth)
సమపాల్లలో (Vth or Ith)
తెవినీన్స్, నార్టాన్స్ థీరమ్ ను నిలుచు
మన
సున్నిత సహవాసానికి...
Ith = Vth/Rth , Vno = Ino X Rno

స్టెప్ అప్ స్టెప్ డౌన్ ట్రాన్స్ ఫారమ్ లా
ఎదిగి ఒదిగి ఉండే
మన కలయిక
మరెన్నో ఏళ్ళు ముందుకు
సాగాలని కోరుతూ...
**
అన్వయించుకుంటే అన్నీ
మన
మైత్రికి మరో  సోఫానాలే....

- మల్లేశ్వరరావు పొలిమేర
10.07.2018
********

Tuesday, October 2, 2018

గౌరిన్ గొల్చెదను

**********హంసరుత*****************
గౌరిన్ గొల్చెదను గైతల్
గౌరిన్ దల్చెదను గైతల్
గౌరిన్ మల్చెదను గైతల్
గౌరిన్ వెల్చెదను గైతల్ (1)
ఛందాలే నగలు గాగా
యందమ్మౌ కళల తోడన్
బంధాలున్, విరచితమ్మై
గంధమ్మున్ పుడుకుచుంటిన్ (2)
పుడుకు = ఇచ్చు
పువ్వుల్ నా పదములౌచున్
నవ్వుల్ నా స్వరములౌచున్
మువ్వల్ నా నాదులగుచుండన్
దివ్వెల్ నా యతులు, ప్రాసల్ (3)
నాదు = చప్పుడు
ఆశాజ్యోతి వెలుగంగా
కోశాగారపు మనస్సున్
నా శక్తిన్ తెలుపగా నీ
ఆశీర్వాదముల నిమ్మా (4)
***************************
కోశాగారము = ఖజానా
హంసరుత
వృత్తం రకానికి చెందినది
అనుష్టుప్పు ఛందమునకు చెందిన 57 వ వృత్తము.
8 అక్షరములు ఉండును.
13 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: U U U - I I I - U U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు మ , న , గా(గగ) గణములుండును.

గౌరిన్ కొల్చెదను

**********హంసరుత*****************
గౌరిన్ కొల్చెదను కైతల్
గౌరిన్ తల్చెదను కైతల్
గౌరిన్ మల్చెదను కైతల్
గౌరిన్ వెల్చెదను కైతల్ (1)
ఛందమ్మున్ నగల నెన్నో
అందమ్మున్ కళల తోడన్
బంధమ్మున్, విరచితమ్మున్
గంధమ్మున్ పుడుకుచుంటిన్ (2)
పుడుకు = ఇచ్చు
పువ్వుల్ నా పదములౌతున్
నవ్వుల్ నా స్వరములౌతున్
మువ్వల్ నా హృదయ నాదుల్
దివ్వెల్ నా యతుల ప్రాసల్ (3)
నాదు = చప్పుడు
ఆశాజ్యోతులను బెంచే
కోశాగారపు మనస్సున్
నా శక్తిన్ వెదకునట్లున్
ఆశీర్వాదముల నిమ్మున్ (4)
***************************
కోశాగారము = ఖజానా
హంసరుత
వృత్తం రకానికి చెందినది
అనుష్టుప్పు ఛందమునకు చెందిన 57 వ వృత్తము.
8 అక్షరములు ఉండును.
13 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: U U U - I I I - U U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు మ , న , గా(గగ) గణములుండును.

Tuesday, September 25, 2018

మనకేమి దుస్థితిది

**********************కనకప్రభ********************
మనకేమి దుస్థితిది మంచి నేర్వకన్
మనబిడ్డలందరును మల్లెమొగ్గలై
తనచిన్న ప్రాయమునుఁ దాప మెక్కువై
వెనువెంట వెళ్ళెదరుఁ బ్రేమ కోసమై (1)
తను కన్న వారిదినిఁ దక్కువైనదా
తన మీద ప్రేమయును దండనౌదునా
తన మంచి కోరుకొను తల్లిదండ్రులై
తను గుండె చప్పుడయి తల్లడిల్లెగా (2)
అనువైన ప్రాయమును అర్థమౌనుగా
మనతోడు ప్రేమమును మానసమ్మునన్
వినలేవ పెద్దలను, విద్య నేర్చుచున్
కనలేవ సాధనము కార్యసిద్ధికై (3)
పరులంత వర్ణమని, స్వార్ధబుద్ధితో
కురిపించి వార్తలను కోతిమూకలై
కొఱగాని కొయ్యవలె కొట్టుకున్నచో
సరియౌన దేశమున చక్కబెట్టుటన్ (4)
మన ప్రేమ చిత్రములు మట్టు బెట్టెనా?
ప్రణయమ్ములంటితిరి పాఠశాలలో
ఎనలేని నాత్రములు నెక్కు పెట్టుచున్
మనవారి విద్యలను మంటఁ గల్పుచున్ (5)
అది చించకుండకను నందరందఱున్
పదివేల మాటలని వక్రబుద్ధితో
చదువుండి సాధ్యపడు సక్ర మార్గమున్
మదినెంచ లేరు నిది మార్పుఁ జెందదా? (6)
*****************************************************
కనకప్రభ (మంజుభాషిణి , జయా , నందినీ , ప్రబోధితా , మనోవతీ , విలంబితా , సునందినీ , సుమంగలీ)
వృత్తం రకానికి చెందినది
అతిజగతి ఛందమునకు చెందిన 2796 వ వృత్తము.
13 అక్షరములు ఉండును.
18 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: I I U - I U I - I I U - I U I - U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు 9 వ అక్షరము యతి స్థానము
ప్రతి పాదమునందు స , జ , స , జ , గ గణములుండును.

Wednesday, September 19, 2018

చిక్కాల బడి

మనము చిక్కాల బడికంటు మార్గ మందు
కాలి నడకలో నూసులు మేళవించి
స్నేహ బంధపు నొడిలోన చిగురు తొడిగి 
గోల జేసిన రోజులు గుర్తుకొచ్చె

కొలను ప్రక్కన కూర్చొను గువ్వ లౌచు
ఆట పాటలు చదువుల నారగించి
గురువు లేనిచో మాటల కూర్పు తోటి
ఏమి పండుగ రోజులు నెమ్మి నందు

Tuesday, September 18, 2018

ద్వేషము బెంచిన

సీ.
ద్వేషము బెంచిన తీయటి బంధము
తండ్రని మరచిన తండ్రి యతను
కూతురు బతుకును కూల్చునని మఱచి
కోరుకున్న పగల గుడ్డి వాడు 
ప్రేమగ బెంచెను ప్రేమకై తుంచెను
ప్రేమలో కడతేర్చె ప్రియుని నతను
నందరి ముందర నలుసగు, తండ్రియే
ఆదికాలమునుండి యాప లేక
తే.గీ.
మానవత్వము మిన్నగ మంచి చూడు
ఎన్ని ద్వేషములున్నను నెంచి చూడు
మనిషి జీవము తీసిన మార్చగలమ?
మనసు మందబుద్ధిని నేడు మట్టు బెట్టు
పిల్లలందున ప్రేమలు ప్రియుని కన్న
పెద్ద పుంతలు తొక్కుచు పేరుకున్న
తెలిపి చూపెదవెన్నియో దీవెనలను
పరువు నిలిపి బంధములను పంచగలవు

Saturday, September 15, 2018

సుప్రభ గార్ని కలిసిన రోజు

*************************************
చ. గురువుల సన్నిధమ్ములవి కోరగ వచ్చును కొద్దిమందికే
పరిణతిఁ బొందు కాలమను భాగ్యము, నిత్యము మీకు నుండగా
గురువుగ నేనుఁ దల్చు మిము కొద్దిగఁ గల్వగ నాదు భాగ్యమై
మరువని రోజు నాకునది మంచి దినమ్ముగ, ధన్యవాదముల్!
*************************************

Wednesday, September 12, 2018

మా చేతుల మీదుగా మా పెరటిలో పెరిగి వచ్చిన కూరగాయలకు కొన్ని పద్యాలు ...

మా చేతుల మీదుగా మా పెరటిలో పెరిగి వచ్చిన కూరగాయలకు కొన్ని పద్యాలు ...
****************భోగివిలసిత(కుప్యమ్)**********************
మా పెరటిని సామరస్యమై
మా పలుకులు నామమంత్రమై
మా పలువురి ప్రేమ పాదులన్
కాపును నిల సంగమించెఁగా (1)
********
గోగు దళములొంగు చెట్లతో
సాగు మొదలు పచ్చ పచ్చగా
లాగు దవడ పుల్లపుల్లగా
దాగు రుచులు నాంధ్ర పచ్చడిన్ (2)
గోగు దళము = గోంగూర ఆకులు
********
నూగు కలిగి మేను బెండగా
వేగినపుడు నావి, చారులో
బాగ మునిగి యాపలేనిదౌ
దాగు రుచులు నాంధ్ర బెండలో (3)
మేను = శరీరము, ఆవి = ఆవిరి, తాపము
********
ఆనబ లవియే యలా జతై
వేణువుల వలే ప్రియమ్ముగా
లేని సొగసు వాలి పందిరిన్
గానములిడు రాగ మాలికన్ (4)
********
ఆనబ చవియే యనాన్యమై
కానగబడు నంగ పాలతో
కూనలకది బాగు నువ్వులన్
దాని రుచులు నాంధ్ర మెండులే (5)
చవి = రుచి, అంగ = అచ్చగా
********
బీరవి మడిలో విరాజితై
కోరిన కొసరున్ కుదుర్చుచున్
చేరువయెను మెచ్చె కూరలన్
తారసపడు నాంధ్ర వంటలో (6)
********
మా పెరటిని సామరస్యమై
మా పలుకులు నామమంత్రమై
మా పలువురి ప్రేమ పాదులన్
కాపును నిల సంగమించెఁగా (1)
**************************************
భోగివిలసిత(కుప్యమ్)
వృత్తం రకానికి చెందినది
పంక్తి ఛందమునకు చెందిన 351 వ వృత్తము.
10 అక్షరములు ఉండును.
14 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: U I I - I I U - I U I - U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు 7 వ అక్షరము యతి స్థానము
ప్రతి పాదమునందు భ , స , జ , గ గణములుండును.

Wednesday, September 5, 2018

గురుపూజా దినోత్సవ శుభాకాంక్షలు

గురుపూజా దినోత్సవ శుభాకాంక్షలతో నా గురువులందఱకు ...
******************************************************************
మత్తేభవిక్రీడితము:
గురువున్ కొల్చెడి సాంప్రదాయమున లోకోద్ధర్తగాఁ దల్చుచున్,
ధరణిన్ నిత్యము ధార్మికత్వమును సంధానమ్ము బోధించగా 
కరుణన్ ప్రేమను వ్యాప్తిజేయమను నా కర్తవ్య సవ్యేష్ఠునిన్,
కరముల్ జోడుచు వందనమ్ములను సంస్కారమ్ముతో నిచ్చెదన్ (1)
ఉద్ధర్త = ఉద్ధరించువాఁడు, సంధానము = కూర్చుట, సవ్యేష్ఠుఁడు = సారథి
చిత్రపదము:
బుద్దులు నేర్పిన అమ్మన్
పద్దులు నేర్పిన నాన్నన్
సుద్దులు నేర్పగఁ నొజ్జన్
మద్దతు నిచ్చిన వారున్ (2)
బోధన పద్దతి లందున్
శోధన నిచ్చెడి రీతిన్
బాధను నోర్చెడి శక్తిన్
సాధన నందున నిచ్చున్ (3)
మారిన కాలము లందున్
మారిన లోకము నందున్
మారిన మార్పుల తోడన్
కోరును నేర్పును వారున్ (4)
ఒజ్జ = గురువు, మద్దతు = సహాయము
కందం:
సర్వేపల్లి స్మరణతో
సర్వ జనులిటుల గురువుల శక్తిని మెచ్చున్
మర్వక నిత్తుము వందన
పూర్వక గౌరవములన్ని ప్రోత్సాహమ్మున్ (5)
******************************************************************

Monday, September 3, 2018

శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు

శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు
***************** *****************
తే.గీ. రాధమాధవధామను “రాధె రాధె
కృష్ణ కృష్ణ” యనుచు మమ్ము కృష్ణ పిలిచె
వెల్లి జన్మాష్టమందున విషయములను
పంచదలచితి మీకును పండుగంత (1)
ఆ.వె. రాధె రాధె రాధె రాధె రాధ ప్రియుని
కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ
రాధె రాధె రాధె రాధె రాధ ప్రియుని
కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ(2)
తే.గీ. పూర్వి మారుచు రాధగ పూల తోడ
పిలిచె “నెక్కడ కృష్ణ” ని వలపు తోడ
నిలిచి వస్త్రధారణ పోటి నెగ్గినంత
కలిగె నీరూపు బహుమతి కంట నిండ (3)
తే.గీ. చిన్ని కృష్ణను జేరిన చిన్నతనము
సంతషించెను బొమ్మను చంకనుంచి
“కృష్ణ వచ్చెను” నాన్నని కృష్ణ యందు
మునిగి తేలుచు నాడెను ముద్దు పట్టి (4)
ఆ.వె. చిన్నతనపు పల్లె చిత్రములు తలచె
నుట్టి కొట్టి పట్టు నుత్సాహమ్ను
పెరుగులోన తడిసి పరుగు పరు గెగిరి
పట్టలేని తనపు చిట్టి వలపు (5)
తే.గీ. ఏమి దర్శన భాగ్యము నెదను దట్టి
ఏమి కారణ జన్మము నిలను పట్టి
ఏమి స్పర్శది మానసమేగి ముట్టి
ఏమి స్మరణ కన్నయ్య యిట్టి చుట్టి (6)
***************** *****************

Wednesday, August 29, 2018

తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.

తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.
ఏ ఛందస్సులో అని ఆలోచిస్తూ సుప్రభ గారి పద్యములు చూసి ...
--
రాజమరాళ /కరశయా వృత్తము
--
గణములు - న,భ,ర
యతి లేదు
******************************************
తెలుగు భాషకు పండుగౌ
వెలుగు జూపెడు రోజుగా
పలుకు లందున ముత్యముల్
చిలుకు తెల్గుల వీరుడా (1)
నిలుపు నిత్యము గర్వమున్
కలుపు మాటల బంధమున్
తెలుపు తేనెల తేటలన్
తలపు లందున వీరుడా (2)
అలలు పొంగిన రీతిగా
జలము పాఱెడు వాగుగా
కులుకు లొల్కెడు భాషయై
మలుచు పిల్లల జన్మమున్ (3)
తళుకు తారల సందడిన్
నలుపు రాత్రిని చంద్రుడై
కళల లోకపు కాంతులన్
విలువ కల్గిన భాషరా (4)
******************************************

Tuesday, August 28, 2018

రాఖి పండుగ

కెల్లరు , టెక్షాస్ అగ్నిమాపక దళము , రక్షక భటులతో మా రాఖి పండుగ వివరాలు
"చిత్రములు రసధుని గ్రూపులో ఉంచెదను"
***********************************************************
మ.కో. రాఖి పండుగ లోకమందున రమ్యమైనది బాల కా 
రాఖి పండుగ నక్కచెల్లెలు రక్షకోరును సోదరున్
రాఖి పండుగ గుర్తుచేయును రక్షనిచ్చెడు ఖాకిలన్
రాఖి పండుగఁ బంచభూతములందు రక్షని కోరురా (1)
త. మనుషులందున బంధముల్ తమ మార్గమందున జేర్చుచున్
మనసులందున బాధ్యతల్ తమ మంచిభావము లందుచున్
మనసమాజపు సఖ్యముల్ తగు మార్పునిచ్చుచు వచ్చు నీ
దినము పండుగ వేడుకై తన దివ్యమైనటి శోభతో (2)
మ.కో. కెల్లరందున నగ్నిమాపక కేంద్ర ధీరుల తోడుగాఁ
నెల్లరందున రక్షనిచ్చుచు నేర్పుచూపిన రక్షకుల్
చెల్లునంటిరి రక్షకట్టెడు శ్రేష్ఠమైనటి పండుగన్
అల్లుకుంటిరి భారతీయుల నందమైనటి సంస్కృతిన్ (3)
***********************************************************
మల్లేశ్వరరావు పొలిమేర
08.28.2018

Monday, August 27, 2018

భక్తి భావపు ఆటవెలదులు

********భక్తి భావపు ఆటవెలదులు ***********
అమ్మ యన్న భక్తి నమ్మకానికి శక్తి
అమ్మ కన్న మిన్న యవని నేది?
అమ్మ వేరు వేరు యనుచు నందఱును, మా
యమ్మ మతము గొప్ప యనుట లేదు! (1)
నాన్న యన్న భక్తి వెన్నెముకఁగఁ దల్చు
నాన్న మార్గమిచ్చి నాంది పలుకు
నాన్న వేరు వేరు యున్న నందఱును, మా
నాన్న మతము గొప్ప ననుట లేదు! (2)
గురువు యుక్తి నెఱిఁగి కోరు జ్ఞానపు బోధ
గురువు యందు "లేని" గురుతు లేదు
గురువు వేరు వేరు గున్న నందఱును, మా
గురువు మతము నుండు గొప్ప యనరు! (3)
మీరు నమ్ము చుండి, మెచ్చెడి దేదైన
మీకు సొంతమౌను మేలు కొఱకు
వేరు వారి మతము వారి భక్తికి చెల్లు
ఎవరి మతము వారి యెదనుఁ దట్టు (4)
భక్తి భావ మందు వరలును స్నేహమ్ము
భక్తి మూఢు లందు బ్రతక లేదు
భక్తు లందు మూఢ భక్తులు వేరయా
భక్తి నెరిగి మసులు బాధ్యుడవుచు! (5)
మంచి చెడులు వీడి మానవత్వము వీడి
మనిషి బ్రతుకు కొఱకు మసల లేక
మతము నందు దాగు మంచిని నేర్వక
మాది మీది యనుచు మంట లేల? (6)
***********************************************
మతము = అభిప్రాయము
మల్లేశ్వరరావు పొలిమేర
08.27.2018

Tuesday, August 21, 2018

కృష్ణసర్పబంధము -1

కృష్ణసర్పబంధము -1
=========================
తే.గీ (పంచపాది )
*********************************************
పార్వతి శివులను తలపై పాగ నెత్తి 
పానుపునను కానుకలను , పండ్లుఁ గాక
పైకములను రాశిగ సమర్పణముఁ గనుచు
మూడగు ప్రదక్షిణములను మోదమున, స్వ
స్తి, ముగితి గలిగి ప్రదమును తిరుగు నాడు.
*********************************************
మల్లేశ్వరరావు పొలిమేర
08.21.2018
ప్రదము = జయప్రదమైన కార్యము
సుప్రభగారు మరియు పలువురి కృష్ణసర్పబంధములు జూసి వ్రాయవలెనున్న సమయము ఇప్పటికి కుదిరినది. ఇది ఒక ప్రయత్నము మాత్రమే. ఎంతవరకు సఫలమో మీరే తెలుపవలెను.
మా ఊరి (గవరపేట)దేవతను తలచి చాలా రోజులయినది అని ఆ పార్వతి దేవి పండుగ రోజు ప్రతి ఇంటిముందు పానుపులతో
ఆహ్వానించు సమయమును ఇక్కడ వివరించదలచాను.
మొదటగా ప్రక్క ఇంటినుంచి మా ఇంటికి తీసుకురావడానికి ఇంటి యజమాని మంచి తలపాగ ధరియించి, తలపైన పీఠకముతో పార్వతి శివులను ఎదురువెళ్ళి ఎత్తుకుని తీసుకువచ్చి , పానుపునిండ తన శక్తికొలది కానుకలను, పండ్లను, చదివింపుగా డబ్బులునుంచి, పానుపు చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ జేసి సంతోషమున
ఆ మంచి కార్యమును జేసి పూజించు నాడు. అయితే ఈ పద్యములో ఆహ్వానించే క్రమమును మాత్రమే వివరించాను.

Sunday, August 19, 2018

Atal Bihari Vajpayee

***********************************************
సీ. భారతమాతకు బాధ్యత తోడను
రాజనీతిజ్ఞుడై వాజుపేయి
భారతరత్నయి వ్యక్తిత్వ వక్తగ
కవిరాజు తానౌచు ఖ్యాతికెక్కె
దేశాభివృద్ధికై ధీరత్వ పటిమతో
బ్రహ్మచర్యమునందుఁ బట్టుబట్టె
కలగన్న రారాజు యలయుచు నీరోజు
కాలగర్భములోనఁ గన్ను మూసె
తే.గీ. నాతరము వారెఱుఁగు మంచి నేత యతను
నా ప్రదేశము గర్వించు సుప్రవరుఁడు
నాణ్యతకు మారుపేరగు పుణ్యుడతను
నేను శ్రద్ధాంజలిడిచెద దీనముగను.
***********************************************
మల్లేశ్వరరావు పొలిమేర
08.16.2018
ప్రదేశము = దేశము
సుప్రవరుఁడు = మంచి శ్రేష్ఠుఁడు (శ్రేష్ఠులలో శ్రేష్ఠుడు )

Saturday, August 18, 2018

అమ్మను కీర్తిస్తూ ...

అమ్మను కీర్తిస్తూ ...
************శ్లోకములు **************
పార్వతి నామ మంత్రమ్మున్
మర్వను నేను మచ్చుకిన్
సర్వము నమ్మ  ధ్యానంతో
గర్వము వీడి కొల్చెదన్  (1)

గవరపేట గాత్రమ్మున్
అవతరించు నమ్మవే
సవివరంగ నీయందున్
ప్రవహించిన భక్తియే (2)

అమ్మలుగన్న నమ్మంటున్
కమ్మగనిన్ను చేరెదన్
నెమ్మిని పొందు శక్తంతా
నమ్ముచు నాకు నొస్గవే  (3)

పల్కులు నాకు నేర్పించీ
పల్కులు నీకు పల్కగన్
మేల్కొలుపు ప్రసాదించెన్
చిల్కుచు నేను సాగెదన్ (4)
*******************************************
 శ్లోకము లేక అమృతవాహిని లేక జయ,
యతి లేదు, ప్రాస నియతము, ఐదు, ఆఱు, ఏడు అక్షరములు
సరి పాదములలో జ-గణము, బేసి పాదములలో య-గణము
శ్లోకము అనుష్టుప్పు ఛందమునకు చెందినది.

మల్లేశ్వరరావు పొలిమేర
08.18.2018

Tuesday, August 14, 2018

స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
************శ్లోకములు **************
భారతమ్మునఁ బౌరుండై
చేరవచ్చిన వీరుడా
కోరుకున్నటి స్వైరమ్మున్
నేరుగాఁ జరిపించరా (1)
బానిసత్వపు కోరల్లో
కూనిఁ జేయుట నేమని
హానిచేయఁకఁ బోరాడి
మేను వీడుచు పొందెరా (2)
వీరులందర్ని గుర్తించి
పేరుపేరునఁ దెల్పరా
వీరత్వమునుఁ గీర్తించి
వారి ఫలము నెంచరా (3)
మనదేశపు మాటల్లో
మనదేశపు చేతలన్
మనదేశపు మంచంత
మనతో నేడు పంచరా (4)
స్వాతంత్రమందు చేయూతన్
స్వాతంత్రమందు గౌరమున్
ఏ తంత్రములు లేవంచున్
నీ తోటి వార్కిఁ బంచరా (5)
******************************************
శ్లోకము లేక అమృతవాహిని లేక జయ,
యతి లేదు, ప్రాస నియతము, ఐదు, ఆఱు, ఏడు అక్షరములు
సరి పాదములలో జ-గణము, బేసి పాదములలో య-గణము
శ్లోకము అనుష్టుప్పు ఛందమునకు చెందినది.
మల్లేశ్వరరావు పొలిమేర
08.15.2018

Wednesday, August 8, 2018

తెలుగు వీర లేవరా

*******************
తెలుగు వీర లేవరా
దీక్షఁ బూని సాగరా
తెలుగు భాష కోసమై
సాక్షి వౌచు నిల్వరా  (1)

తెలుగు నేర్పి చూపరా
వేష భాష లందునన్
తెలుగు జాతి కోసమై
ఆశఁ బెంచి చూపరా (2)

మనము వాడు భాషరా
మాట తీరు మంచిరా 
మనసు నత్తు భాషరా
చేటుఁ గాదు సోదరా (3)

తెలుగు వారి సొత్తుగా
మాతృభాష పిల్లలన్ 
తెలపకున్న  మన్నునా
మాతృ భావ గోష్ఠిరా  (4)

కవుల చేతి ముత్యమై
నేర్పు బెంచు భాషరా
వివిధ శోభ లిచ్చుచున్
చేర్పుఁ గూర్పు విందురా  (5)
*******************
మ.కో. నేను సైతము మాతృభాషను నిష్ఠతోడను నేర్పుచున్
కూనలందున దెల్గువెల్గులు గోరుచుండగ నా మదిన్
ప్రాణ మిచ్చుచు ప్రేమపంచుచు  ప్రాతినిధ్యమె నా విధిన్
మేనునిచ్చిన నాంధ్ర వాక్కుని మేళవించెద మోదమున్ (1) 



Sunday, August 5, 2018

స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు
**********ఆటవెలదులు********************
స్నేహ మన్న మాట చేదోడు వాదోడు
నెట్టి వారి కైన నెదనుఁ దట్టుఁ
నుర్వి జనుల కెల్ల నోదార్పు నిచ్చుచు
బంధువులను మించు బంధ మగును! (1)
చిన్న నాడు మైత్రి చిగురించు తీగలా
అల్లుకొనుచుఁ బూయు మల్లె మనసు
ఎట్టి వైర మైన నింతలో మాయమై
కుదుట పరుచు నోయి కొంటె తలపు! (2)
యుక్త వయసు నందు యుక్తమౌ స్నేహమ్ము
బతుకు తెరువు నేర్పి బాధ్య తిచ్చు
మంచి చెడ్డ లన్ని మాటలోఁ గలబోసి
హాస్య మందు నింపి హత్తు కొనును! (3)
నేటి వరకుఁ గలిసి నిత్యమ్ముఁ దోడుగ
స్నేహ బంధ మిచ్చు స్నేహితులకు
తెలుపు చుంటి నిటులఁ దీయటి పద్యమ్ము
అందఱకు నిడుదును వందనములు (4)
************************************************
మల్లేశ్వరరావు పొలిమేర
08.05.2018

Friday, August 3, 2018

వసంతతిలకము

గత రెండు వారముల నుండి ఏమైంది ...
అంతలో చింతా రామకృష్ణ గారి వసంత తిలకము చూసి ...
*****************వసంతతిలకము******************************
నా పొద్దు నెప్పుడును నాకిల కానరాదే?
నాపూర్వి గజ్జలను నా చెవి కానరాదే?
నా పిచ్చి తల్లి తన నాన్నను వీడలేదే?
నా పంచ ప్రాణమయి నామది దేవులాడున్ ! (1)
తా నన్న తోడుగను తా నడుగేసి సాగెన్
తా నట్టు మామగని తా మురిసింది నాడున్
తానట్టి బంధములు తా నలరించి రాగా
తానేమొ రేపుననె! తా నెపుడొచ్చునంటే? (2)
నా బిడ్డలిద్దఱును నా కనుపాప లౌచున్
నా బంధు ప్రేమములు నా కతియిష్ట మౌచున్
నా బాటలో వెలుగు నా చిరుదివ్వెలౌచున్
నా బల్కులందునను నానుడి గాక యేమౌ? (3)
*****************************************************************
వసంతతిలకము
ఈ పద్య ఛందస్సుకే ఉద్ధర్షిణీ , ఔద్ధర్షిణి , కర్ణోత్పలా , మధుమాధవీ , శోభావతీ , సింహోన్నతా , సింహోద్ధతా , మదనము అనే ఇతర నామములు కూడా కలవు.
వృత్తం రకానికి చెందినది
శక్వరి ఛందమునకు చెందిన 2933 వ వృత్తము.
14 అక్షరములు ఉండును.
21 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: U U I - U I I - I U I - I U I - U U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు 8 వ అక్షరము యతి స్థానము
ప్రతి పాదమునందు త , భ , జ , జ , గా(గగ) గణములుండును.

Thursday, July 26, 2018

మన భారతమ్ము

మన భారతమ్ము  మన మాతృకమునౌచున్
తన పూర్వ శోభలను ధార్మికత తోడన్
మునివర్యులందు తన మూలములు సృష్టిం
చిన దేశ మాత!  తగు శ్రీకరపు మాతా!    (1)

మన పౌరులందఱును మాధ్యమపు బాటై
తన శక్తియుక్తులను ధర్మముల బాటై
మన మానవత్వముకు మార్గములు దీఁటై
వినిపించె లోకముకు  వేదముల నెన్నో! (2)

చెడు లేక మంచియును చిక్కదను రీతిన్
కడు స్వార్ధపౌరులును కాలమున బుట్టెన్
విడగొట్టి లాభములు పెక్కువగు దల్చెన్
కడదేర్చె, వర్ణముల  కార్యముల దోడన్ ! (3)
మాత్రా బద్ధము అనవచ్చో లేదో తెలియదు , మొదటి ప్రయత్నము , యతి ప్రాసలు లేవు ...
మాత్రా బద్ధము (11 )
సూ సూ ఇం గణాలుగా వచ్చాయి
"USA - మనబడి" తరగతులకు పిల్లలను జేర్పించాలని తల్లిదండ్రులను కోరుచూ ...
**************************************
తెలుగు వీర లేవరా
దీక్షఁ బూని సాగరా
తెలుగు భాష కోసమై
సాక్షి వౌచు నిల్వరా (1)
తెలుగు నేర్పి చూపరా
వేష భాష లందునన్
తెలుగు జాతి కోసమై
ఆశఁ బెంచి చూపరా (2)
మనము వాడు భాషరా
మాట తీరు మంచిరా
మనసు నత్తు భాషరా
చేటుఁ గాదు సోదరా (3)
తెలుగు వారి సొత్తుగా
మాతృభాష పిల్లలన్
తెలపకున్న మన్నునా
మాతృ భావ గోష్ఠిరా (4)
కవుల చేతి ముత్యమై
నేర్పుఁ బెంచు భాషరా
వివిధ శోభ లిచ్చుచున్
చేర్పుఁ గూర్పు విందురా (5)
తెలుగు వీర లేవరా
దీక్షఁ బూని సాగరా
తెలుగు భాష కోసమై
సాక్షి వౌచు నిల్వరా (1)
**************************************
వదలవద్దు ... బెదరవద్దు ... వంశవృక్ష సాక్షిరా 😀


Monday, July 23, 2018

అమ్మమ్మ (పార్వతి యల్లపు ) వర్ధంతి

అమ్మమ్మ (పార్వతి యల్లపు ) వర్ధంతి సందర్భముగా నా తలపు ...
***********************పద్మనాభము***********************
అమ్మమ్మ  తోడుండి యమ్మౌచు నాయందుఁ నాత్మీయ బంధమ్ముఁ నల్లించె గాదా
అమ్మమ్మ కష్టమ్ము  నాకల్లలోనుంచి  యౌచిత్యమందించి నేర్పంగ నాడున్ 
అమ్మమ్మ మాటందుఁ నా మంచి యూహందుఁ నందించె చైతన్య జీవమ్ము నేడున్
అమ్మమ్మ వీడుండుఁ నీ రోజునందున్ మహాతల్లి ప్రేమమ్ము గుర్తించు కొంటిన్!     
**********************************************************
పద్మనాభము
వృత్తం రకానికి చెందినది
వికృతి ఛందమునకు చెందిన 1198373 వ వృత్తము.
23 అక్షరములు ఉండును.
39 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: U U I - U U I - U U I - U U I - U U I - U U I - U U I - U U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు 13 వ అక్షరము యతి స్థానము
ప్రతి పాదమునందు త , త , త , త , త , త , త , గా(గగ) గణములుండును.

Friday, July 20, 2018

పరిణతిఁ జెందు చుంటిమని

*******************************************************************
చం. పరిణతిఁ జెందు చుంటిమని వాడలుఁ దిర్గిన లాభమేమిరా
తరిగిన మానవత్వము యథావిధిగాఁ గనిపించుచుండగా
విరివిగ స్వార్థభావములు వేదిక నెక్కిన విఱ్ఱవీగుచున్
సరియగు జీవనమ్ములు ప్రశాంతముగాఁ విహరించునెప్పుడో (1)
చం. తెలియని నాడు నేర్చుకునిఁ దీయటి మాటలుఁ బంచు కొంటిమే
మలినము లేని మానసము మక్కువఁ బెంచెను మేదినందునన్
అలిగిన రోజు నందఱును నైక్యము తోడుగఁ నాదరించెరా
కలిగిన నాడు దానమనుఁ గార్యములందున సంతసించెగా (2)
చం. మనుషులు నంద రొక్కరని మాటలు నేర్చిన మార్పుచెందకన్
వెనుకటి కుక్క తోకవలె విజ్ఞతఁ జూపని దృష్ట బుద్ధితో
కనుగొని వర్ణ భేదములుఁ గంచెయె చేనును మేయుచుండగా
"మనుగడ వృద్ధి చేయుట"ను మానవ జాతికిఁ జేతనయ్యనా ? (3)
చం. కొలిచిన నాడు దూరమునఁ గొండలు నున్పుగఁ గాంచునన్చుచున్
పలికినఁ బిల్లలందరకు, భాద్యత తీరునఁ? జేసి చూపకన్
కలతలు మాని సంఘమున గౌరవమున్ మనుటేలఁ దెల్పుచున్
విలువగు జన్మ సారమును విశ్వమునందున వీడి వీరుఁడౌ (4)
*********************************************************************